రావిపై వేటు..మర్రి దారెటు!

ఉమ్మడి గుంటూరు జిల్లాలో పలు నియోజకవర్గాల్లో కమ్మ వర్గం హవా ఎక్కువ ఉంటుందనే సంగతి తెలిసిందే. ఏ పార్టీ అయినా సరే కొన్ని స్థానాలని నడిపించేది కమ్మ నేతలే. అలా కమ్మ నేతల లీడింగ్ ఉంటే స్థానాల్లో పొన్నూరు, చిలకలూరిపేట కూడా ఉన్నాయి. అయితే రెండు స్థానాల్లో కమ్మ నేతల ఆధిక్యం ఉంటుంది. కానీ గత ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ నుంచి నిలబడ్డ కమ్మ నేతలకు చెక్ పెట్టడానికి జగన్ వేరే వర్గాలకు చెందిన నాయకులని నిలబెట్టి సక్సెస్ అయ్యారు.

పొన్నూరులో టీడీపీ నేత ధూళిపాళ్ళ నరేంద్రపై కాపు వర్గానికి చెందిన కిలారు రోశయ్యని, చిలకలూరిపేటలో టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావుపై బీసీ వర్గానికి చెందిన విడదల రజినిని నిలబెట్టారు. జగన్ వేవ్‌లో అటు రోశయ్య, ఇటు రజిని గెలిచారు. ఇక వీరు గెలిచిన దగ్గర నుంచి ఆ రెండు చోట్ల వైసీపీలో ఉన్న కమ్మ నేతలతో రగడ మొదలైంది. అధికారం ఉండటంతో..వేరే వర్గాన్ని తోక్కేసే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు.

పొన్నూరులో వైసీపీలో ముందు నుంచి పనిచేస్తున్న రావి వెంకటరమణకు చెక్ పెట్టేలా రోశయ్య పనిచేస్తూ వచ్చారు. ఇటు పేటలో  మర్రి రాజశేఖర్‌కు చెక్ పెట్టడమే లక్ష్యంగా రజిని పనిచేస్తూ వచ్చారు. వాస్తవానికి 2014లో వైసీపీ నుంచి రావి..పొన్నూరులో, మర్రి..చిలకలూరిపేటలో పోటీ చేసి ఓడిపోయారు. 2019లో జగన్ చెప్పడంతో పోటీ నుంచి తప్పుకుని, వైసీపీ గెలుపు కోసం పనిచేశారు. ఈ క్రమంలో పొన్నూరులో గెలిచిన రోశయ్యకు, రావి వర్గాలకు ఏ మాత్రం పడలేదు. తాజాగా రావి వర్గానికి చెందిన ఓ నేతపై దాడి జరిగింది. ఈ దాడి చేసింది రోశయ్య వర్గమే అని రావి వర్గం ఆరోపించింది.

అలాగే ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు కట్టారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న వైసీపీ అధిష్టానం రావిపై వేటు వేసింది. పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న రావిపై వేటు పడటంతో, ఆయన అనుచరులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అసలే పొన్నూరులో రోశయ్యపై వ్యతిరేకత ఎక్కువ ఉంది. ఇలాంటి సమయంలో రావిపై వేటు వేయడం వైసీపీకి పెద్ద మైనస్ అయ్యేలా ఉంది.

ఇక రావిపై వేటు పడటంతో పేటలో మర్రి పొజిషన్ ఏంటి అని చర్చ నడుస్తోంది. అక్కడ మర్రి-రజిని వర్గాలకు పడటం లేదు. పైగా ఎమ్మెల్సీ ఇచ్చి, మంత్రిని చేస్తానని జగన్..మర్రికి హామీ ఇచ్చి హ్యాండ్ ఇచ్చారు. దీనిపై మర్రి వర్గం అసంతృప్తిగా ఉంది. అటు రజిని..మర్రి వర్గాన్ని తోక్కేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. మరి ఈ పరిస్తితుల్లో మర్రి రాజకీయం ఎలా ఉంటుందో చూడాలి.