మంగళగిరిలో ట్విస్ట్..వైసీపీకి పట్టు అక్కడే..!

టీడీపీ 40 ఏళ్ల చరిత్రలో కేవలం రెండుసార్లు మాత్రమే గెలిచిన నియోజకవర్గం..టీడీపీ కమ్మ వర్గం పార్టీ అని విమర్శలు ఉన్నా సరే..ఆ కమ్మ వర్గం ఓట్లు పెద్దగా లేని నియోజకవర్గం..అక్కడ ఇప్పుడు సత్తా చాటాలని చెప్పి నారా లోకేష్ కష్టపడుతున్నారు. ఆ నియోజకవర్గం మంగళగిరి అని ఈ పాటికే అందరికీ అర్ధమైపోయి ఉంటుంది. 1983 నుంచి 2019 వరకు చూసుకుంటే…1983, 1985 ఎన్నికల్లో మాత్రమే ఇక్కడ టీడీపీ గెలిచింది.

ఆ తర్వాత టీడీపీతో పొత్తులో భాగంగా 1994లో సి‌పి‌ఐ గెలిచింది. తర్వాత కూడా పొత్తులో భాగంగా సి‌పి‌ఐ, బీజేపీలకే ఈ సీటు కేటాయించింది తప్ప..టీడీపీ పోటీకి దిగలేదు. దీని వల్ల మంగళగిరిలో టీడీపీకంటూ ప్రత్యేక బలం లేకుండా పోయింది. ఇక 2014లో టీడీపీ డైరక్ట్‌గా పోటీ చేసి కేవలం 12 ఓట్ల తేడాతో ఓడిపోయింది. 2019లో నారా లోకేష్ ప్రతీక్ష ఎన్నికల బరిలో దిగి..అనూహ్యంగా 5 వేల ఓట్ల మెజారిటీ తేడాతో ఓడిపోయారు.

ఇక ఓడిపోయాక ఆ సీటు వదలకుండా, అక్కడ ప్రజలకు ఎప్పుడు అండగా నిలబడుతున్నారు. వారానికి రెండు రోజులు నియోజకవర్గంలో తిరుగుతున్నారు. గెలుపే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. అయితే మంగళగిరిలో లోకేష్ బలం బాగానే పెరిగిందని తెలుస్తోంది. రాజధాని అమరావతి అంశం, అభివృద్ధి లేకపోవడ, అక్రమాలు లాంటి అంశాలు వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డికి మైనస్.

ఇక ఎలా చూసుకున్న ఈ సారి మంగళగిరిలో లోకేష్ గెలుపు ఖాయమని ప్రచారం జరుగుతున్న సమయంలోనే వైసీపీ సరికొత్త స్కెచ్‌తో ముందుకొస్తుంది. కులాల పరంగా ఓట్లలో చీలిక తేవడానికి చూస్తుంది. ఇక్కడ ఎక్కువగా ఉన్న పద్మశాలిల ఓట్లు లాగడానికి టీడీపీ నేత గంజి చిరంజీవులుని వైసీపీలోకి తీసుకొచ్చారు. ఈ ప్రభావం కాస్త టీడీపీపై కనిపిస్తోంది. అలాగే ఇక్కడ ఎస్సీ, రెడ్డి ఓట్లు వైసీపీకి బాగా ప్లస్ అవుతున్నాయి.

అందుకే ఎక్కువగా ఉన్న బీసీల ఓట్లలో చీలిక తెచ్చి..లోకేష్‌ని దెబ్బకొట్టాలని చూస్తున్నారు. ఆ మేరకు బ్యాగ్రౌండ్‌లో ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయట. ఇక్కడ లోకేష్‌కు ప్లస్..బీసీ, కమ్మ ఓట్లు..అదే సమయంలో జనసేనతో పొత్తు ఉంటే కాపు ఓట్లు ప్లస్ అవుతాయి. జనసేన కలుస్తున్న నేపథ్యంలో…బీసీల ఓట్లలో చీలిక తెస్తున్నారు. ఇక ఈ ప్రయత్నాలు ఎంతవరకు సఫలమవుతాయో చూడాలి. ప్రాంతాల వారీగా చూస్తే..ఇక్కడ మూడు మండలాలు ఉన్నాయి. తాడేపల్లి, మంగళగిరి, దుగ్గిరాల ఉన్నాయి..అయితే తాడేపల్లిలో వైసీపీ-టీడీపీకి ఫిఫ్టీ-ఫిఫ్టీ అవకాశాలు ఉన్నాయి. దుగ్గిరాలలో టీడీపీకి పూర్తి ఆధిక్యం ఉండగా, మంగళగిరి రూరల్‌లో వైసీపీకి ఎడ్జ్ కనిపిస్తోంది. మంగళగిరిలో టౌన్‌లో టీడీపీకి పట్టు ఉంది. ఎంతో నెగిటివ్ ఉందో అనుకున్నా సరే..మంగళగిరిలో వైసీపీకి పట్టు తగ్గడం లేదు.