రెడ్ జోన్‌లో టీడీపీ..ఆ స్థానాల్లో దారుణం!

వైసీపీపై వ్యతిరేకత పెరిగిపోయింది..అబ్బో అసలు జగన్ పాలన బాగోలేదు..ఎమ్మెల్యేలని ప్రజలు తరిమికొడుతున్నారు.. ఇంకేముంది నెక్స్ట్ ప్రజలు వైసీపీని పక్కన పెట్టి, టీడీపీని ఆదరించేస్తారు అనే ఓవర్ కాన్ఫిడెన్స్‌తో టీడీపీ నేతలు ఉన్నారు. అంటే నాయకులు పెద్దగా గ్రౌండ్ వర్క్ చేయకుండా , ప్రజల్లో తిరగకుండా, వైసీపీపై వ్యతిరేకత తమని గెలిపించేస్తుందనే ధీమాతో ఉన్నారు. ఈ ధీమానే టీడీపీకి అతి పెద్ద మైనస్ అవుతుందని పార్టీ అంతర్గత సర్వేల్లో తేలింది.

ఇటీవల కాలంలో చంద్రబాబు నియోజకవర్గాల వారీగా నేతలతో వన్ టూ వన్ సమావేశం అవుతున్నారు..అలాగే పార్లమెంట్ స్థానాల వారీగా పార్టీ పరిస్తితిని తెలుసుకుంటున్నారు. అయితే ఇటీవల కాలంలో టీడీపీ వర్గాల నుంచి సమాచారం ప్రకారం..మెజారిటీ పార్లమెంట్ స్థానాల్లో టీడీపీ పరిస్తితి దారుణంగా ఉందని తేలింది. పార్లమెంట్ స్థానాలని మూడు భాగాలుగా విభజించి సర్వే ఆయా స్థానాలకు సంబంధించి సర్వే చేయించుకుంటున్న తెలిసింది. పార్లమెంట్ స్థానాల పరిధిలో ఉన్న అసెంబ్లీ స్థానాల్లో పార్టీ పరిస్తితులని తెలుసుకున్నారట.

ఇక పార్లమెంట్ స్థానాల్లో పార్టీ పరిస్తితిని బట్టి రెడ్ జోన్, ఆరెంజ్ జోన్, గ్రీన్ జోన్‌లుగా విభజించారట. రెడ్ జోన్ అంటే అస్సలు బాగోలేదు అని, ఆరెంజ్ జోన్ అంటే పర్లేదు అని, గ్రీన్ జోన్ అంటే బాగుంది అని. దీని బట్టి చూసుకుంటే గ్రీన్ జోన్‌లో బాపట్ల, విశాఖపట్నం, నరసారావుపేట, కాకినాడ, హిందూపురం స్థానాలు ఉండగా, ఆరెంజ్ జోన్‌లో ఒంగోలు, అనంతపురం, ఏలూరు, విజయవాడ, శ్రీకాకుళం, రాజమండ్రి, రాజంపేట, పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఇక రెడ్ జోన్‌లో చిత్తూరు, తిరుపతి, కడప, నంద్యాల, కర్నూలు, నెల్లూరు, అరకు, గుంటూరు, మచిలీపట్నం, నరసాపురం, విజయనగరం, అనకాపల్లి, అమలాపురం స్థానాలు ఉన్నాయి.

అంటే ఐదు పార్లమెంట్ స్థానాల్లో నేతల పనితీరు బాగుండటం వల్ల అవి గ్రీన్ జోన్‌లో ఉండగా, కాస్త పర్లేదు అనుకుకునేలా పనిచేసే వాటిల్లో ఏడు స్థానాలు ఉన్నాయి. ఇక 13 స్థానాల్లో టీడీపీ నేతలు గ్రౌండ్ వర్క్ చేయడంలో, ప్రజల్లో తిరగడంలో వెనుకబడి ఉన్నారని తెలుస్తోంది. అంటే ప్రస్తుతం టీడీపీ రెడ్ జోన్‌లోనే ఉంది. ఈ పరిస్తితి మారకపోతే వచ్చే ఎన్నికల్లో టీడీపీ పరిస్తితి అంతే సంగతులు.