టీడీపీ కంచుకోటలో కొత్త అభ్యర్ధి..వైసీపీకి చెక్?

ప్రతి నియోజకవర్గంలో గెలుపు గుర్రాలని బరిలో దింపడమే లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు ముందుకెళుతున్నారు. గత ఎన్నికల మాదిరిగా చివరి నిమిషంలో అభ్యర్ధులని ప్రకటించడం, నియోజకవర్గాల్లో ఆధిపత్య పోరు పెరిగిపోవడం లాంటివి జరగకుండా, మళ్ళీ పార్టీ నష్టపోకుండా ఉండటమే లక్ష్యంగా బాబు ముందుకెళుతున్నారు. ఈ సారి ఖచ్చితంగా గెలిచి అధికారం దక్కించుకోవడమే టార్గెట్‌గా పెట్టుకుని వెళుతున్న బాబు..ఇప్పటినుంచి నియోజకవర్గాల్లో బలమైన నాయకులని పెట్టుకుంటూ వెళుతున్నారు.

ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో పాత ఇంచార్జ్‌లని మార్చేసి కొత్త వారికి ఛాన్స్ ఇచ్చారు. తాజాగా గోపాలాపురం నియోజకవర్గంలో ముప్పిడి వెంకటేశ్వరావుని సైడ్ చేసి యువ నేత మద్దిపాటి వెంకటరాజుని ఇంచార్జ్‌గా పెట్టారు. అయితే ఇలా ఇంకా కొన్ని స్థానాల్లో మార్పు చేయడానికి బాబు ప్రయత్నిస్తున్నారు. ఇదే క్రమంలో టీడీపీ కంచుకోటగా ఉన్న నెల్లిమర్లలో మార్పు చేయడానికి రెడీ అవుతున్నారు. నియోజకవర్గాల విభజనకు ముందు భోగాపురంగా ఉన్న ఈ స్థానంలో  1983 నుంచి 2004 వరకు వరుసగా టీడీపీ తరుపున పతివాడ నారాయణస్వామి విజయం సాధించారు.

2009లో నెల్లిమర్లగా మారింది. 2009లో టీడీపీ ఓడిపోయింది. ఇక 2014లో మళ్ళీ పతివాడ గెలిచారు. కానీ 2019లో వైసీపీ గెలిచింది. అయితే పతివాడకు వయసు మీద పడటంతో ఆయన యాక్టివ్ గా ఉండటం లేదు. ఇక నెల్లిమర్ల సీటు కోసం ఆయన మనవడు తారక రామారావు ట్రై చేస్తున్నారు. కానీ నెల్లిమర్ల ఇంచార్జ్ పదవి కోసం పోటీ పడుతున్న టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కర్రోతు బంగార్రాజు సైతం నియోజకవర్గంలో దూకుడుగా పనిచేస్తున్నారు.

సొంత డబ్బులని ఖర్చు పెట్టి పార్టీ కార్యక్రమాలు, ప్రజలకు అండగా ఉండటం చేస్తున్నారు. అటు ఇంచార్జ్ పదవి కోసం మాజీ మంత్రి కళా వెంకట్రావు బంధువు కర్రి చంద్రశేఖర్ ట్రై చేస్తున్నారు. కానీ పార్టీ అంతర్గత సర్వేల్లో బంగార్రాజుకే ప్రజా మద్ధతు ఎక్కువ ఉన్నట్లు తేలిందట. మరో కొన్ని రోజుల్లో బంగార్రాజుని నెల్లిమర్ల ఇంచార్జ్‌గా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మరి బంగార్రాజు వస్తే కంచుకోటలో టీడీపీ తలరాత మారుతుందేమో చూడాలి.