టీడీపీ టార్గెట్‌గా కేసీఆర్..ఛాన్స్ ఉందా..!

దసరా రోజున తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ పెడుతున్న విషయం తెలిసిందే.. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) పేరును భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)గా మార్చుతున్నారు. దీని ద్వారా జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని చెప్పి కేసీఆర్ చూస్తున్నారు. కేంద్రంలో బీజేపీ వ్యతిరేక పార్టీలని ఏకం చేసి…మోదీ సర్కార్‌ని గద్దె దించాలని చూస్తున్నారు. సరే అది తర్వాత విషయం ముందు జాతీయ పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది.

ఈ క్రమంలోనే తెలుగు ప్రజలు ఉన్న రాష్ట్రాలతో పాటు..మరో తెలుగు రాష్ట్రమైన ఏపీపై కూడా కేసీఆర్ ఫోకస్ పెట్టారు. అక్కడ బలపడేందుకు కేసీఆర్ ముందస్తు వ్యూహాలు కూడా రచించుకున్నారట. ఈ క్రమంలోనే ఏపీలో టీడీపీని కేసీఆర్ టార్గెట్ చేశారని మీడియాలో ప్రచారం జరుగుతుంది. గతంలో తనతో పాటు పనిచేసిన టీడీపీ సీనియర్లని బీఆర్ఎస్‌లోకి తీసుకోచ్చేందుకు కేసీఆర్ చూస్తున్నారట. శ్రీకాకుళం, విజయనగరం, కృష్ణా, కడప జిల్లాలకు చెందిన కొందరు టీడీపీ నేతలతో కేసీఆర్ టచ్‌లో ఉన్నారట.

ఇక కొందరు టీడీపీ నేతలు కూడా బీఆర్ఎస్‌లోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారని మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఆఖరికి టీడీపీ అనుకూల మీడియాలో కూడా ఈ కథనం వచ్చింది. అయితే ఇదేమన్న వ్యూహాత్మకంగా వచ్చిన కథనమా..లేక నిజంగానే కేసీఆర్..టీడీపీని టార్గెట్ చేశారా? అనేది క్లారిటీ లేదు.

అయితే ఇప్పుడున్న పరిస్తితుల్లో వైసీపీ-టీడీపీల మధ్య నువ్వా నేనా అన్నట్లు రాజకీయ యుద్ధం నడుస్తోంది. ఇలాంటి పరిస్తితుల్లో టీడీపీ నేతలు..కేసీఆర్ పెట్టే జాతీయ పార్టీలోకి వెళ్ళడం కష్టమైన పని. కాకపోతే మరీ రాజకీయ నిరుద్యోగులు ఉంటే కేసీఆర్ వైపే వెళ్ళే ఛాన్స్ ఉంది తప్పా…ఇప్పటికిప్పుడు టీడీపీ నేతలు కేసీఆర్ వైపు చూసే పరిస్తితి లేదు. అలాగే రాష్ట్ర విభజన సమయంలో కేసీఆర్..తిట్టిన తిట్లు ఏపీ ప్రజలు మరిచిపోయారనుకుంటే కష్టమే. ఏదేమైనా గాని రాజకీయాలు ఎప్పుడు ఎలా అయిన మారిపోవచ్చు. చూద్దాం కేసీఆర్ జాతీయ పార్టీ ఎంతవరకు రాణిస్తుందో.