‘ఎన్టీఆర్’తోనే డ్యామేజ్ తప్పదా..!

ఎప్పుడు ఏదొక వివాదాస్పద నిర్ణయం తీసుకోకుండా జగన్ ప్రభుత్వం ఉండదా? ప్రశాంతంగా ఉండే పరిస్తితులని సైతం అల్లకల్లోలం జరిగేలా రాజకీయం చేస్తుందా? అంటే టీడీపీ వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తుంది. అసలు జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటూ..ప్రజల్లో కన్ఫ్యూజన్ పెంచుతున్నారని, చేసేదేమీ లేక..ఎప్పుడు ఏదొక వివాదం సృష్టించి రాజకీయం పబ్బం గడుపుతున్నారని టీడీపీ శ్రేణులు విమర్శలు చేస్తున్నాయి.

ఇప్పటికే మూడు రాజధానుల నిర్ణయంతో సహ అనేక సంచలన నిర్ణయాలు తీసుకుని..వివాదాలు లేపారు..ప్రజల్లో కన్ఫ్యూజన్ సృష్టించారు. ఇక దాదాపు 36 ఏళ్ల బట్టి విజయవాడలో ఉన్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుని సడన్‌గా వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా మార్చేశారు. దీనిపై టీడీపీ శ్రేణులే కాదు…ఎన్టీఆర్ అభిమానుల నుంచి కూడా నిరసనలు వస్తున్నాయి. యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి చేసింది ఎన్టీఆర్..ఆయన హయాంలోనే అది మొదలైంది. 1998లో ఆయన చనిపోయాక..అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు…యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు పెట్టారు. అప్పటినుంచి ఆ పేరు ఎవరు మార్చలేదు. 2004లో వైఎస్సార్ అధికారంలోకి వచ్చినా సరే దాని జోలికి వెళ్లలేదు.

కానీ జగన్ అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటిన తర్వాత పేరు మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. అసలు యూనివర్సిటీకి వైఎస్సార్‌తో ప్రమేయం లేదు. పోనీ ఇదేమన్న జగన్ కట్టించిందా? అంటే ఎప్పుడో ఎన్టీఆర్ కట్టించింది. అలాంటప్పుడు అనూహ్యంగా ఎన్టీఆర్ పేరు తీసి..వైఎస్సార్ పేరు పెట్టడంపై పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి. టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తుంది.

అటు మిగిలిన పార్టీలు కూడా మద్ధతు పలుకుతున్నాయి. అలాగే నందమూరి ఫ్యామిలీ కూడా జగన్ నిర్ణయాన్ని ఖండించింది…ఆఖరికి వైసీపీలో ఉన్న కొందరు నేతలు జగన్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ వైసీపీ సర్కారు తనకు ఇచ్చిన మూడు పదవులకు రాజీనామా చేశారు. అటు వల్లభనేని వంశీ సైతం ఎన్టీఆర్‌ పేరు తొలగించడం సరికాదని మాట్లాడారు. ఇంకా పలువురు వైసీపీ నేతలు అంతర్గతంగా జగన్ నిర్ణయంపై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఇలాంటి నిర్ణయం వల్ల వైసీపీకే నష్టం జరిగేలా ఉంది. ఇలాంటి నిర్ణయాల విషయంలో పునరాలోచించుకుని..మళ్ళీ మార్చుకుంటే బెటర్ అని విశ్లేషకులు అంటున్నారు.