‘మూడు’తోనే రాజకీయం..జగన్ ప్లాన్ అదే..!

జగన్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే వెంటనే ఆ బిల్లుని అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించుకున్నారు. కానీ మండలిలో అప్పుడు టీడీపీకి మెజారిటీ ఉండటంతో అక్కడ పాస్ అవ్వలేదు. ఇక దీనిపై అమరావతి రైతులు, టీడీపీ పెద్ద ఎత్తున పోరాటాలు చేసుకుంటూ వచ్చిన విషయం తెలిసిందే. అలాగే న్యాయ పోరాటాలు చేశారు.

ఇదే క్రమంలో కోర్టులో జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే తీర్పులు వచ్చాయి. ఫైనల్ గా మూడు రాజధానుల బిల్లుని కోర్టు కొట్టివేసే అవకాశాలు ఉన్నాయనే తరుణంలో జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లుని ఉపసంహరించుకుంది. మళ్ళీ అమరావతి రైతులు పాదయాత్ర మొదలుపెట్టని ముందు వరకు దీనికి గురించి ఎత్తలేదు. కానీ అప్పుడప్పుడు వైసీపీ మంత్రులు మాత్రం అదిగో విశాఖకు రాజధాని వెళుతుందని ప్రచారం చేశారు. అయితే ఇటీవల అమరావతి రైతులు..అరసవెల్లి వరకు పాదయాత్ర మొదలుపెట్టారు. దీంతో వైసీపీ మళ్ళీ మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. ఇప్పటికే ఈ అంశంపై అసెంబ్లీలో పెద్ద ఎత్తున చర్చ చేశారు.

అలాగే ఉత్తరాంధ్రలో అమరావతి రైతుల పాదయాత్ర అడ్డుకుని తీరతామని వైసీపీ మంత్రులు అంటున్నారు. వారికి మద్ధతుగా టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు. ఇదే సమయంలో అసెంబ్లీలో మళ్ళీ మూడు రాజధానుల బిల్లు పెడతారని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా హైకోర్టు తీర్పుని సవాల్ చేస్తూ..జగన్ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లింది. అయితే అక్కడ కూడా బిల్లు నెగ్గదని విశ్లేషణలు వస్తున్నాయి.

కాకపోతే ఇప్పుడే తీర్పు రాకుండా వాయిదాలు పడేలా చేసుకుని…ఎన్నికల వరకు ఈ మూడు రాజధానుల కాన్సెప్ట్‌ని పొడిగించి..మూడు రాజధానుల రిఫరెండంగా వైసీపీ ఎన్నికలకు వెళ్ళే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతుంది. అంటే మిగతా సమస్యలు పక్కకు వెళ్ళేలా చేసి..కేవలం రాజధానిపై ప్రజల్లో చర్చ జరిగేలా చేసి..అలాగే మూడు ప్రాంతాల్లో అభివృద్ధిని టీడీపీ అడ్డుకుంటుందని ప్రచారం చేసి..ఎన్నికల్లో లబ్ది పొందడమే లక్ష్యంగా జగన్ ముందుకెళ్తారని తెలుస్తోంది. చూడాలి మరి ఈ మూడు రాజధానుల కాన్సెప్ట్ జగన్‌కు ఎంత ప్లస్ అవుతుందో.