వైసీపీలోకి గంటా వియ్యంకుడు?

ఏపీలో గంటా శ్రీనివాసరావు రాజకీయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో…ఎవరికి అర్ధం కాదనే చెప్పొచ్చు…ఆయన ఎప్పుడు ఏ పార్టీలోకి వెళ్తారో…ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారో క్లారిటీ ఉండదు. ప్రస్తుతానికి ఆయన టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు…అలా అని టీడీపీలో కనిపించరు. వీలుని బట్టి ఆయన రాజకీయాన్ని మార్చేస్తారు. ఇక గంటా బట్టే ఆయన వియ్యంకులు కూడా రాజకీయం చేస్తున్నారని చెప్పొచ్చు. గంటాకు ఇద్దరు వియ్యంకులు ఉన్నారు…ఒకరు మాజీ మంత్రి నారాయణ, మరొకరు మాజీ ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు.

ప్రస్తుతం ఈ ఇద్దరు కూడా టీడీపీకి దూరంగానే ఉంటున్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు గంటా, నారాయణ  మంత్రులుగా ఉంటే, అంజిబాబు ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ అధికారం పోయాక ముగ్గురు నేతలు టీడీపీకి దూరం జరిగారు. ఇందులో గంటా ఏం చేస్తున్నారో అందరికీ తెలిసిందే. అటు నారాయణ ఏమో పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ఇక అంజిబాబు ఏమైపోయారో ఎవరికి తెలియదు.

అయితే ఈయన వైసీపీలోకి వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈయన గతంలో కాంగ్రెస్ లో పనిచేసిన విషయం తెలిసిందే…2009లో భీమవరంలో కాంగ్రెస్ నుంచి గెలిచారు. తర్వాత కాంగ్రెస్ ని వదిలి టీడీపీలోకి వచ్చేశారు. 2014లో టీడీపీ తరుపున గెలిచారు. అధికారం ఉన్నన్ని రోజులు బాగానే ఉన్నారు.

2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఓడిపోయిన దగ్గర నుంచి అడ్రెస్ లేరు. దీంతో ఆయన ప్లేస్ లో భీమవరం టీడీపీ ఇంచార్జ్ గా తోట సీతారామలక్ష్మీని పెట్టారు. ఆ దెబ్బతో అంజిబాబు టీడీపీకి ఇంకా దూరం జరిగారు. అయితే నెక్స్ట్ పొత్తు ఉంటే ఈ సీటు జనసేనకు దక్కొచ్చు…ఒకవేళ టీడీపీకి సీటు దక్కినా సరే…అంజిబాబుకు మాత్రం సీటు ఇవ్వరు. దీంతో ఆయన వైసీపీ వైపు వెళ్ళేందుకు పావులు కదుపుతున్నారట. ఎన్నికల ముందు  వీలు చూసుకుని వైసీపీలోకి జంప్ చేస్తారని తెలుస్తోంది.