రాజ్య‌స‌భ ఎంపీలుగా ఎన్నికైన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే…!

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తండ్రి, ప్ర‌ముఖ స్టోరీ రైట‌ర్ విజ‌యేంద్ర‌ప్ర‌సాద్‌ను రాష్ట్ర‌ప‌తి కోటాలో ఎన్డీయే ప్ర‌భుత్వం రాజ్యసభకు నామినేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజ్యసభకు ఎంపికైన తెలుగు సినిమా వ్య‌క్తిగా విజ‌యేంద్ర ప్ర‌సాద్ రికార్డు ద‌క్కించుకున్నాడు. గ‌తంలో మ‌న తెలుగు సినిమా నుంచి రాజ్య‌స‌భ‌కు ఎంపికైన కొంద‌రు సెల‌బ్రిటీల‌ను చూద్దాం. టాప్‌ విలన్ రావు గోపాలరావు – దర్శకరత్న దాసరి నారాయణరావు – ప్రముఖ నటీనటులు మోహన్ బాబు – చిరంజీవి – జయప్రద కూడా రాజ్యసభకు ఎంపికయ్యారు.

అలాగే ప్రముఖ నిర్మాతలు టి.సుబ్బిరామిరెడ్డి డి.వెంకటేశ్వరావు ప్రముఖ గీత రచయిత సి.నారాయణరెడ్డి కూడా రాజ్యసభకు స‌భ్యులుగా ప‌నిచేశారు. అయితే వీరంతా కూడా ఆయా పార్టీల త‌ర‌పున రాజ్య‌స‌భ‌కు ఎంపిక‌య్యారు. ద‌ర్శ‌క‌ర‌త్న దాసరి నారాయణరావు, మెగాస్టార్‌ చిరంజీవి, సీనియ‌ర్ నేత‌, నిర్మాత‌ సుబ్బిరామిరెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభకు ఎంపికయ్యారు. వీరిలో దాస‌రి నారాయ‌ణ‌రావు, చిరంజీవి ఇద్ద‌రు కూడా కేంద్ర సహాయ మంత్రులుగా కూడా ప‌నిచేశారు. యూపీఏ ప్ర‌భుత్వంలో వీరికి ప‌ద‌వులు ద‌క్కాయి.

రావు గోపాలరావు – జయప్రద – డి.వెంకటేశ్వరరావు – మోహన్ బాబు తెలుగుదేశం త‌ర‌పున రాజ్య‌స‌భ‌కు ప్రాథినిత్యం వ‌హించారు. ఇక సి.నారాయణరెడ్డిని రాష్ట్రపతి తన కోటాలో రాజ్యసభకు నామినేట్ చేశారు. ఇప్పుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కూడా రాష్ట్ర‌ప‌తి కోటాలో రాజ్య‌స‌భకు ఎంపిక‌య్యారు. పై వారంద‌రిలోనూ ఒక్క సుబ్బ‌రామిరెడ్డి ఒక్క‌రు త‌ప్ప మిగిలిన వారంద‌రూ ఒక్క‌సారి మాత్ర‌మే రాజ్య‌స‌భ స‌భ్యులుగా ప‌నిచేశారు.

తెలుగుదేశం నుంచి రాజ్య‌స‌భ‌కు ఎంపికైన జ‌య‌ప్ర‌ద ఆ త‌ర్వాత యూపీలోని రాంపూర్ నుంచి రెండుసార్లు స‌మాజ్‌వాద్ పార్టీ త‌ర‌పున లోక్‌స‌భ‌కు ఎంపిక‌య్యారు. మొన్న ఎన్నిక‌ల్లో ఆమె అజంఘ‌డ్ నుంచి బీజేపీ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక టాలీవుడ్ నుంచే సీనియ‌ర్ న‌టుడు కైకాల స‌త్య‌నారాయ‌ణ మ‌చిలీప‌ట్నం నుంచి లోక్‌స‌భ‌కు, సీనియ‌ర్ న‌టి శార‌ద తెనాలి నుంచి లోక్‌స‌భ‌కు, లెజెండ్రీ నిర్మాత ద‌గ్గుబాటి రామానాయుడు బాప‌ట్ల నుంచి లోక్‌స‌భ‌కు గెలిచారు. వీరు ముగ్గురూ కూడా టీడీపీ నుంచే ఎంపీలుగా గెలిచారు. అయితే గ‌తంలో మ‌రో సీనియ‌ర్ న‌టుడు కొంగ‌ర జ‌గ్గ‌య్య ఒంగోలు నుంచి కాంగ్రెస్ త‌ర‌పున లోక్‌స‌భ‌కు ఎంపిక‌య్యారు.