సినిమాల్లో హిట్ట‌వుతోన్న ప‌వ‌న్ జ‌నాల్లో ఎందుకు ఫెయిల్ అవుతున్నాడు…!

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్య‌వ‌హారం.. ఆస‌క్తిగా మారిందని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఆయ‌న కావాలి.. రావాలి.. అని యువత కోరుకుంటున్నారు. అయితే.. ఆయ‌న వ‌స్తున్నారు. కానీ, ఇలాల వ‌చ్చి అలా వెళ్లిపోయి.. షెడ్యూల్ చూసుకుని వ‌స్తున్నారు. దీంతో పార్టీ పుంజుకునేది ఎప్పుడు? అనే ప్ర‌శ్న‌లు తెర‌మీదికి వ‌స్తున్నాయి. నిజానికి జ‌న‌సేన‌కు ఫాలోయింగ్ లేదా? అంటే.. ఉంది. వైసీపీకి, టీడీపీకి మించిన ఫాలోయింగ్ ఉంది. ఎందుకంటే.. ప్ర‌స్తుత రాజ‌కీయాల్లో నిజాయితీ గురించి.. డ‌బ్బులు ఇవ్వ‌కుండా.. ఓట్లేయాల‌నే అంశం గురించి ప్ర‌స్తావిస్తున్న‌ది ఒక్క ప‌వ‌నే!

ఈ విష‌యంలో మేధావులు కూడా ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. “నేడు ఉన్న స‌మాజంలో ఇవ‌న్నీ సాధ్యం కాదు. కానీ, తాను చెబుతున్న మాట‌కు ఆయ‌న నిల‌బ‌డుతున్నారు. ఖ‌చ్చితంగా విజ‌యం సాధిస్తారు. అయితే.. ఇలా కాదు. ఆయ‌న నిల‌బ‌డాలి. నేను ఇక్క‌డే ఉన్నాను.. ఉంటాను.. మీ కోసం నిల‌బ‌డ‌తాను! అనే ధీమా క‌ల్పిస్తే.. ఖ‌చ్చితంగా ప్ర‌త్యామ్నాయ నాయ‌కుడు.. పార్టీ కావ‌డం త‌థ్యం“ అని విశాఖ‌ప‌ట్నంలోని ఆంధ్రాయూనివ‌ర్సిటీ పొలిటిక‌ల్ ప్రొఫెస‌ర్ ఒక‌రు వ్యాఖ్యానించారు.

ఈయ‌న ఒక్క‌రే కాదు.. మేధావి వ‌ర్గంలో ప‌వ‌న్‌కు మంచి పేరు ఉంది. అయితే.. ఆయ‌న నిల‌దొక్కుకోవ‌డంపైనే అంద‌రి అనుమానాలు. ఇక‌, మేధావుల సంగ‌తి ప‌క్క‌న పెడితే.. ఓటేసే ప్ర‌జ‌లు ముఖ్యం. మేధావులు వఓటేస్తారో.. వేయ‌రో.. అప్ప‌టి ప‌రిస్థితిని బ‌ట్టి ఆధార‌పడి ఉంటుంది. కానీ, కామ‌న్ మ్యాన్ మాత్రం ఎండైనా వానైనా.. భూకంప‌మే వ‌చ్చినా.. లైన్‌లో నిల‌బ‌డి మాత్రం ఓటేస్తాడు. మ‌రి వీరి నాడి ఎలా ఉంది.. అనేది ఇంపార్టెంట్‌. గ‌త 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ ప్ర‌భంజ‌న విజ‌యం ద‌క్కించుకోవ‌డంలో వీరి ఓటు బ్యాంకే కీల‌కంగా మారింది.

వీరు ఊర మాస్. సో.. ప‌వ‌న్ అంటే ప‌డిచ‌చ్చిపోతారు. మ‌రి ఓటు బ్యాంకు ప‌రిస్థితి ఎలా ఉంది… అనే విష‌యం చూస్తే.. “ప‌వ‌న్ అంటే చాలా అభిమానం“ అని చొక్క‌లు చింపుకొనే యువత ఉన్నారు.కానీ.. ఆయ‌న రాజ‌కీయాల‌ను మాత్రం అభిమానించ‌లేక పోతున్నారు. కొన్నాళ్ల కింద‌ట పార్టీ ఆవిర్భావ స‌భ పెడితే.. భారీ ఎత్తున యువ‌త‌, మాస్ జ‌నాలు త‌ర‌లి వ‌చ్చారు. ఎందుకు వ‌చ్చారు? అని ఆన్‌లైన్ చానెల్ వాళ్లు స‌ర్వే చేస్తే.. ప‌వ‌న్‌ను చూసేందుకు వ‌చ్చాం అన్నారు. అంటే.. దీనిని బ‌ట్టి పార్టీ పెట్టినా.. సినిమాటిక్ ఇమేజ్‌లోనే ప‌వ‌న్ ఉండిపోయారని స్ప‌ష్టంగా తెలుస్తోంది.

నాడు అన్న‌గారు పార్టీ పెట్టినా..సినిమాటిక్ ఇమేజ్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు రాత్రీ ప‌గ‌ళ్లు ప్ర‌జ‌ల్లోనే ఉండి క‌ష్ట‌ప‌డ్డారు. వారి మ‌ధ్యే అన్నం తిన్నారు. స్నానం చేశారు. ఈ త‌ర‌హా అవ‌స‌రం లేక‌పోయినా.. ప‌వ‌న్ సినిమాటిక్ డైలాగులు మానుకుని.. ప్ర‌జ‌ల‌కు అర్ధ‌మ‌య్యే సాధార‌న భాష‌, సాధార‌ణంగా క‌లిసిపోయే.. వ్య‌వ‌హారం అల‌వ‌రిస్తే.. బెట‌ర్ అంటున్నారు ప‌రిశీల‌కులు. దీనికి తోడు.. ప‌వ‌న్ ప్ర‌ధానంగా.. తాను త‌న కోస‌మే పార్టీ పెట్టాను.. అనే నినాదాన్ని ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకువెళ్లాలి. ఎందుకంటే ప్ర‌త్య‌ర్థిపార్టీ.. జ‌నసేన‌ను టీడీపీ బీ టీంగా ప్ర‌చారం చేస్తోంది. ఇది గ్రామ‌స్థాయిలోనూ వినిపిస్తున్న మాట‌.

సో.. ఆ మాట‌ను చెరిపేయక‌పోతే.. ప‌వ‌న్‌కు సుదీర్ఘ‌కాల డ్యామేజీ అలానే ఉంటుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. రాజ‌కీయాల్లోకి రావ‌డం వేరు. . ప్ర‌జ‌ల్లోనిల‌దొక్క‌కుని.. వారితో ఒక నాయ‌కుడిగా జైకొట్టించుకోవ‌డం వేరు. వైఎస్ త‌న‌యుడిగా.. జ‌గ‌న్ ఒక ఎంపీ మాత్ర‌మే. కానీ,.. పార్టీ పెట్టిన త‌ర్వాత‌.. వైఎస్ త‌న‌యుడికంటే.. ప్ర‌జానాయ‌కుడిగా ఎదిగిన తీరు వేరు. నిత్యం ప్ర‌జ‌ల్లో ఉన్నారు. వేల కోట్ల ఆస్తులు ప‌క్క‌న పెట్టి.. మండుటెండ‌లో పాద‌యాత్ర చేశారు. అప్పుడు క‌దా.. జ‌నాలు ఆయ‌న‌పై మ‌న‌సు పారేసుకుంది..! దీనిని బ‌ట్టి ప‌వ‌న్ ఏం చేయాలో.. ఆయ‌నే ఆలోచించుకుని అడుగులు వేస్తే.. త‌ప్ప‌.. `ఫ‌లితం` ద‌క్క‌ద‌నేది సామాన్యుల మాట‌.