ప‌డిపోయిన ఆ హీరో కెరీర్ తిరిగి నిల‌బెట్టిన సూప‌ర్‌స్టార్ కృష్ణ‌..!

అందుకే క్రిష్ణ సూపర్ స్టార్ అయ్యారు. ఆయన నిజమైన హీరో అని కూడా ఈ రోజుకీ టాలీవుడ్ లో చెబుతారు. క్రిష్ణ తెర వెనక హీరోగా ఎందరికో సాయం చేశారు. అంతే కాదు, ఆయనతో సినిమాలు తీసి ఆర్ధికంగా నష్టపోయిన వారికి కూడా ఆయన తిరిగి సినిమాలు చేసి నిలబెట్టిన చరిత్ర కూడా ఉంది. ఒక విధంగా సినీ రంగాన మకుటం లేని మహరాజు క్రిష్ణ. అలాంటి హీరో మళ్లీ టాలీవుడ్ కి వస్తారా అంటే చెప్పలేమనే అంటారు.

ఇంతకీ క్రిష్ణ చేసిన ఆర్ధిక సాయాలు, తన వారు అనుకున్న వారికి అందించిన తోడ్పాటు గురించి చెప్పుకుంటే పేజీలకు పేజీలు అవుతాయి. ఒక పెద్ద చరిత్రనే రాయాల్సి ఉంటుంది. ఇక సూపర్ స్టార్ క్రిష్ణ 1965లో తేనే మనసులు మూవీ ద్వారా నాటి దర్శక దిగ్గజం ఆదుర్తి సుబ్బారావు గారి ప్రోత్సాహంతో చిత్ర సీమకు పరిచయం అయ్యారు. తొలి సినిమావే రంగుల్లో వచ్చింది. బ్లాక్ బస్టర్ హిట్ అయింది.

ఇక మూడవ సినిమా గూఢచారి 116 తో క్రిష్ణ సూపర్ స్టార్ డం సాధించారు. ఇండస్ట్రీకి వచ్చిన అయిదేళ్ళలోనే పద్మాలయా బ్యానర్ స్థాపించి తొలి సినిమాగా అగ్ని పరీక్ష తీశారు. అలా తొమ్మిదేళ్ళలోనే వంద సినిమాలు పూర్తి చేసిన రికార్డు కూడా క్రిష్ణదే. ఇవన్నీ పక్కన పెడితే సూపర్ స్టార్ క్రిష్ణ ఎంట్రీకి చాలా ముందే అందాల నటుడు హరనాధ్ చిత్ర సీమకు వచ్చారు.

క్రిష్ణ ప్రవేశం నాటికి హరనాధ్ హీరోగా మంచి దశలో ఉన్నారు. అరవై దశకంలో హరనాధ్ హీరోగా సక్సెస్ ఫుల్ మూవీస్ చేశారు. ఇక 70 దశకం వచ్చేసరికి ఆయన గ్రాఫ్ నెమ్మదిగా పడిపోయింది. దాంతో హరనాధ్ హీరోగా తన సెకండ్ ఇన్నింగ్స్ కొనసాగించాలని పట్టుదలతో సొంత సినిమా స్టార్ట్ చేశారు.

అది 1970 సంవత్సరం. ఆ ఏడాది ఆయన కంటికి కాటుక ఇంటికి ఇల్లాలు అన్న పేరిట తాను హీరోగా జమున హీరోయిన్ గా సినిమా మొదలెట్టారు. ఈ సినిమా ఎనిమిది రీళ్ళు పూర్తి అయిన తరువాత ఆర్ధిక ఇబ్బందుల వల్ల ఆగిపోయింది. తిరిగి ఎనిమిదేళ్ల తరువాత అంటే 1978లో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయింది. దానికి కారణం సూపర్ స్టార్ క్రిష్ణ. ఈ మూవీలో క్రిష్ణ నటించడానికి పూర్తి చేయడానికి ఓకే చెప్పారు. అలా హరనాధ్ ని ఆదుకోవాలనుకున్నారు. దాంతో మళ్ళీ స్టార్ట్ చేశారు. క్రిష్ణ పద్మప్రియ మరో జంటగా ఈ మూవీని పూర్తి చేశారు. 1980లో ఈ సినిమా పేరు మార్చుకుని మా ఇంటి దేవతగా రిలీజ్ అయింది.

సినిమా బాగా ఆడలేదు, కానీ అందులో ఈ లేత గులాబీ పెదవులతో అన్న ఘంటసాల పాట మాత్రం సూపర్ హిట్ గా నాడూ నేడూ నిలిచింది. ఇక ఈ మూవీ పూర్తి కావడానికి క్రిష్ణ అందించిన సాయం మాత్రం మరువలేనిది అని హరనాధ్ ఒక ప్రెస్ మీట్ లో చెప్పారు. ఇక్కడ మరో చిత్రం చెప్పుకోవాలి. 1974 తరువాత క్రిష్ణ బ్లాక్ అండ్ వైట్ మూవీస్ చేయడం మానేశారు. కానీ 1980లో వచ్చిన మా ఇంటి దేవత ఆయన చివరి బ్లాక్ అండ్ వైట్ మూవీగా చెప్పాలి. ఏది ఏమైన హరనాధ్ కోసం క్రిష్ణ సాయం చేయడానికి ముందుకు వచ్చి రియల్ హీరో అనిపించుకున్నారు.