టాలీవుడ్‌కు మ‌రో అఖండ కావాలి… బాల‌య్య బొమ్మ ఎంత ప‌వ‌ర్ ఫుల్ హిట్ అంటే..!

కరోనా థర్డ్ వేవ్ తర్వాత టాలీవుడ్‌లో సినిమాలు రిలీజ్ చేయాలా వద్దా ? అన్న సందేహంలో ఉన్నారు. అగ్రహీరోలకు కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమాలు రిలీజ్ చేస్తే అసలు ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమాలు చూస్తారా ? అన్న సందేహాలు వెంటాడాయి. అయితే నందమూరి నట సింహం బాలకృష్ణ మాత్రం సవాల్‌ చేసి మరీ తన అఖండ సినిమాను రిలీజ్ చేశారు. ఏపీలో టికెట్ రేట్లు తక్కువ ఉన్నా కూడా డిసెంబర్ 2న రిలీజ్ అయిన అఖండ తొలి రోజు నుంచే అదిరిపోయే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇంకా చెప్పాలంటే ఊహించిన దానికన్నా అద్భుతమైన విజయం సొంతం చేసుకుంది.

బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్లో గతంలో వచ్చిన సింహ – లెజెండ్ సినిమాల‌ను మించి అఖండ‌ సూపర్ హిట్ కొట్టింది. తొలి రెండు వారాల పాటు థియేట‌ర్ల‌లో 80 నుంచి 90 శాతం ఆక్యుపెన్సీతో నడిచిన అఖండ రిలీజ్ అయ్యాక కూడా మరో మూడు.. నాలుగు వారాల పాటు 60 శాతానికి తగ్గకుండా కలెక్షన్లు రాబట్టింది. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా కన్నడంలోనూ అటు తమిళంలోనూ అఖండ మంచి వసూళ్లు రాబట్టింది. విచిత్రమేంటంటే అఖండ తర్వాత వచ్చిన ఏ సినిమా కూడా కనీసం వారం రోజుల పాటు 60 శాతం ఆక్యుపెన్సీ కూడా చూడలేకపోయాయి.

ఇంకా చెప్పాలంటే ఈ రోజుల్లో రెండవ వారం పోస్టర్ చూడటమే గగనమవుతోంది. అలాంటిది అఖండ ఏకంగా 103 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకుంది. విదేశాల్లో మరో మూడు కేంద్రాలలో అర్థశతదినోత్సవం జరుపుకొని.. 106 కేంద్రాల్లో అర్థ శతదినోత్సవం జరుపుకుంది. రు. 200 కోట్ల గ్రాస్ వసూళ్లు కొల్లగొట్టింది. ఇంకా నాలుగు కేంద్రాల్లో డైరెక్ట్ గా నాలుగు ఆటలతో ప్రదర్శింపబడుతూ శతదినోత్సవం వైపు పరుగులు తీస్తోంది.

ఇక ఇప్పుడు టాలీవుడ్ ట్రేడ్ వర్గాల ఆశలన్నీ ప్రభాస్ రాధేశ్యామ్‌, త్రిబుల్ ఆర్ సినిమా తోపాటు ఆచార్య – ఎఫ్ 3, సర్కారు వారి పాట సినిమాల పైనే ఉన్నాయి. 2022 సంక్రాంతికి వచ్చిన సినిమాలతోపాటు జనవరిలో వచ్చిన సినిమాల పరిస్థితి కూడా అంతే. అదిగో హిట్టు.. ఇవిగో కోట్లు అని చెప్పుకోవడానికి తప్ప నికార్సైన వసూళ్లు ఏ సినిమా కూడా అఖండ స్థాయిలో రాబట్టలేకపోయింది అని ట్రేడ్ వర్గాలు సైతం విశ్లేషించాయి. ఇక ఫిబ్రవరిలో వచ్చిన సినిమాల్లో చిన్న సినిమా అయినా డీజే టిల్లు మాత్రం మంచి వసూళ్లు సాధించింది.

ఈ సినిమా కేవలం మూడు రోజులకే బ్రేక్ సాధించింది. రవితేజ ఖిలాడి డిజాస్టర్ అయింది. ఇక పవర్‌స్టార్ పవన్ క‌ళ్యాణ్ – రానా కలిసి నటించిన సినిమా భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. అయితే ఏపీలో అనూహ్యంగా ఈ సినిమా వసూళ్లు డ్రాప్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏదేమైనా అఖండ స్థాయిలో కనీసం మూడు వారాల పాటు హౌస్ఫుల్ అయ్యే సినిమా రావాలని ఇప్పుడు ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు.