ఆ మూవీలో హీరోయిన్ కంటే చిరంజీవి అత్త‌కే ఎక్కువ రెమ్యున‌రేష‌న్‌…!

సాధార‌ణంగా ఏ సినిమాలో అయినా హీరో త‌ర్వాత ఎక్కువ రెమ్యున‌రేష‌న్ తీసుకునేది హీరోయిన్‌నే. కానీ, మెగాస్టార్ చిరంజీవి హీరోగా న‌టించిన `అత్తకుయముడు అమ్మాయికి మొగుడు` సినిమాలో మాత్రం ఓ ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న చోటు చేసుకుంది. ఎ.కోదండరామిరెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై ప్ర‌ముఖ‌ బ‌డా నిర్మాత అల్లు అరవింద్ నిర్మించారు. విజ‌య‌శాంతి హీరోయిన్‌గా న‌టించ‌గా..కైకాల స‌త్య‌నారాయ‌ణ‌, అన్న‌పూర్ణ‌, రావుగోపాల‌రావు, అల్లు రామ‌లింగ‌య్య‌, గిరిబాబు, బ్ర‌హ్మానందం ముఖ్య‌పాత్ర‌ల‌ను పోషించారు.

ఓ పొగరుబోతు అత్తకు బుద్ధిచెప్పే అల్లుడి క‌థే అత్తకుయముడు అమ్మాయికి మొగుడు. అల్లుడిగా చిరంజీవి న‌టించ‌గా.. పొగరుబోతు అత్త పాత్ర‌ను వాణిశ్రీ చేసింది. వెండితెర‌కు దాదాపు ఎనిమిదేళ్లు దూరంగా ఉన్న‌ వాణిశ్రీ‌.. మ‌ళ్లీ ఈ సినిమాతోనే గ్రాండ్‌గా రీఎంట్రీ ఇచ్చింది. 1989లో విడుద‌లైన ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. 14 కేంద్రాలలో వంద రోజులు ప్రదర్శించబడిన ఈ సినిమా ఇటు నిర్మాత‌ల‌కు, అటు బ‌య‌ర్ల‌కు భారీ లాభాల‌ను తెచ్చిపెట్టింది.

చిరు, వాణిశ్రీ పాత్ర‌ల మ‌ధ్య సాగే ఛాలెంజ్ స‌న్నివేశాలు, హీరో-హీరోయిన్ల మ‌ధ్య కెమెస్ట్రీ, క‌డుపుబ్బా నవ్వించే కామెడీ సీన్స్‌, సంగీత ద‌ర్శ‌కుడు చక్ర‌వ‌ర్తి స్వ‌ర‌పర‌చిన పాట‌లు సినిమా మంచి విజ‌యం సాధించ‌డానికి దోహ‌దప‌డ్డాయి. అలాగే రీఎంట్రీ చిత్రం అయిన‌ప్ప‌టికీ వాణిశ్రీ‌.. చిరంజీవితో పోటా పోటీగా న‌టించి ప్రేక్ష‌కుల‌ను మిస్మ‌రైజ్ చేసింది.

అయితే ఈ సినిమాలో హీరోయిన్ విజ‌య‌శాంతి కంటే వాణిశ్రీ‌నే ఎక్కువ పారితోషికం తీసుకుంద‌ట‌. హీరోకు పోటీగా అత్త పాత్ర ఉండ‌టం, స‌రిస‌మానంగా స‌న్నివేశాలు, సంభాష‌ణ‌లు ఉండ‌టం కార‌ణంగా వాణిశ్రీ హీరోయిన్ కంటే డ‌బుల్ రెమ్యున‌రేష‌న్ డిమాండ్ చేసింద‌ని అప్ప‌ట్లో ప్రచారం జ‌రుగుతోంది. కాగా, ఈ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రాన్ని తమిళంలో రజినీకాంత్ హీరోగా `మాప్పిళ్ళై` టైటిల్‌తో రిమేక్ చేశారు. అక్క‌డ కూడా ఈ మూవీ హిట్‌గా నిలవ‌డం విశేషం.