ఏపీలో వైసీపీ ఓడే ఫ‌స్ట్ నియోజ‌క‌వ‌ర్గం ఇదేనా…?

గుంటూరు జిల్లాలోని ప‌ల్నాడు ప్రాంతంలో అత్యంత కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం వినుకొండ‌. ఇక్క‌డ నుంచి వైసీపీ గ‌త ఎన్నిక‌ల్లో తొలిసారి విజ‌యం ద‌క్కించుకుంది. ప‌ల్నాడు ప్రాంతంలో వాస్త‌వానికి టీడీపీకి గ‌ట్టి ఫాలోయింగు, ప‌ట్టు కూడా ఉంది. అయితే.. ఇలాంటి చోట వైసీపీ గ‌త 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ సునామీ నేప‌థ్యంలో బొల్లా బ్ర‌హ్మ‌నాయుడు విజ‌యం ద‌క్కించుకున్నారు. నిజానికి ఇలాంటి చోట పాగా వేయాలంటే.. చాలా క‌ష్ట‌ప‌డాలి. గ‌తంలో టీడీపీ త‌ర‌ఫున గెలిచిన‌వారు.. చాలా క‌ష్టాలు ప‌డ్డారు. పార్టీని నిల‌బెట్టారు. ఇప్ప‌టికీ.. టీడీపీకి ఇక్కడ మంచి ఫాలోయింగ్ ఉంది. మ‌రి ఇలాంటి చోట మ‌ళ్లీ వైసీపీని గెలిపించాలంటే.. బొల్లా ఎంతో క‌ష్ట‌ప‌డాల్సి ఉంది.

కానీ, ఆయ‌న మాత్రం వ్య‌క్తిగ‌త ల‌బ్ధి పొందేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌నే వాద‌న వినిపిస్తోంది. ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌కు ఇళ్ల ప‌ట్టాలు పంపిణీ చేసిన స‌మ‌యంలో త‌న‌కున్న స్థ‌లాన్ని ఎక్కువ ధ‌ర‌ల‌కు ప్ర‌భుత్వానికి విక్ర‌యించార‌ని.. ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఇక‌, క్షేత్ర‌స్థాయిలో ఆయ‌నెక్కడా క‌నిపించ‌డం లేదు. పైగా.. త‌న మాటే నెగ్గాల‌నే పంతంతో ప‌నిచేస్తున్నారు. ఎవ‌రినీ ఆయ‌న లెక్క చేయ‌డం లేదు. ఇటీవ‌ల‌.. ఒక రైతు.. న‌రేంద్ర వ్య‌వ‌హారం.. ఎమ్మెల్యే మెడ‌కు ఉచ్చులా బిగుసుకుంది.

ఈ ప‌రిణామం త‌ర్వాత‌.. నియోజ‌క‌వ‌ర్గం లో ఎమ్మెల్యేపై తీవ్ర వ్య‌తిరేక‌త పెరిగిపోయింది. త‌న స‌మ‌స్య‌ల‌ను చెప్పుకొనేందుకు వ‌చ్చేవారిపై ఆయ‌న దురుసుగా ఉండ‌డాన్ని ప్ర‌జ‌లు స‌హించ‌లేక‌పోతున్నారు. అదేస‌మ‌యంలో వారికి ఎమ్మెల్యే కూడా అందుబాటులో ఉండ‌క‌పోవ‌డం మ‌రిన్ని విమ‌ర్శ‌ల‌కు దారితీస్తోం ది. దీంతో ప్ర‌జ‌ల‌కు ఎమ్మెల్యేకు మ‌ధ్య భారీ గ్యాప్ పెరిగిపోయింది. దీంతో ఇక్క‌డి వారు త‌మ‌కు ఏం కావాలన్నా.. ప్ర‌తిప‌క్ష నేత‌ల‌కు చెప్పుకొనే ప‌రిస్థితి ఏర్ప‌డింది. దీంతో వైసీపీ ప్ర‌భావం త‌గ్గిపోయింద‌నే వాద‌న వినిపిస్తోంది.

అంతేకాదు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో బొల్లాను ఓడించి తీరాల‌ని కొన్ని గ్రామాల్లో ఇప్ప‌టికే తీర్మానాలు కూడా చేసుకున్నార‌ని పెద్ద ఎత్తున చ‌ర్చ‌జ‌రుగుతోంది. గ‌తంలో టీడీపీకి ప‌ట్టున్న ప్రాంతాల్లో త‌ప్పు చేశామ‌ని.. ప్ర‌జ‌లు బ‌హిరంగంగా చెప్పుకొంటున్నారు. జ‌గ‌న్‌ను వారు మెచ్చుకుంటున్నా.. జ‌గ‌న్‌పై వ్య‌తిరేక‌త లేక పోయినా.. ఎమ్మెల్యేపై మాత్రం తీవ్ర ఆగ్ర‌హంతో ఉండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి దీనిని బ‌ట్టి.. వైసీపీ ఖాతా నుంచి ఆ నియోజ‌క‌వ‌ర్గం జారిపోతుందేమో.. అనే చ‌ర్చ జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం.