చంద్ర‌బాబుకు పెద్ద గండం.. ఏం చేయాలి…?

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్ర‌బాబుకు మ‌రో గండం ఎదురైంది. ఇప్ప‌టికే.. త‌మ్ముళ్లు ఎవ‌రూ మాట విన‌డం లేదు. ఎవ‌రికి వారుగా కార్యాచ‌ర‌ణ చేసుకుంటున్నారు. ఎవ‌రికి వారు.. ప్ర‌త్యేకంగా.. ఉంటున్నారు. పార్టీ అధినేతను ఎవ‌రూ లెక్క‌చేయ‌డం లేదు. ఏదో పైపైన ఆయ‌న మాట‌లు వింటున్న‌ట్టు క‌నిపిస్తున్నా.. క్షేత్ర‌స్థాయిలో మాత్రం ఎవ‌రి అజెండా వారు అమ‌లు చేస్తున్నారు. దీంతో చంద్ర‌బాబు ఎప్ప‌టిక‌ప్పుడు ఇబ్బంది ప‌డుతూనే ఉన్నారు. అయితే.. ఇప్ప‌డు వీటిని మించిన ఇబ్బంది వ‌చ్చిప‌డింది.

వ‌చ్చే వారంలో ఏపీ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల‌కు రంగం సిద్ధ‌మ‌వుతోంది.దీనికి సంబంధించి ప్ర‌బుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. బ‌డ్జెట్ స‌మావేశాల‌ను ప‌ది రోజులు నిర్వ‌హించే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలో .. ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా ఉన్న చంద్ర‌బాబుకు కూడా స‌భ‌ల‌కు రావాలంటూ.. ఆహ్వానం అందే అవ‌కాశం ఉంది. త‌ద్వారా.. ప్ర‌భుత్వం నుంచి చంద్ర‌బాబును ఆహ్వానించినట్టు అవుతుంది. ఆయ‌న‌ను ఆహ్వానించడం ద్వారా.. విప‌క్ష నేత విష‌యంలో తాము.. అలెర్టుగానే ఉన్నామ‌ని..ఆయ‌న‌ను తాము అగౌర‌వ ప‌ర‌చ‌లేద‌ని.. స‌ర్కారు స్ప‌ష్టం చేయ‌నుంది.

అయితే.. ఇప్పుడు చంద్ర‌బాబుకు పెద్ద స‌మ‌స్యే రానుంది. ఎందుకంటే.. స‌భ‌ల‌కు వెళ్లాలా? వ‌ద్దా? అనేది ఆయ‌న‌కు పెద్ద చిక్కుతెస్తోంది. ఎలాగంటే.. ఆయ‌న గ‌త స‌మావేశంలో.. త‌న కుటుంబానికి జ‌రిగిన అవమానం నేప‌థ్యంలో స‌భ‌కు హాజ‌ర‌య్యేది లేద‌ని..తాను సీఎం అయిన త‌ర్వాత‌.. స‌భ‌లోకి అడుగు పెడ‌తాన‌ని అన్నారు. అయితే.. ఇలాంటి విష‌యాల్లో చంద్ర‌బాబు సీనియ‌ర్టీని బ‌ట్టి ఆలోచిస్తే.. ఆయ‌న స‌భ‌కు హాజ‌రు కాక‌పోవ‌డాన్ని మేదావులు సైతం త‌ప్పుబ‌డుతున్నారు.

ఈ క్ర‌మంలో చంద్ర‌బాబు ఇప్పుడు స‌భ‌కు హాజ‌రు కాక‌పోతే.. ఆయ‌న సీనియార్టీపైనా.. వివేచ‌న‌పైన విమర్శలు వ‌చ్చే అవ‌కాశం ఉంది. అంతేకాదు.. కీల‌క‌మైన బ‌డ్జెట్ స‌మావేశాల‌కు వెళ్ల‌కుండా.. స‌ర్కారును ఎంత విమ‌ర్శించినా ప్ర‌యోజ‌నం ఉండ‌దు. అలాగ‌ని వెళ్తే.. త‌ను చేసిన శ‌ప‌థం ఏమ‌వుతుంది? అనేది ప్ర‌శ్న‌. మొత్తంగా చూస్తే.. చంద్ర‌బాబుకు ఎలా చూసుకున్నా.. ఇబ్బంది త‌ప్పేలా క‌నిపించ‌డం లేద‌ని.. అంటున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.