7 నుంచి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ఏ రోజు ఏ సేవంటే ..!

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఆలయంలోనే ఏకాంతంగా నిర్వహించాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజుల్లో టీటీడీ ఆలయాలు నిర్మించిన అన్ని జిల్లాలోని వెనుకబడిన ప్రాంతాలకు చెందిన 500 నుంచి 1000 మంది భక్తులను ఉచితంగా తిరుమలకు తీసుకొచ్చి శ్రీవారిని దర్శనం చేయించేందుకు తగు ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవో జవహర్ రెడ్డి ఇది వరకే అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎస్వీబీసీ కన్నడ, హిందీ ఛానళ్లను కూడా ప్రారంభించడానికి చర్యలు చేపట్టనున్నారు. కొద్దిరోజులుగా అలిపిరి కాలినడక మార్గాన్ని అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యేసరికి అలిపిరి కాలినడక మార్గాన్ని కూడా అందుబాటులోకి తేవాలని అధికారులు నిర్ణయించారు.

కాగా బ్రహ్మోత్సవాల్లో భాగంగా వచ్చే నెల 5వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, 6న అంకురార్పణ, 7న ధ్వజారోహణం, 8 న చిన్న శేష , హంస వాహనం , 9 న సింహ వాహనం, 10న కల్ప వృక్ష వాహనం , 11న గరుడవాహన సేవ, 12న స్వర్ణరథం, 13 న సూర్య , చంద్ర ప్రభ వాహనం , 14న రథోత్సవానికి బదులుగా సర్వ భూపాల సేవ , 15న పల్లకి ఉత్సవం, ధ్వజావరోహణం నిర్వహించనున్నారు. అలాగే అన్న ప్రసాద కేంద్రం లో భక్తులకు ఉదయం 8 నుంచి రాత్రి 11 గంటల వరకు ప్రసాదాన్ని అందజేయనున్నారు.