నిరాడంబర వ్యక్తిత్వం తమిళిసై గొప్పదనం..

తమిళి సై.. రెండేళ్లకు ముందు ఎవరికీ పెద్దగా పరిచయం లేని పేరు.. తెలంగాణ గవర్నర్ గా నరసింహన్ రిలీవ్ అయిన తరువాత తమిళిసై పేరు వార్తల్లోకి వచ్చింది. రాష్ట్ర గవర్నర్ గా తమిళనాడు నుంచి డాక్టర్ తమిళిసైను రాష్ట్రపతి నియమించనున్నారని తెలిసినప్పటినుంచి తెలంగాణ ప్రజలకు ఆమె పరిచయమయ్యారు. గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించి చేపట్టి బుధవారం నాటికి రెండేళ్లు పూర్తి అవుతాయి. ఈ రెండేళ్ల కాలంలో తమిళి సై తెలంగాణ సంప్రదాయాలను గౌరవిస్తూ.. ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటూ మంచిపేరు తెచ్చుకున్నారు. అంతేకాక సమస్య వచ్చినపుడు అధికారులతో మాట్లాడి పరిష్కారానికి ప్రయత్నించారు. కోవిడ్ కష్ట సమయంలో బాధితులకు ధైర్యం చెప్పారు. కోవిడ్ అంటే భయాందోళనలకు గురి కావొద్దని పలు చోట్లకు వెళ్ మాట్లాడారు.

గాంధీ ఆస్పత్రికే వెళ్లి బాధితులతో మాట్లాడిన వ్యక్తిత్వం డాక్టర్ తమిళి సైది. ఇక ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న నిర్ణయాలను వెంటనే ఆమోదించకుండా ఆలోచించి సరైనదేనా అని వివరాలు కనుక్కొని ఆమోదిస్తున్నారు. ఇటీవల కౌశిక్ పేరు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమిస్తూ మంత్రివర్గం సిఫార్సు చేసినా ఆ ఫైల్ ఇంకా రాజ్ భవన్ లోనే ఉండిపోయింది. కౌశిక్ పై ఉన్న కేసుల కారణంగానే అది పెండింగ్ లో ఉన్నట్లు సమాచారం. నిజానిజాలు నిర్ధారించుకున్న తరువాతే గవర్నర్ గా నిర్ణయాలు తీసుకుంటున్నారనే మంచిపేరు సంపాదించారు. పరిపాలనా విషయాలు పక్కన పెడితే తెలంగాణ గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఇక్కడి సంప్రదాయాలను అమితంగా గౌరవిస్తున్నారు. రాష్ట్ర పండుగలు, వేడుకలను రాజ్ భవన్ లో సిబ్బంది మధ్య ఉత్సాహంగా జరుపుతారు. ఈ రెండేళ్ల కాలంలో గవర్నర్ చేసిన మంచి పనులకు సంబంధించి బుధవారం సాయంత్రం ఓ ప్రత్యేక కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. అందులో పుస్తకావిష్కరణ కూడా ఉంటుంది.