సచివాలయం ఎంతవరకు వచ్చింది సారూ..?

తెలంగాణ సచివాలయం ప్రస్తుతం నిర్వహణకు అనుకూలంగా లేదు.. దానని కూల్చి కొత్తది నిర్మించాల్సిందే అని పలువురు వ్యతిరేకిస్తున్నా టీఆర్ఎస్ చీఫ్, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగులు ముందుకు వేశారు. ఉమ్మడి ఏపీలో 60 సంవత్సరాలు పనికి వచ్చిన అంత పెద్ద పెద్ద భవనాలు ఇప్పుడు పనికిరావా అని అనేక విమర్శలు కూడా వచ్చాయి. అయితే ఇవన్నీ ఆయన పట్టించుకోలేదు..కొత్త బిల్డింగ్ కావాల్సిందే.. కట్టాల్సిందే అనుకున్నారు. అంతే.. భవనాలు కూల్చి.. కొత్తభవన నిర్మాణాన్ని ప్రారంభించారు. నిర్మాణ బాధ్యతలు షాపూంజీ..పల్లాంజి కంపెనీకి కట్టబెట్టారు. భవనం పాతపడిపోయిందనే విషయం పక్కనపెడితే.. దానికి వాస్తు సరిగా లేదనేది ఆయన అభిప్రాయం. ఏ బిల్డింగ్ ఎంత పెద్దగా ఉన్నా.. ఎన్ని సౌకర్యాలున్నా వాస్తు బాగాలేకపోతే మాత్రం సారు రారంతా.. అందుకే సీఎం అయిన తరువాత సచివాలయానికి కేసీఆర్ వచ్చిన సందర్భాలు వేళ్లమీద లెక్కించవచ్చు.

ఇది పక్కనపెడితే జులై 2019లో భవనాలను కూల్చి 2020 అక్టోబర్ లో నిర్మాణం ప్రారంభించారు. నిర్మాణ బాధ్యతలు చూసే కంపెనీకి 12 నెలలు గడువిచ్చారు. అయితే ఇప్పటికి 10 నెలలు గడిచింది. ఫస్ట్ ఫ్లోర్ శ్లాబ్ వర్క్ మాత్రమే కంప్లీట్ అయింది. శ్లాబ్ వర్క్ పూర్తి చేయడానికే పది నెలలు పడితే.. ఇక మిగతా ఏడు ఫ్లోర్లు ఎప్పుడు ముగిస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. దాదాపు 6 లక్షల చదరపు అడుగుల్లో నిర్మించనున్న సచివాలయ భవన నిర్మాణాలు నత్తకు నడక నేర్పుతున్నట్లున్నాయి. పనులు జరిగే విధానాన్ని గమనిస్తే పనులు పూర్తి కావడానికి ఇంకా రెండు సంవత్సరాలకు మించి కావచ్చంటున్నారు నిపుణులు. 2023 ఎన్నికల్లో విజయం సాధించిన తరువాతే కొత్త సెక్రెటేరీయేట్ ప్రారంభోత్సవం చేయాలని బాస్ ఆలోచిస్తున్నట్లు సమాచారం.