షర్మిల మనసులో ఏముందో.. మిగతా విషయాలు మాట్లాడరు..

తెలంగాణలో రాజకీయ పార్టీ స్థాపించి ప్రతివారం దీక్షల పేరుతో ప్రజల్లో ఉంటున్న వైటీపీ వ్యవస్థాపకురాలు వైఎస్ షర్మిల కేవలం నిరుద్యోగం గురించే ఎక్కువ ప్రస్తావిస్తున్నారు. తెలంగాణలో ఖాళీ ఉద్యోగాలు చాలా ఉన్నాయి.. వాటిని ఫిలప్ చేయాలి.. వేలమంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు.. వారిని రెగ్యులరైజ్ చేయాలి.. జాబ్ రాక అనేకమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.. వారి కుటుంబాలకు న్యాయం చేయాలి అనే విషయాలను మాత్రమే షర్మిల మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో నిరుద్యోగం సమస్యతో పాటు చాలా సమస్యలున్నాయి. ఎందుకో కేవలం ఈ అంశం మీదే షర్మిల పార్టీ మాట్లాడుతోంది. ప్రభుత్వం అట్టహాసంగా దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. 10 లక్షల రూపాయలను పేద దళిత కుటుంబానికి ఇచ్చే కార్యక్రమం రూపొందించింది. ప్రస్తుతం హుజూరాబాద్.. ఆ తరువాత రాష్ట్రమంతా అమలు చేస్తామని సర్కారు చెబుతోంది. అయితే కేవలం ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే సంక్షేమ పథకాలు ప్రకటిస్తారు కేసీఆర్ అని గతంలో ఒకటి, రెండు సార్లు చెప్పారు.

అయితే ఇపుడు దాని గురించి మాత్రం నోరెత్తడం లేదు. దళితబంధుకు వైటీపీ అనుకూలమా, వ్యతిరేకమా.. అనే దాని గురించి మాట్లాడటం లేదు. ఇతర కులాలకు కూడా బంధు పథకాలను అమలు చేయాలని ఇతర పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. మరి ఈమె పార్టీ మాత్రం అటువంటి బంధు గురించి డిస్కస్ చేయడం లేదు. కేవలం నిరుద్యోగాన్ని పట్టుకొని వేలాడితే ఎలా పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉండగా హుజూరాబాద్ ఎన్నికల గురించి పల్లెత్తు మాట మాట్లాడకపోవడం రాజకీయ పరిశీలకులను, ఇతర పార్టీ నాయకులను ఆశ్చర్యపరుస్తోంది. అన్ని పార్టీల నాయకులు హుజూరాబాద్ గురించి మాట్లాడుతుండటం, నియోజకవర్గంలో దూసుకుపోతుండటంపై రోజూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే వైటీపీ అసలు.. హుజూరాబాద్ ను పూర్తిగా సైడ్ చేసేసింది. రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన హుజూరాబాద్ బైపోల్స్ లో తమ పార్టీ పోటీచేయకపోయినా.. ఎవరికైనా మద్దతునీయడమే.. లేక ప్రభుత్వ నిర్ణయాలకు బలైన వారిని బరిలోకి దింపడమో చేస్తే పార్టీకి మంచి మైలేజ్ వస్తుంది కదా అని పేర్కొంటున్నారు. అయితే.. ఇవేమీ వైటీపీకి పట్టనట్లు లేదు.. దీక్షలు చేసుకుంటూ మాత్రం వెళుతున్నారు అంతే..