కర్నూలుకు న్యాయరాజధాని అవకాశం ఇప్పట్లో చాన్స్ లేదా?

అధికార వికేంద్రీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది.. అందుకే రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని 2020లో ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించింది. అందుకు సంబంధించిన బిల్లు కూడా ఆమోదం పొందింది. పరిపాలన రాజధానిగా విశాఖను, శాసన రాజధానిగా అమరావతిని, న్యాయ రాజధానిగా కర్నూలును చేస్తామని ప్రకటించింది. అయితే ప్రభుత్వం ఇపుడు తీసుకున్న నిర్ణయం చూస్తుంటే జుడీషియరీ కేపిటల్ కర్నూలుకు రావడానికి ఇంకా చాలా సమయమే పడుతుందని పరిశీలకులు భావిస్తున్నారు. ఎందుకంటే.. ప్రస్తుతం అమరావతిలో ఉన్న హైకోర్టు తాత్కాలిక భవనాన్ని విస్తరించడానికి ప్రభుత్వం రూ.29.40 కోట్లు విడుదల చేసింది. అక్కడున్న వసతులు సరిపోవడం లేదని, ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ నిధులు విడుదలయ్యాయి. హైకోర్టుకు అద్భుతమైన భవనం నిర్మించి.. ప్రస్తుతం హైకోర్టు ఉన్న తాత్కాలిక భవనాన్ని జిల్లా కోర్టును ఉంచాలని అప్పటి ఏపీ ప్రభుత్వం జిల్లా కోర్టుగా వినియోగించాలని భావించింది.

అయితే ప్రభుత్వాలు మారిపోవడంతో టీడీపీ చీఫ్ ప్లాన్స్ అమలు కావడం లేదు. అమరావతి కాదు రాజధాని.. మూడు రాజధానులంటూ జగన్ సర్కారు క్లారిటీ కూడా ఇచ్చేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టు విస్తరణకు నిధులు విడుదల కావడమంటే.. కర్నూలుకు హైకోర్టు ఇప్పట్లో రానట్లే అని అర్థం వస్తుందని పలువురు అడ్వకేట్లు అభిప్రాయపడుతున్నారు. మరో విషయమేంటంటే స్వాతంత్ర్య వేడుకల్లో సీఎం చేసిన ప్రసంగంలో ఎక్కడా మూడు రాజధానుల విషయం లేకపోవడం చర్చనీయాంశమైంది. ఆ టాపిక్ గురించి జగన్ మాట్లాడకపోవడం, హైకోర్టు విస్తరణకు నిధులు మంజూరు చేయడం లాంటివి గమనిస్తే అసలు మూడు రాజధానులు ఉంటాయా, లేక అమరావతినే అలాగే కంటిన్యూ చేస్తారా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.