ప్ర‌భుత్వ తీరుపై హీరో నాని ఆగ్ర‌హం?!

న్యాచుర‌ల్ స్టార్ నాని సినిమా థియేటర్ల విష‌యంలో ప్ర‌భుత్వ తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తిమ్మరుసు మూవీ ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌కు స్పెష‌ల్ గెస్ట్‌గా విచ్చేసిన నాని.. నిత్యావసర ధరలు విపరీతంగా పెరుగుతున్నా వాటిని పట్టించుకోరు. కానీ సినిమాపై బోలెడు ఆంక్షలు ఎందుకని ప్ర‌శ్నించారు. నిజానికి మనం మన ఇంట్లో తర్వాత ఎక్కువ సేపు గడిపేది సినిమా థియేటర్స్ లోనే. మన దేశంలో సినిమాను మించిన ఎంటర్ టైన్ మెంట్ మ‌రేది లేదు.

అయిన‌ప్ప‌టికీ, సినిమా అంటేనే చిన్న చూపు చూస్తున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రెస్టారెంట్లు, పబ్స్‌, క్ల‌బ్స్‌ ఇతర ప్రదేశాల కన్నా థియేటర్‌ చాలా సేఫ్‌. కానీ, వాటినే ముందు మూస్తారు, ఎప్పుడో చివ‌ర్లో తెరుస్తారిని నాని అస‌హ‌నం వ్య‌క్తం చేశాడు. ఇక థియేటర్ వ్యవస్థ మీద ఆధార పడి కొన్ని లక్షల మంది జీవ‌న కొన‌సాగిస్తున్నారు. కాబ‌ట్టి, పరిస్థితులు ఇలానే ఉంటే థియేటర్ వ్యవస్థ నాశనం అవుతుంది. ఎన్నో కుటుంబాలు రోడ్డున ప‌డ‌తాయి అని నాని పేర్కొన్నారు.

అయితే నాని వ్యాఖ్య‌లు ఏపీ ప్ర‌భుత్వం పైనే అని ప‌లువురు భావిస్తున్నారు. ఎందుకంటే, తెలంగాణలో ఇప్పటికే థియేటర్లు తెరుచుకునేందుకు అనుమతి ఇచ్చినా.. ఏపీ ప్రభుత్వం మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు అధికారికంగా ఎలాంటి ఉత్వర్వులు జారీ చేయలేదు. పైగా టికెట్ రేట్ల విష‌యంలోనూ ఏపీ స‌ర్కార్ మొండిగా వ్య‌వ‌హ‌రించిన సంగ‌తి తెలిసిందే.