తెలుగు ప్ర‌జ‌ల మ‌దిలో చెర‌గ‌ని ముద్ర వైఎస్ఆర్‌

తెలుగు ప్ర‌జ‌ల మ‌దిలో చెర‌గ‌ని ముద్ర వేసుకున్న రాజ‌కీయ నాయ‌కులు చాలా మందే ఉన్నారు. ఈ జాబితాలో దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్‌.రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ఒక‌రు. 2009లో హెలీకాఫ్ట‌ర్ ప్ర‌మాదంలో ఆక‌స్మికంగా వైఎస్ చ‌నిపోయారు. వైఎస్ మ‌ర‌ణించి అప్పుడే ఎనిమిదేళ్లు కాల‌గ‌ర్భంలో క‌లిసిపోయినా ఆయ‌న చేసిన సేవ‌లు, ఆయ‌న సంక్షేమ ప‌థ‌కాలు, ఆయ‌న ప‌రిపాల‌న‌ను మాత్రం తెలుగు ప్ర‌జ‌లు అంత తొంద‌ర‌గా మ‌ర్చిపోలేరు. ఆయ‌న పాల‌న అంత‌లా చెర‌గ‌ని ముద్ర‌వేసింది తెలుగు ప్ర‌జ‌ల‌పై.

రాజ‌కీయాల్లో వ్య‌క్తుల‌పై ప్ర‌త్యర్థులు ఆరోప‌ణలు చేయ‌డం స‌హ‌జం. ప్ర‌తి రాజ‌కీయ నాయ‌కుడు చేసే పనుల్లో జనాల‌కు న‌చ్చేవి ఉంటాయి…న‌చ్చ‌నివి ఉంటాయి. మెచ్చుకునే ప‌నులు ఉంటాయి…తిట్టేవి ఉంటాయి. వైఎస్ కూడా వాటికి అతీతుడు ఏం కాదు. అయితే ఆయ‌న చేసిన ప‌నులు, చేప‌ట్టిన ప‌థ‌కాలు మాత్రం తెలుగు ప్ర‌జ‌ల మ‌దిలో చెర‌గ‌ని ముద్ర వేశాయి. ఉదాహ‌ర‌ణ‌కు నాడు వైఎస్ రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది అని భావించి రైతుల‌కు ఉచిత క‌రెంట్ ప‌థ‌కం అమ‌లు చేశారు. ఇప్పుడు తెలుగు ప్ర‌జ‌లు రెండు రాష్ట్రాలుగా విడిపోయినా ఈ ఉచిత క‌రెంట్ ప‌థ‌కం తీసేసే సాహ‌సం మాత్రం ఫ్యూచ‌ర్‌లో కూడా ఎవ్వ‌రూ చేయ‌రేమో.

మ‌రి రైతుల‌కు ఎంతో మేలు చేసిన ఈ ఘ‌న‌త ఖ‌చ్చితంగా వైఎస్‌కే ద‌క్కుతుంది. ఇక ఎన్నో సంక్షేమ ప‌థ‌కాలు వైఎస్ ప్ర‌జ‌ల‌కు ఇచ్చారు. ఆయ‌న పాల‌న‌లో రైతుల పంట‌ల‌కు రేట్లు పెరిగాయి. భూముల విలువ అమాంతం పెరిగింది. అన్ని వ‌స్తువుల‌కు రేట్లు పెరిగాయి. ఇక త‌న‌ను న‌మ్మిన వారి కోసం ఎంతైనా చేసే మ‌న‌స్త‌త్వం వైఎస్‌ది. విమర్శలు వివాదాలు పక్కన పెడితే రాజశేఖర్‌ రెడ్డి అంతకు ముందు ఏ ముఖ్యమంత్రి చేరువ కాలేనంతగా ఓ తరానికి కనెక్ట్‌ అయ్యాడు. జలయజ్ఞం.., ఆరోగ్య శ్రీ., ఫీజు రియింబర్స్‌మెంట్‌ అంతకు ముందు ఎవరు ఆలోచించని పథకాలను ప్రజల్లోకి తీసుకువచ్చాడు. హైదరాబాద్‌., విజయవాడ వంటి పట్టణాలకు పరిమితమైన 108 సేవలను రాష్ట్రమంతటికి విస్తరించిన ఘ‌న‌త వైఎస్‌దే.

ప్ర‌జారాజ్యం, టీడీపీ లాంటి పార్టీల మ‌ధ్య ట‌ఫ్ పోటీని త‌ట్టుకుని వైఎస్ 2009లో కాంగ్రెస్‌ను ఒంటి చేత్తో రెండోసారి అధికారంలోకి తీసుకువ‌చ్చారు. ఇక ఫీజు రియింబ‌ర్స్‌మెంట్ ద్వారా ల‌క్ష‌లాది మంది విద్యార్థులు చ‌దువుకుని ఉన్న‌త ఉద్యోగాలు చేయడంతో పాటు విదేశాల‌కు కూడా వెళ్లి ల‌క్ష‌ల జీతం ఆర్జిస్తున్నారు. ఉన్న‌త విద్య‌కు పేద‌వాడు కూడా అర్హుడ‌య్యాడు. ఇక ఆరోగ్య‌శ్రీతో పేద‌వాడు కూడా కార్పొరేట్ ఆసుప‌త్రుల్లో వైద్యం చేయించుకుంటున్నాడు.

ఇక తెలుగు గ‌డ్డ‌పై క‌రువు అనేదే లేకుండా ఉండేందుకు చేప‌ట్టిన జ‌ల‌య‌జ్ఞం గురించి చెప్ప‌క్క‌ర్లేదు. లోటుపాట్లు ఉన్నా వ్యవసాయం, రైతాంగమే ప్రధానమని గుర్తించడమే జలయజ్ఞానికి పునాది. వ్యవసాయం దండగ అన్న వాళ్లు సైతం ఇప్పుడు సాగునీటి ప్రాజెక్టులకు పెద్దపీట వేయడం వెనుక కూడా ఈ స్ఫూర్తే కారణం. ఇక వైఎస్ ఉండి ఉంటే తెలుగు ప్ర‌జ‌లు ఎప్ప‌ట‌కీ క‌లిసే ఉండేవార‌న్న వాద‌న కూడా ఉంది. ఆయ‌న మ‌ర‌ణం త‌ర్వాతే స‌మ‌తుల్య అభివృద్ధి లేక తెలుగు వారు ఏపీ, తెలంగాణ‌గా రెండు ముక్క‌ల‌య్యారు. ఆయ‌న మృతి త‌ర్వాత ఆయ‌న త‌న‌యుడు వైఎస్‌.జ‌గ‌న్ వైసీపీ పార్టీ పెట్టి ఈ రోజు ఇంత త‌క్కువ వ‌య‌స్సులోనే ఇంత బ‌ల‌మైన ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్నాడంటే అదంతా వైఎస్‌పై ఉన్న అభిమాన‌మే అని ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.