భ‌గ్గుమ‌న్న వంగ‌వీటి ఫ్యాన్స్‌…. బంధువును బ‌య‌ట‌కు పంపేసిన జ‌గ‌న్‌

మూలిగే న‌క్క‌మీద తాటిపండు చందంగా ఉన్న బెజ‌వాడ వైసీపీలో ఇప్పుడు పెద్ద ముస‌లం మొద‌లైంది. వైసీపీ ట్రేడ్ యూనియ‌న్ నాయ‌కుడు పూనూరు గౌతంరెడ్డి కాపుల‌తో పాటు వంగ‌వీటి రంగా, ఆయ‌న త‌న‌యుడు రాధాపై చేసిన వ్యాఖ్య‌లు పార్టీని అట్టుడికించాయి. గౌతంరెడ్డి ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో దివంగత నేత వంగవీటి మోహన్‌రంగా సహా వైసీపీ నాయకులపై చేసిన తీవ్ర వ్యాఖ్య‌లు అటు పార్టీలోను, ఇటు కాపుల్లోను తీవ్ర క‌ల‌క‌లం రేపాయి.

కాపులు, వంగ‌వీటి అభిమానులు అయితే గౌతంరెడ్డితో పాటు పార్టీ అధినేత జ‌గ‌న్‌కే వార్నింగ్ ఇచ్చే వ‌ర‌కు ప‌రిస్థితి వెళ్లింది. దీంతో వెంట‌నే దిద్దుబాటు చ‌ర్య‌లు చేప‌ట్ట‌క‌పోతే కాపులు వైసీపీకి దూర‌మ‌వుతార‌ని భావించిన జ‌గ‌న్ వెంట‌నే గౌతంరెడ్డిని పార్టీ నుంచి స‌స్పెండ్ చేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేశారు. గౌతంరెడ్డి జ‌గ‌న్‌కు ద‌గ్గ‌ర బంధువు. వైసీపీ ట్రేడ్ యూనియ‌న్ అధ్య‌క్షుడిగా ఉన్న ఆయ‌న గ‌త ఎన్నిక‌ల్లో విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆ పార్టీ త‌ర‌పున పోటీ చేసి బొండా ఉమా చేతిలో 27 వేల ఓట్ల భారీ తేడాతో ఓడిపోయారు.

అనంత‌రం గ‌త ఎన్నిక‌ల్లో తూర్పులో ఓడిపోయిన రాధాను జ‌గ‌న్ తిరిగి సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్‌గా వేశారు. ఇక ఇటీవ‌ల మ‌ల్లాది విష్ణు కూడా రావ‌డంతో గౌతంరెడ్డికి విజ‌య‌వాడలో సీటు లేదని డిసైడ్ అయిపోయింది. ఇక జ‌గ‌న్ కూడా ఆయ‌న‌కు ప్ర‌యారిటీ ఇవ్వ‌డం లేదు. ఇక ఇప్పుడు ఆయ‌న వంగ‌వీటి రంగా, రాధాపై చేసిన వ్యాఖ్య‌లు పార్టీకి పెద్ద మైన‌స్‌గా మార‌డంతో జ‌గ‌న్ వెంట‌నే ఆయ‌న‌పై వేటు వేసేశారు.

వైఎస్సార్ క‌డ‌ప జిల్లా పర్యటన ముగించుకుని హైదరాబాద్‌ వచ్చిన వైఎస్‌ జగన్‌ ఆదివారం రాత్రి పార్టీ నాయకులతో ఈ అంశంపై చర్చించారు. గౌతంరెడ్డి వ్యవహారంపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని వైసీపీ క్రమశిక్షణా కమిటీని ఆదేశించారు. ఇక గౌతంరెడ్డిని పార్టీ నుంచి స‌స్పెండ్ చేసిన జ‌గ‌న్ అనవసర వ్యాఖ్యలు చేస్తే ఎంతస్థాయి వారినైనా ఉపేక్షించబోమని జగన్ స్పష్టం చేశారు. వంగవీటి రంగాను తామంతా అభిమానిస్తామన్నారు.