నిన్న బాబు ద‌గ్గ‌ర హీరో… నేడు జీరో

ఏపీ సీఎం చంద్ర‌బాబు, ఆయ‌న త‌న‌యుడు మంత్రి లోకేష్ ముందు నిన్న‌టి వ‌ర‌కు హీరోగా ఉన్న ఓ మంత్రి నేడు జీరో అయిపోయాడా ? ఆయ‌నకు అప్ప‌గించిన కీల‌క బాధ్య‌త‌ల నిర్వ‌హ‌ణలో ఫెయిల్ అవ్వ‌డంతో పాటు స‌ద‌రు మంత్రి చేసిన వ్యాఖ్య‌లే ఇప్పుడు ఆయ‌న్ను బాబు, లోకేష్ ద‌గ్గర జీరో చేశాయా ? అంటే ఏపీ పాలిటిక్స్ ఇన్న‌ర్ స‌ర్కిల్‌లో వినిపిస్తోన్న విశ్వ‌సనీయ‌వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం అవున‌నే ఆన్స‌రే వినిపిస్తోంది.

నిన్న‌టి వ‌ర‌కు చంద్ర‌బాబుకు, లోకేష్‌కు డిప్యూటీ సీఎం & హోం మంత్రి నిమ్మకాయ‌ల చిన‌రాజ‌ప్ప అత్యంత విశ్వాస‌పాత్రుడిగా ఉన్నారు. చంద్ర‌బాబుకు ఆయ‌న ఎంత న‌మ్మ‌కంగా ఉండేవారో ఆ త‌ర్వాత లోకేష్‌కు కూడా ఆయ‌న అంతే స‌న్నిహిత‌మ‌య్యారు. హోం శాఖను లోకేష్ బాగా మానిట‌రింగ్ చేసేవారు. అయినా చిన‌రాజ‌ప్ప ఈ విష‌యంలో అన్ని కీల‌క విష‌యాలు లోకేష్‌కే వ‌దిలేయ‌డంతో వీరిద్ద‌రి మ‌ధ్య స‌ఖ్య‌త బాగా కుదిరింది.

ఇదంతా గ‌తం ఇప్పుడు క‌ట్ చేస్తే చంద్ర‌బాబుతో పాటు లోకేష్ ద‌గ్గ‌ర చిన‌రాజ‌ప్ప ప‌రువు మొత్తం పోయింది. ఇందుకు తాజాగా జ‌రిగిన కాకినాడ ఉప ఎన్నికే ప్ర‌ధాన కార‌ణం. నంద్యాల‌, కాకినాడ ఎన్నిక‌లు ఒకేసారి రావ‌డంతో చంద్ర‌బాబు నంద్యాల బాధ్య‌త‌ల‌ను కేఈ.కృష్ణ‌మూర్తికి, కాకినాడ బాధ్య‌త‌ల‌ను మ‌రో డిప్యూటీ సీఎం అయిన చిన‌రాజ‌ప్ప‌కు అప్ప‌గించారు. అయితే కాకినాడ ఎన్నిక‌ల‌ను మానిట‌రింగ్ చేయ‌డంలో రాజ‌ప్ప విఫ‌ల‌మవ్వ‌డంతో పాటు అక్క‌డ సీట్ల స‌ర్దుబాటులో అసంతృప్తి చెల‌రేగినా స‌ర్దుబాటు చేయ‌లేక‌పోవ‌డం, టీడీపీ రెబ‌ల్ అభ్య‌ర్థుల‌కు స‌ర్దిచెప్ప‌క‌పోవ‌డంతో బాబు ఆయ‌న‌పై సీరియ‌స్ అయ్యారు.

దీనికి తోడు ఆయ‌న టీడీపీకి వెన్నుద‌న్నుగా ఉన్న చంద్ర‌బాబు సామాజిక వ‌ర్గంపై చేసిన కామెంట్లు కూడా బాబు దృష్టికి వెళ్లాయి. దీంతో చంద్ర‌బాబు ఉన్న‌ప‌ళాన కాకినాడ ఎన్నిక‌ల బాధ్య‌త‌ల నుంచి గుంటూరు జిల్లాకు చెందిన ప్ర‌త్తిపాటి పుల్లారావుకు అక్క‌డ బాధ్య‌త‌లు అప్ప‌గించారు. ఆ త‌ర్వాత చంద్ర‌బాబు రాజ‌ప్ప‌కు కాకుండా చంద్ర‌బాబు ప్ర‌తి రోజు ప్ర‌త్తిపాటితో పాటు జిల్లాకు చెందిన మ‌రో మంత్రి య‌న‌మ‌ల‌తో స‌మీక్ష‌లు చేశారు.

ఇక కాకినాడ రిజ‌ల్ట్ వ‌చ్చాక మేయ‌ర్ ఎంపిక‌లో కూడా బాబు ఎంపీ వ‌ర్గం, ఎమ్మెల్యే వ‌ర్గం, మునిసిపల్ శాఖా మంత్రి నారాయ‌ణ మ‌ద్ద‌తు ఉన్న కార్పొరేట‌ర్ల‌లో ఎవ‌రో ఒక‌రికి మేయ‌ర్ పీఠం ఇవ్వాల‌ని ఆలోచన చేస్తున్నారే త‌ప్ప చినరాజ‌ప్ప సిఫార్సుల‌ను ప‌ట్టించుకునే స్థితిలో లేరు. ఇక లోకేష్ కూడా బాబు సూచ‌న మేర‌కు రాజ‌ప్ప‌కు ప్రయారిటీ త‌గ్గించేసిన‌ట్టు టీడీపీ వ‌ర్గాల్లో వినిపిస్తోన్న టాక్‌. పాపం కాకినాడ కార్పొరేష‌న్‌లో టీడీపీ భారీగా గెలిచినా రాజ‌ప్ప మాత్రం జీరో అయ్యాడు.