శిల్పా బ్ర‌ద‌ర్స్‌ను వ‌ద‌ల బొమ్మాళి

రాత్రికి రాత్రే బండ్లు ఓడ‌లు…ఓడ‌లు బ‌ళ్లు అవుతాయ‌న్న సామెత ఉంది. ఆవేశంలో…అసంతృప్తిలో నిర్ణయాలు తీసుకుంటే అవి అనర్ధాలకు దారి తీస్తాయని పెద్దలు చెబుతారు. ప్రస్తుతం ఏపీలోని క‌ర్నూలు జిల్లా నంద్యాల‌కు చెందిన శిల్పా బ్రదర్స్ విషయంలో అది నిజమైంది. శిల్పా బ్రదర్స్ గురించి తెలిసిన వారందరికీ, వారి ప్రస్తుత పరిస్థితిని చూస్తే ఆవేదన కలుగుతుందని చెప్ప‌క తప్ప‌దు.

నెల‌న్న‌ర రోజుల క్రితం టీడీపీలో మ‌హ‌రాజుల్లా ఉన్న వీరు ఇప్పుడు చేతిలో ఉన్న ప‌ద‌వుల‌తో పాటు, డ‌బ్బులు పోగొట్టుకుని ఇంట్లో కూర్చున్నారు. నంద్యాల ఉప ఎన్నిక‌కు ముందు టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరిన శిల్పా మోహ‌న్‌రెడ్డి ఇక్క‌డ ఉప ఎన్నిక‌ల్లో చిత్తుచిత్తుగా ఓడిపోయారు. ఇక టీడీపీ ఎమ్మెల్సీగా ఆరేళ్ల ప‌ద‌వీ కాలాన్ని అన్న‌కోసం వ‌దులుకున్న శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి ప‌ద‌వితో పాటు ప‌రువు పోగొట్టుకున్నారు.

ఇక తాను నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో ఓడిపోతే రాజ‌కీయ స‌న్యాసం చేస్తాన‌ని మంత్రి అఖిల‌ప్రియ‌పై శిల్పా మోహ‌న్‌రెడ్డి స‌వాల్ చేశారు. ఇప్పుడు ఉప ఎన్నిక‌ల్లో ఓడిపోవ‌డంతో ఆయ‌న ఆ మాటను ఎస్కేప్ చేసేశారు. అయితే మంత్రి అఖిలకు మాత్రం శిల్పా మోహ‌న్‌రెడ్డిపై ఇంకా క‌సితీరిన‌ట్టు లేదు. నంద్యాలలో టీడీపీ గెలిచిన తర్వాత శిల్పా బ్రదర్స్ కనిపించడం లేదని, అప్పట్లో భూమా నాగిరెడ్డి గెలిచిన తర్వాత పారిపోయారు.. ఇప్పుడు బ్రహ్మానందరెడ్డి గెలిచాక పారిపోయారని ఆమె ఎద్దేవాచేశారు.

ప్రజల ముందుకు వచ్చి రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పేవరకు శిల్పా మోహన్‌రెడ్డిని వదలి పెట్టనని హెచ్చరించారు. ఇక నంద్యాల‌లో గెలిస్తే మ‌గాళ్లం.. ఓడిపోతే ఆడోళ్లం అని స‌వాల్ చేసిన చ‌క్ర‌పాణిరెడ్డిని కూడా ఆమె వ‌ద‌ల్లేదు. చ‌క్ర‌పాణిరెడ్డి జ‌గ‌న్ స‌భ‌లో చేసిన వ్యాఖ్య‌ల‌ను ఆమె ఊటంకిస్తూ నాడు అలా అన్న ఆయ‌న ఇప్పుడు ఎక్క‌డికి పారిపోయార‌ని సెటైర్ వేశారు. ఏదేమైనా శిల్పా సోద‌రుల‌పై క‌సి అఖిల‌కు ఇంకా తీరిన‌ట్టు లేదు. ఆమె వాళ్ల‌ను ఇంకా టార్గెట్ చేస్తూనే ఉన్నారు.