టీడీపీలోకి జంప్ చేసే ఆ 30 మంది ఎమ్మెల్యేలు ఎవ‌రు..?

ఏపీలో నంద్యాల ఉప ఎన్నిక ఎంత ప్ర‌తిష్టాత్మ‌కంగా జ‌రిగిందో చూశాం. ఈ ఎన్నిక దాదాపు నెల రోజులు పాటు తెలుగు రాజ‌కీయాల‌ను బాగా హీటెక్కించేసింది. ఈ ఎన్నిక కోసం ఏపీ సీఎం చంద్ర‌బాబు త‌న స‌చివాల‌యంలో ఉండాల్సిన మంత్రుల‌తో పాటు మిగిలిన ఎమ్మెల్యేలంద‌రిని అక్క‌డే మోహ‌రించేశారు. తాను సైతం చివ‌రి రెండు రోజులు నంద్యాల‌లో ప్ర‌చారం చేశారు.

ఇక విప‌క్ష వైసీపీ అధినేత వైఎస్‌.జ‌గ‌న్ అయితే త‌న పార్టీ ఎమ్మెల్యేల‌ను అక్క‌డ మోహ‌రించ‌డంతో పాటు తాను ఏకంగా 15 రోజుల పాటు అక్క‌డే మ‌కాం వేశారు. నంద్యాల ఫ‌లితం కోసం తెలుగు జ‌నాలు ఎంత ఉత్కంఠ‌తో ఎదురు చూశారో ? టీడీపీ, వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధులు కూడా అంతే టెన్ష‌న్‌తో చూశారు. ఇక వైసీపీ వాళ్లు అయితే ఈ ఎన్నిక త‌మ రాజ‌కీయ భ‌విష్య‌త్తుకు, వైసీపీ స‌త్తాకు నిద‌ర్శ‌నంగా భావించారు.

ఇక్క‌డ గెలిస్తేనే త‌మ‌కు, వైసీపీకి భ‌విష్య‌త్తు ఉంటుంద‌న్న నిర్ణ‌యానికి వారు వ‌చ్చేశారు. వాళ్ల ఆశ‌లు రివ‌ర్స్ అయ్యాయి. నంద్యాలలో వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. ఇక ఇప్పుడు కాకినాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లోను అదే జ‌రిగింది. దీంతో ప‌లువురు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరేందుకు ఆస‌క్తితో ఉన్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.

కొంద‌రు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల‌తో ట‌చ్‌లో కూడా ఉంటున్నార‌ట‌. ఈ విష‌యాన్ని ఇప్ప‌టికే ఇద్ద‌రు ముగ్గురు మంత్రులు కూడా చెప్పారు. దాదాపు ఆరేడుగురు వైసీపీ ఎమ్మెల్యేలు అయితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిక్కెట్‌పై హామీ వ‌స్తే ఇప్ప‌టికిప్పుడే గోడ దూకేందుకు సిద్ధంగా ఉన్న‌ట్టు కూడా తెలుస్తోంది.

ఇక ఇటీవ‌ల 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ మార‌తారంటూ సోష‌ల్ మీడియాలో పేర్ల‌తో స‌హా స్ప్రెడ్ అయ్యాయి. ఇక ఇప్పుడు ఏకంగా 30 మంది పేర్లు చర్చ‌ల్లోకి వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే 21 మంది ఎమ్మెల్యేలు చంద్ర‌బాబు చెంత‌కు చేరిపోయారు. వైసీపీకి ఉన్న 40 మంది ఎమ్మెల్యేల్లో ఇప్పుడు 30 మంది పేర్లు జంపింగ్ జాబితాలో ఉన్న‌ట్టు ఏపీ మంత్రులే చెపుతున్నారు. ఈ 30 మంది కాక‌పోయినా వ‌చ్చే నాలుగైదు నెలల్లో క‌నీసం 10 మంది అయినా టీడీపీలోకి జంప్ చేస్తార‌ని వైసీపీలోనే ఇంట‌ర్న‌ల్ చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. వీరిలో అసంతృప్తితో ఉన్న వారిని జ‌గ‌న్ బుజ్జ‌గిస్తున్నా వారు మాత్రం పార్టీ మారేందుకే రెడీగా ఉన్న‌ట్టు టాక్‌?