నంద్యాల రూర‌ల్‌లో వైసీపీ ఆశ నిరాశే

నంద్యాల ఉపఎన్నిక కౌంటింగ్ తొలి రౌండ్ నుంచే అధికార టీడీపీ దూసుకుపోతోంది. మొత్తం 19 రౌండ్ల ఓట్ల లెక్కింపులో ఇప్ప‌టి వ‌ర‌కు 6 రౌండ్ల లెక్కింపు పూర్త‌య్యింది. నంద్యాల రూర‌ల్ మండ‌లంలోని ఐదు రౌండ్ల‌లో టీడీపీకి ఏకంగా 13135 ఓట్ల భారీ మెజార్టీ వ‌చ్చింది. నంద్యాల రూర‌ల్ మండ‌లంతో పాటు గోస్పాడు మండ‌లంపై ముందునుంచి విప‌క్ష వైసీపీ ఎన్నో ఆశ‌లు పెట్టుకుంది.

ఈ రెండు మండ‌లాల మెజార్టీతో తాము గెలుస్తామ‌ని, టౌన్‌లో టీడీపీకి మెజార్టీ వ‌చ్చినా దానిని తాము అధిగ‌మించి మ‌రీ గెలుస్తామ‌ని వైసీపీ వాళ్లు ధీమాతో ఉన్నారు. వైసీపీకి మంచి పట్టు ఉన్న చోటనే టీడీపీ హవా కొనసాగడంతో టీడీపీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం పెరిగింది. ఐదు రౌండ్ల తర్వాత టీడీపీకి 13135 ఓట్ల మెజారిటీలో ఉంది. నంద్యాల రూరల్‌లో వైసీపీకి భారీగా గండిపడింది.

వైసీపీ ఆశలు పెట్టుకున్న గోస్పాడు ఫలితం చివరి మూడు రౌండ్లలో తేలనుంది. కానీ గోస్పాడులో కూడా టీడీపీనే ఆధిక్యం కొనసాగుతుందని టీడీపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. నంద్యాల అర్బన్‌పై టీడీపీకి మొదటి నుంచి పట్టు ఉండటంతో ఇక గెలుపు భారీ మెజారిటీలోనే ఉంటుందని వారు అభిప్రాయపడుతున్నారు.

నంద్యాల రూర‌ల్‌లోని ఐదు రౌండ్ల‌లో టీడీపీకి 31062 ఓట్లు, వైసీపీకి 17927, కాంగ్రెస్‌కు 278 ఓట్లు వ‌చ్చాయి. ఓవ‌రాల్‌గా టీడీపీకి 13135 మెజార్టీ వ‌చ్చింది. నంద్యాల రూర‌ల్‌లో సైకిల్ స్పీడ్‌కు ఫ్యాన్ రెక్క‌లు విరిగిపోయాయి.