నంద్యాల‌లో జ‌గ‌న్ న‌యా వ్యూహం… ఇర‌కాటంలో చంద్ర‌బాబు

నంద్యాల ఉప ఎన్నిక ట్విస్టుల మీద ట్విస్టుల‌తో థ్రిల్ల‌ర్ సినిమాను త‌ల‌పిస్తోంది. టీడీపీ నుంచి వైసీపీలో చేరిన శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి పార్టీతో పాటు త‌నకు టీడీపీ నుంచి వ‌చ్చిన ఎమ్మెల్సీ ప‌ద‌వికి కూడా రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ రాజీనామా ద్వారా జ‌గ‌న్ చంద్రబాబును పెద్ద ఇర‌కాటంలోకి నెట్టాడు. పార్టీ ఫిరాయింపుల ద్వారా తాను చేర్చుకున్న చ‌క్ర‌పాణిరెడ్డి ప‌ద‌వికి రాజీనామా చేయించి మ‌రి తాను త‌న పార్టీలో చేర్చుకున్నాన‌ని, మ‌రి చంద్ర‌బాబు త‌న పార్టీ నుంచి గెలిచిన 21 మంది ఎమ్మెల్యేల‌ను త‌న పార్టీలో చేర్చుకున్నార‌ని, వారిని కూడా త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేయించాకే తీసుకోవాల‌ని స‌వాల్ చేశారు.

దీనిపై టీడీపీ వాళ్లు జ‌గ‌న్‌, వైసీపీకి రివ‌ర్స్ కౌంట‌ర్ ఇచ్చారు. నంద్యాల‌లో మునిసిపల్ చైర్మ‌న్‌తో పాటు టీడీపీ త‌ర‌పున గెలిచిన కౌన్సెల‌ర్ల చేత కూడా రాజీనామా చేయించాల‌ని వారు జ‌గ‌న్‌కు ప్ర‌తి స‌వాల్ విసిరారు. ఇక ప్ర‌స్తుతం నంద్యాల‌లో టీడీపీ త‌ర‌పున వైసీపీ నుంచి ఫిరాయించిన మంత్రులు, ఎమ్మెల్యేల హ‌డావిడే ఎక్కువుగా క‌న‌ప‌డుతోంది. ఫిరాయింపు కోటాలో మంత్రులు అయిన అఖిలప్రియ, అమరనాథ్ రెడ్డి. ఆదినారాయణ రెడ్డితో సహా.. ఫిరాయింపు ఎమ్మెల్యేలు నంద్యాల్లో టీడీపీ త‌ర‌పున ప్ర‌చారం చేస్తూ జ‌గ‌న్‌ను తీవ్రంగా విమ‌ర్శిస్తున్నారు.

జ‌గ‌న్ న‌యా ఎత్తుతో బాబుకు షాక్ త‌ప్ప‌దా..!

ఈ క్ర‌మంలోనే ఇప్పుడు ఉప ఎన్నిక సాక్షిగా చంద్ర‌బాబుతో పాటు టీడీపీపై మ‌రింత ఒత్తిడి పెంచ‌డానికి జ‌గ‌న్ అదిరిపోయే వ్యూహం ఎంచుకున్నారు. ఈ వ్యూహంతో చంద్ర‌బాబు ఇర‌కాటంలో ప‌డ‌క త‌ప్పేలా లేదు. నంద్యాల మున్సిపల్ చైర్మన్ తో సహా.. కౌన్సెలర్ల చేత వైకాపా రాజీనామా చేయించనున్నట్టుగా తెలుస్తోంది. శిల్పా మోహన్ రెడ్డితో పాటు మున్సిపల్ చైర్మన్ , కౌన్సిలర్లు వైకాపాలో చేరారు. వారందరి చేతా రాజీనామా చేయించి.. నైతికంగా చంద్రబాబుపై మరింత ఒత్తిడి పెంచాలని జ‌గ‌న్ ప‌న్నిన వ్యూహంలో చంద్ర‌బాబు చిక్కుకోక త‌ప్పేలా లేదు. మ‌రి దీనికి టీడీపీ వాళ్లు ఎలా కౌంట‌ర్ ఇస్తారో ? చూడాలి.