చంద్ర‌బాబుకి హైకోర్టులో చ‌క్కెదురు.. సంచ‌ల‌న తీర్పు

ఏపీ ప్ర‌భుత్వాధినేత చంద్ర‌బాబుకి హైకోర్టులో ఊహించ‌ని విధంగా షాక్ త‌గిలింది. ఇన్నాళ్లూ తాము చెప్పిందే వేదంగా న‌మ్మించిన బాబు బృందానికి హైకోర్టు గ‌ట్టి మొట్టికాయ లాంటి తీర్పు చెప్పింది. త‌మిళ‌నాడులోని స‌దావ‌ర్తి స‌త్రం భూముల విష‌యంలో ప్ర‌భుత్వం గ‌తంలో నిర్వ‌హించిన వేలం ముమ్మాటికీ చెల్ల‌ద‌ని, దానిని ర‌ద్దు చేస్తూ.. మ‌ళ్లీ మ‌రోసారి వేలం నిర్వ‌హించాల‌ని ఆదేశించింది. ఈ నిర్ణ‌యం ఓ ర‌కంగా ప్ర‌భుత్వానికి, చంద్ర‌బాబుకు గ‌ట్టి చెంప పెట్టుగా పేర్కొంటున్నారు విశ్లేష‌కులు. అదేస‌మ‌యంలో తాము చెప్పిందే వేదం అనే వ్యాఖ్య‌లను ఇక‌పై ప్ర‌భుత్వ నేత‌లు ఎవ‌రూ చేయ‌కుండా కూడా హైకోర్టు ముకుతాడు వేసింద‌ని చెబుతున్నారు. మ‌రి విష‌యం ఏంటో చూద్దాం..

స‌దావ‌ర్తి స‌త్రానికి చెందిన 83.11 ఎకరాల భూమిని ప్ర‌భుత్వం రూ.22 కోట్ల‌కు వేలంలో ఒక‌రికి అప్ప‌గించింది. అయితే, ఈ వేలంలో అనేక లోటుపాట్లు ఉన్నాయ‌ని, టీడీపీ పెద్ద‌ల‌ను బాగు చేయ‌డం కోస‌మే ఆ భూముల‌ను త‌క్కువ ధ‌ర‌ల‌కు ప్ర‌భుత్వం క‌ట్ట‌బెట్టింద‌ని వైసీపీ నేత‌లు అప్ప‌ట్లో భారీ ఎత్తున విమ‌ర్శిచారు. ముఖ్యంగా మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి అయితే, దీనిపై కోర్టుకు వెళ్లి పెద్ద ఎత్తున న్యాయ పోరాటం చేశారు. త‌న వారి కోసం చంద్ర‌బాబు ఈ భూముల‌ను కారు చౌక‌గా అమ్మేశార‌ని ఆయ‌న ఆరోపించారు. అంతేకాదు.. వేలం ర‌ద్దు చేయాల‌ని, తిరిగి నిర్వ‌హించాల‌ని కోర్టుకు సూచించారు.

అయితే, ప్ర‌భుత్వం మాత్రం ఆ భూములకు రూ.22 కోట్లు రావ‌డ‌మే గ‌గ‌న‌మ‌ని కోర్టుకు తెలిపింది. ఈ భూములు ఎవ‌రూ కొన‌ర‌ని, అయినా భారీ మొత్తానికే తాము అమ్మామ‌ని చెప్పింది. ఈ సంద‌ర్భంగా అప్ప‌ట్లో హైకోర్టు క‌లుగ‌జేసుకుని.. రూ. 22 కోట్లకు అదనంగా మరో రూ.5 కోట్లు ఇస్తే మీకే భూములు ఇస్తామని ఎమ్మెల్యే ఆళ్ల‌కు సూచించింది. దీనిని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న ఆళ్ల‌.. రెండు విడతల్లో పూర్తిస్థాయి నగదు రూ.27.44 కోట్లను దేవాదాయశాఖ ఖాతాకు ఆయన జమచేశారు. చెప్పిన మాట ప్రకారం ఆయన డబ్బులు చెల్లించడంతో చంద్రబాబు సర్కారు ఇరకాటంలో పడింది.

వాస్త‌వానికి తాము అమ్మిన ధర కంటే ఎక్కువ డబ్బులు రావని ఇప్పటివరకు ప్రచారం చేసుకుంటూ వచ్చిన అధికార పార్టీ నాయకులు హైకోర్టు ఆదేశాలతో ఏం చేయాలో తెలియ‌ని ప‌రిస్థితిలోకి వెళ్లారు. ఇక‌, ఇప్పుడు కోర్టు తాజాగా.. ఈ భూముల‌ను ఆళ్ల‌కు అప్ప‌గించ‌కుండా.. మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. సదావర్తి భూములకు మళ్లీ వేలం నిర్వహించాలని, 6 వారాల్లో వేలం ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశించింది. ఎమ్మెల్యే ఆళ్ల చెల్లించిన రూ.27.44 కోట్లను బేస్‌ ప్రైస్‌గా నిర్ణయించి వేలం నిర్వహించాలని సూచించింది. వేలంలో పాల్గొనేందుకు ఎవరూ ముందుకు రాకపోతే ఆళ్ల‌కే ఆ సదావర్తి భూములు చెందుతాయని స్ప‌ష్టం చేసింది. మ‌రి ఇప్పుడు దీనిని చంద్ర‌బాబు ఎలా ప‌రిష్క‌రిస్తారో చూడాలి