వెంక‌య్య వార‌సుడిపై ర‌చ్చ ర‌చ్చ‌

ఏపీ త‌ర‌ఫున ఎంపీ కాక‌పోయినా.. సొంత రాష్ట్ర అభివృద్ధికి ఇప్ప‌టివ‌ర‌కూ అంతో ఇంతో సాయం చేస్తూ వ‌చ్చారు వెంక‌య్య‌నాయుడు! ప్ర‌ధాని మోదీని నేరుగా అడిగినా అవ్వ‌ని వాట‌న్నింటినీ.. వెంక‌య్య‌తో రిక‌మెండ్ చేయించుకునేవారు సీఎం చంద్ర‌బాబు! ఇప్పుడు ఆ అవ‌కాశం లేకుండా పోయింది. రాజ్యాంగ‌బ‌ద్ద‌మైన ప‌ద‌విలోకి వెళిపోవ‌డంతో.. ఇప్పుడు మ‌రో ఆస‌క్తిక‌ర చ‌ర్చ తెర‌పైకి వ‌చ్చింది. వెంకయ్య స్థానాన్ని ఎవ‌రు భ‌ర్తీ చేస్తారు? అంతేగాక వెంక‌య్య నాయుడి వార‌సుడు ఎవ‌రు? అనే ప్ర‌శ్న‌లు ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఈ స్థానం కోసం అటు టీడీపీ, ఇటు బీజేపీ నేత‌లు జోరుగా పోటీప‌డుతున్నారు.

ఉపరాష్ట్రపతి కావడానికి సిద్ధపడుతున్న మాజీ కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు.. గురువారం తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీలు అందరితోనూ ఆత్మీయ పూర్వకంగా భేటీ అయ్యారు. ఇందులో ఏ ఇద్ద‌రు ఎంపీలు మాట్లాడుకున్నా ఒక్క‌టే చ‌ర్చ‌.. అదే వెంకయ్యనాయుడి వార‌సుడు ఎవ‌ర‌నేదే! వెంకయ్య ఏపీ నుంచి ఎంపీగా కేంద్రమంత్రి పదవిలోకి వెళ్లకపోయినప్పటికీ.. ఏపీకి చెందిన వ్యక్తే గనుక.. ఏపీ మంత్రిగానే అంతా పరిగణిస్తూ వచ్చారు. ఇప్పుడు ఆయన స్థానం ఖాళీ అవడంతో.. అందరి మధ్య అదే చర్చ జరుగుతోంది.

ఒక దశలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కేంద్రంలో తెలుగుదేశం పార్టీకి అదనంగా మరో మంత్రి పదవి కూడా అడిగినట్లు ప్రచారం జరిగింది. కానీ అది సాధ్యం కాద‌ని తేలిపోయింద‌ట‌. ఇక భాజపాలోనే మంత్రి పదవిని ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువ‌గానే ఉంద‌ట‌. ఎంపీ పదవిలో లేకపోయినా సరే.. మంత్రి పదవి మాత్రం కావాలను కుంటున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. ఒకవైపు చంద్రబాబు మీద నిత్యం కత్తులు దూస్తూ ఉండే దగ్గుబాటి పురందే శ్వరి కూడా ఈ ప్రయత్నాల్లో ఉన్నారని అలాగే కేంద్ర మాజీమంత్రి అయిన కావూరి సాంబశివరావు – చంద్రబాబు అంటే గిట్టని పలువురు సీనియర్లు కూడా కేంద్ర మంత్రి పదవి రేసులో ఉన్నారని విశ్వసనీయ సమాచారం.

మొత్తానికి అటు టీడీపీ, ఇటు బీజేపీ నేత‌లు మాత్రం ఎవ‌రి ప్ర‌య‌త్నాల్లో వారు ఉన్నార‌ట‌. మ‌రి కొద్ది రోజుల్లోనే కేంద్ర‌ కేబినెట్ విస్త‌ర‌ణ జ‌రుగుతుంద‌నే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మ‌రి ఇందులో తమ పార్టీ వారికి ఈ ప‌ద‌వి ఇస్తారో లేక సొంత పార్టీ నేత‌ల‌నే చేర్చుకుంటారో వేచిచూడాల్సిందే!! మ‌రి ప్ర‌ధాని మోదీ ఎవ‌రిని తీసుకుంటారో తెలీదుగానీ.. మొత్తానికి ఇప్పుడు మాత్రం వెంక‌య్య వార‌సుడిపై ర‌చ్చ‌ర‌చ్చ జ‌రుగుతోంది.