ఏపీ మంత్రి కేసీఆర్‌కు ప్ర‌శంస‌లు…ఇంకేముంది

రెండు రాష్ట్రాలుగా విడిపోయిన త‌ర్వాత‌.. తెలంగాణలో టీఆర్ఎస్ ధాటికి తెలుగుదేశం ప్ర‌భుత్వం తీవ్రంగా న‌ష్ట‌పోయింది. దీనిపై అటు తెలంగాణ నేత‌లు.. సీఎం కేసీఆర్‌పై పోరాటం చేస్తూనే ఉన్నారు. ఈ స‌మ‌యంలో కేసీఆర్‌ను ప్ర‌శంసిస్తూ ఏపీ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు తెలంగాణ నేత‌లను ఆగ్ర‌హానికి గురిచేస్తున్నాయి. ఏపీలో ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు నిర్వ‌హిస్తే టీడీపీకి వైసీపీ కంటే త‌క్కువ ఓట్లు వ‌స్తాయ‌ని చెప్పిన కేసీఆర్‌ను పొగ‌డ‌టంపై మండిప‌డుతున్నారు. ఒక‌ప‌క్క తెలంగాణ‌లో తామంతా కేసీఆర్ అవినీతి, ఇత‌ర అంశాల‌పై పోరాడుతూ ఉంటే.. ఇప్పుడు మంత్రి ఉమా ప్ర‌శంస‌ల జ‌ల్లులు కురిపించ‌డం ఏంటంటూ ప్ర‌శ్నిస్తున్నారు.

ఇరు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు కేసీఆర్‌, చంద్ర‌బాబు అడ‌పాద‌డ‌పా క‌లుసుకుని భేటీ అవుతున్నారు. న‌వ్వుతూ ప‌ల‌క‌రించుకుని.. సాద‌రంగా మాట్లాడుకుంటున్నారు. కానీ తెలంగాణ టీడీపీ నేత‌లు మాత్రం కేసీఆర్ ప్ర‌భుత్వంలోని స్కామ్‌లు, అవినీతిపై విప‌క్షాల‌తో క‌లిసి పోరాటాలు చేస్తున్నారు. అయితే వీట‌న్నింటినీ కేసీఆర్ ఏమాత్రం లెక్క చేయడం లేదు. అయితే విప‌క్షాలు మాత్రం త‌మ ఉనికి కాపాడుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉన్నాయి. ఈ స‌మ‌యంలో దేవినేని ఉమ‌.. ‘కేసీఆర్..చంద్రబాబునాయుడులు దేశంలో ఆదర్శ ముఖ్యమంత్రులు’ అంటూ స్టేట్‌మెంట్ ఇవ్వ‌డం టీటీడీపీ నేత‌ల్లో ఆందోళ‌న క‌లిగేలా చేసింది.

మంత్రి ఉమా వ్యాఖ్యలపై తెలంగాణ తెలుగుదేశం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తాము ఓ వైపు తెలంగాణలో కెసీఆర్ సర్కారు అణచివేతకు గురవుతుంటే ఉమామహేశ్వరరావు ఏ మాత్రం సంబంధం లేని విషయంలో తలదూర్చి దేశంలోనే ఆదర్శ సీఎం కెసీఆర్ అంటూ సర్టిఫికెట్లు ఎలా ఇస్తారంటూ టీ టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయాన్ని వారు చంద్రబాబు దృష్టికి కూడా తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఏదైనా నీటిపారుదల శాఖకు సంబంధించిన అంశం ఉంటే.. అంతవరకూ స్పందిస్తే సరిపోతుంది కానీ.. ఇలా అవసరం లేని అంశాల్లో తలదూర్చి ఏకంగా ఆదర్శ సీఎం అంటూ కేసీఆర్ కు ఉమా సర్టిఫికెట్ ఎలా ఇస్తారని తెలంగాణ టీడీపీ సీనియర్ నేత ఒకరు వాపోయారు.

తెలంగాణలో ఓ వైపు మియాపూర్ భూముల స్కామ్, హైదరాబాద్ లో మరో వైపు డ్రగ్స్ మాఫియా కలకలం, దళితులపై దాడుల వంటి అంశాలు ఉండగా ఏపీ మంత్రి ఇలాంటి ప్రకటన చేయటం వల్ల పార్టీ శ్రేణులకు తప్పుడు సంకేతాలు వెళతాయని నేత‌లు ఆవేద‌న వ్య‌క్తంచేస్తున్నారు. భవిష్యత్ లో అయినా ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా చూడాలని టీ టీడీపీ నేతలు పార్టీ అధినేత, ఎపీ సీఎం చంద్రబాబును కోరాలని నిర్ణయించార‌ట‌.