మంత్రిగారు బాబును టెన్ష‌న్ పెడుతున్నారు ఎందుకు..!

మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి దూకుడు టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబుకు ఎప్ప‌టిక‌ప్పుడు చిక్కులు తెచ్చి పెడుతోంది. నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ అండ్ కో పై త‌న‌దైన శైలిలో విరుచుకుప‌డిన ఆయ‌న‌.. మంచి మార్కులే కొట్టేశారు. ఈ స‌మ‌యంలో ఆయ‌న చేస్తున్న ప్ర‌క‌ట‌న‌లు.. మాత్రం ఇప్పుడు టీడీపీని ఇబ్బందుల్లో ప‌డేస్తున్నాయి. ఇప్ప‌టికే నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో 80శాతానికి పైగా పోలింగ్ న‌మోద‌వ‌డంతోనే అంతా ఏమవుతుందో అని ఉత్కంఠ‌గా ఎదురుచూస్తున్నారు. మరి ఈ స‌మ‌యంలో.. సోమిరెడ్డి చేస్తున్న ప్ర‌క‌ట‌న‌లు ఏకంగా టీడీపీ అధినేత‌ను టార్గెట్ చేసేలా ఉండ‌టంతో.. ఇప్పుడు పార్టీ శ్రేణులు తీవ్రంగా ఆందోళ‌న‌కు గుర‌వుతున్నాయి.

2019 ఎన్నిక‌ల‌కు నంద్యాల ఉప ఎన్నిక రిఫ‌రెండం లాంటిద‌ని రాజ‌కీయ విశ్లేష‌కుల‌తో పాటు సామాన్యులు కూడా భావిస్తున్నారు. సీఎం చంద్ర‌బాబుకు పాల‌న‌కు ఇదే నిద‌ర్శ‌న‌మ‌ని అటు వైసీపీ, ఇటు టీడీపీ నేత‌లు కూడా చెబుతున్నారు. అయితే చంద్ర‌బాబు ఆంత‌రంగికుడు, ఎంపీ సుజ‌నా చౌద‌రి మాత్రం ఈ ప్ర‌చారాన్ని కొట్టిపారేశాడు. బాబు పాల‌న‌కు ఇది రిఫ‌రెండం కాద‌ని స్ప‌ష్టంచేసేశాడు. `నంద్యాల్లో గెలిస్తే బాబు పాలనపై అంతా మంచి స్పందన ఉన్నట్టే.. ఓడితే బాబు పాలన బాగోలేనట్టే..` అని సుజనా చౌదరి చెప్పలేకపోయాడు. కానీ ఇప్పుడు సోమిరెడ్డి మాత్రం.. ఇది రిఫరెండం అని చెప్ప‌క‌నే చెబుతున్నారు.

నంద్యాల బై పోల్ ను బాబు మెడపై కత్తి అనే చెబుతున్నారు. నంద్యాల ఉప ఎన్నిక ముమ్మాటికీ బాబు పాలనపై రెఫరండమే అని సోమిరెడ్డి మరోసారి స్పష్టం చేశాడు. ఉప ఎన్నిక పోలింగ్ కు ముందు ఒకసారి మాట్లాడుతూ.. నంద్యాల బై పోల్ రెఫరండమే అని సోమిరెడ్డి అన్నాడు. తాజాగా మరోసారి ఆయన ఇదే మాటే చెప్పారు. అంతే కాదు.. పాతికవేల ఓట్ల మెజారిటీని సాధిస్తామని కూడా సోమిరెడ్డి చెప్పుకొచ్చారు. మరి నంద్యాల బై పోల్ పోలింగ్ తీరును చూస్తే.. త్రాసు ఎటు మొగ్గిందో చెప్పడం చాలా కష్టంగా ఉంది. తమ పార్టీనే కచ్చితంగా నెగ్గుతుంది అని అంతా పైకి ప్రకటనలు చేస్తున్నారు కానీ.. లోపల మాత్రం ఇరు వర్గాలకూ టెన్షన్ ఉంది.

ఈ నేపథ్యంలో సోమిరెడ్డి తను మంత్రి హోదాలో ఉన్న విషయాన్ని మరిచిపోయి.. పాతిక వేల మెజారిటీ, రెఫరండమే అనే మాటలు మాట్లాడటంపై పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్య‌క్తంచేస్తున్నాయి. మంత్రి కాక‌ముందు.. ఎలా మాట్లాడినా ఫ‌ర్లేదు కానీ.. మంత్రి గా ఆయ‌న‌ మాట్లాడే ప్రతిమాటా కౌంట్ అవుతుందని గ్ర‌హించ‌లేక‌పోతున్నారా అని ప్ర‌శ్నిస్తున్నారు. 25వేల మెజారిటీ అంటుంటే.. టీడీపీ శ్రేణులే భయాందోళనకు లోనవుతున్నాయి. ఇప్ప‌టికే ఆందోళ‌న‌లో ఉన్న వారు ఇలాంటి ప్ర‌క‌ట‌న‌ల‌తో మరింత ఇబ్బందులు ప‌డుతున్నారు.