త్వరలోనేనా రేవంత్ దండయాత్ర!

తెలంగాణ‌లో 2019లో సీఎం కేసీఆర్‌ను ఎలాగైనా గ‌ద్దె దింపాల‌న్న టార్గెట్‌తో కులాలు, రాజ‌కీయ నాయ‌కులు, మేథావులంతా ఒక్క‌టయ్యే వేదిక త్వ‌ర‌లోనే ఏర్పాటు అవుతోంది. ప్ర‌స్తుతం అక్క‌డ ఉన్న రాజ‌కీయ ప‌రిస్థితుల నేప‌థ్యంలో మ‌ళ్లీ టీఆర్ఎస్సే గెలుస్తుంద‌ని, కేసీఆరే సీఎం అవుతార‌ని అంద‌రూ చెపుతున్నారు. అక్క‌డ విప‌క్షాలు చాలా వీక్ అవ్వ‌డం కూడా కేసీఆర్‌కు బాగా క‌లిసిరానుంది.

వ‌చ్చే ఎన్నిక‌ల వేళ ఏదైనా అనూహ్యం జ‌రిగితే త‌ప్ప మ‌ళ్లీ టీఆర్ఎస్సే గెలుస్తుంద‌ని చాలా స‌ర్వేలు స్ప‌ష్టం చేస్తున్నాయి. అయితే కేసీఆర్ ఒంటెద్దు పోక‌డ‌ల‌తో ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త ఉన్నా దానిని క్యాష్ చేసుకోవ‌డంలో మాత్రం విప‌క్షాలు ఘోరంగా ఫెయిల్ అవుతున్నాయి. కేసీఆర్ కూడా చాలా ధీమాగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌ను ఎవ్వ‌రూ ఓడించ‌లేర‌ని స‌వాళ్లు మీద స‌వాళ్లు చేస్తున్నారు.

అయితే కేసీఆర్‌కు దిమ్మ‌తిరిగి.. మైండ్ బ్లాంక్ అయ్యేలా రాష్ట్ర రాజ‌కీయాలు పెద్ద ఎత్తున మారిపోతున్నాయి. ఇక్క‌డ రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు శ‌ర‌వేగంగా మారుతున్నాయి. కేసీఆర్ టార్గెట్‌గా ఇప్పుడు తెలంగాణ రాజ‌కీయాలు ముందుగు సాగుతున్నాయి. తెలంగాణలో కేసీఆర్‌ను, టీఆర్ఎస్ టార్గెట్‌గా చేసుకుని విమ‌ర్శ‌లు చేసే టీ టీడీపీ ఫైర్‌డ్రాండ్ రేవంత్‌రెడ్డి ఓ మ‌హాకూట‌మికి ప్లాన్ చేస్తున్నారు.

టీఆర్ఎస్‌లో ప్ర‌స్తుతం కేసీఆర్ సామాజిక‌వ‌ర్గం అయిన వెల‌మ‌ల హ‌వానే న‌డుస్తోంది. కేసీఆర్ ఫ్యామిలీ నుంచే మ‌గ్గురు మంత్రుల‌తో పాటు ఎంపీ కూడా ఉన్నారు. ఇక ఇప్పుడు ఈ హ‌వాకు చెక్ పెట్టేందుకు రాష్ట్రంలోని కాపు, క‌మ్మ సామాజిక వ‌ర్గాల‌ను ఏక‌తాటిపైకి తీసుకువ‌చ్చి.. కేసీఆర్‌కు వ్య‌తిరేకంగా మ‌హాకూట‌మిని ఏర్పాటు చేయ‌డానికి రేవంత్ తెర‌వెనుక చేస్తున్న ప్ర‌య‌త్నాలు పూర్తిగా సక్సెస్ అయ్యాయ‌ని తెలుస్తోంది.

పార్టీల‌కు అతీతంగా అన్ని పార్టీల్లో ఉన్న రెడ్డి, క‌మ్మ వ‌ర్గం నేత‌ల‌తో పాటు కేసీఆర్ చేతిలో దెబ్బ‌తిన్న మేథావుల సంఘం నేత ప్రొఫెస‌ర్ కోదండ రాం, బ‌ల‌మైన బీసీ వ‌ర్గాల‌కు చెందిన నాయ‌కులు, మంద‌కృష్ణ మాదిగ‌, గ‌ద్ద‌ర్ ఇలా వీళ్లంద‌రిని క‌లుపుకుని రేవంత్ కేసీఆర్ టార్గెట్‌గా మ‌హాకూట‌మి ఏర్పాటు చేసే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. దీనిపై త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌ట‌న కూడా రానుంద‌ని తెలుస్తోంది.

రేవంత్ వీళ్లంద‌రిని ఒకే తాటిమీద‌కు తీసుకువ‌చ్చి కేసీఆర్‌కు యాంటీగా కూట‌మిగా మ‌హాకూట‌మి ఏర్పాటు చేస్తే కేసీఆర్‌కు చెమ‌ట‌లు ప‌ట్ట‌డం ఖాయ‌మ‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో కేసీఆర్‌కు గెలుపు అంత సులువుకాద‌న్న చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. మ‌రి 2019లో తెలంగాణ ఎన్నిక‌లను ఈ కూట‌మి ఏర్పాటు ప్ర‌క‌ట‌న ఆస‌క్తిగా మార్చేసింది.