కాల్పుల కేసులో విక్ర‌మ్ గౌడ్ షాకింగ్ ట్విస్ట్‌

హైదరాబాద్‌లో కొద్ది రోజుల క్రితం మాజీ మంత్రి ముఖేష్‌గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ కాల్పుల కేసు పెద్ద సంచ‌ల‌నం రేపింది. ఈ కాల్పుల కేసు విచార‌ణలో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకున్నాయి. ముందు విక్ర‌మ్ గౌడ్‌పై ఎవ‌రో కాల్పులు జ‌రిపార‌ని అనుకుంటే త‌ర్వాత పోలీసుల విచార‌ణ‌లో అప్పుల్లో కూరుకుపోయిన విక్ర‌మ్ గౌడ్ త‌న‌పై తానే ఈ హ‌త్యాయ‌త్నానికి ప్లాన్ చేసుకున్నాడ‌ని తేల్చిచెప్పారు.

ఈ కేసులో ప్రధాన నిందితుడు విక్రమ్ గౌడేనని పోలీసులు పక్కా ఆధారాలతో తేల్చి చెప్పేశారు. అప్పుల వాళ్ల నుంచి ఒత్తిళ్లు లేకుండా చూసుకోవ‌డంతో పాటు రాజ‌కీయ సింప‌తి కోస‌మే విక్ర‌మ్ ఇలా చేశాడ‌ని పోలీసులు తేల్చిచెప్పారు. ఇక గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల్లో కార్పొరేట‌ర్‌గా పోటీ చేసిన విక్ర‌మ్ ఘోరంగా ఓడిపోయారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాల‌నుకుంటోన్న ఆయ‌న చేతిలో డ‌బ్బులు లేక‌పోవ‌డంతో పాటు అప్పుల్లో కూరుకుపోవ‌డంతో సింప‌తి కోస‌మే ఇలా చేశాడ‌ని పోలీసులు తేల్చారు.

జైలుకు వెళ్లి బ‌య‌ట‌కు వ‌చ్చిన విక్ర‌మ్ మీడియా స‌మావేశంలో ట్విస్టుల మీద ట్విస్టులు ఇచ్చాడు. త‌న‌పై జ‌రిగిన హ‌త్యాయ‌త్నం కేసు విష‌యంలో న‌గ‌ర పోలీసులు క‌ట్టుక‌థ అల్లార‌ని, ఎవ‌రైనా త‌న మీద తానే హ‌త్యాయ‌త్నం చేయించుకునేందుకు కిరాయి మ‌నుష్యుల‌ను పెట్టుకుంటారా ? అని విక్ర‌మ్ ప్ర‌శ్నించాడు. త‌న‌కు ఇలాంటి సింప‌తి అవ‌స‌రం లేద‌న్న విక్ర‌మ్ మీడియా క‌థ‌నాలు కూడా ఖండించాడు.

ఇక మైనింగ్ చేస్తోన్న నందు అనే వ్య‌క్తి కి బెదిరింపులు వ‌చ్చిన నేప‌థ్యంలో అత‌డు పోలీసుల సాయం కోరాడని అయితే వారు ఆ సాయం చేయలేదని విక్రమ్ వివరించాడు. ఇక తాను 2024 ఎన్నిక‌ల్లో మాత్ర‌మే పోటీ చేస్తాన‌ని చెప్పారు. మ‌రి విక్ర‌మ్ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌కు పోలీసులు ఎలా రిప్లే ఇస్తారో ? చూడాలి.