మెగాస్టార్ పొలిటిక‌ల్ కామెడీ అదిరింది!

పొలిటిక‌ల్ ఫీల్డ్‌లో మెగాస్టార్ చిరంజీవి పాత్ర ఏమిటి? ఆయ‌న ఎక్క‌డ ఉన్నారు? ఏ రేంజ్‌లో రాజ‌కీయాలు చేస్తున్నారు? కేంద్ర మంత్రి ప‌ద‌విని అనుభ‌వించి ఎంజాయ్ చేశారు.. ఆ త‌ర్వాత ఏమ‌య్యారు? ఇలాంటి ప్ర‌శ్న‌ల‌కు జ‌వాబులు చెప్ప‌డం క‌ష్ట‌మే. కాంగ్రెస్ పార్టీకి చెందిన‌ చిరు పొలిటిక‌ల్‌గా దూర‌మై చాలా కాల‌మే అయింది. ఆయ‌న పాలిటిక్స్ ఉన్నారంటే కూడా న‌మ్మ‌డం కూడా క‌ష్టం. ప్ర‌స్తుతం రాజ్య‌స‌భ స‌భ్యుడిగానే ఉన్న‌ప్ప‌టికీ.. పొలిటిక‌ల్‌గా మాత్రం ఆయ‌న తెర‌వెనుకే న‌టిస్తున్నారు. తెర ముందు మాత్రం సినిమాలు చేసుకుంటున్నారు. ఇటీవ‌ల వ‌చ్చిన 150 వ మూవీ దీనికి ఉదాహ‌ర‌ణ. ఇక‌, ఇప్పుడు మ‌రో మూవీ కూడా చేస్తూ.. పాలిటిక్స్‌కి అంద‌నంత దూరం వెళ్లిపోయారు.

అందుకే ఇటీవ‌ల కాలంలో హోరెత్తిపోయిన నంద్యాల‌లో కూడా కాంగ్రెస్ నేత‌లు ఎవ్వ‌రూ చిరు పేరు కూడా త‌లుచుకోలేదు. మిగిలిన పార్టీలు అంటే టీడీపీ, వైసీపీలు సినీ గ్లామ‌ర్, సెంటిమెంట్ కోసం పాకులాడాయి. టీడీపీ బాల‌య్య‌ను నేరుగా రంగంలోకి దింపితే.. వైసీపీ తెర‌వెనుక ప్రిన్స్ మ‌హేష్ ఫ్యాన్స్‌ని, అక్కినేని నాగార్జున ఫ్యాన్స్‌ను మేనేజ్ చేసి.. త‌మ త‌మ పార్టీల‌కు ఓట్లు రాబ‌ట్టుకునే ప్ర‌య‌త్నాలు చేశాయి. ఇక‌, ఇదే స‌మ‌యంలో త‌మ అభ్య‌ర్థి అబ్దుల్ ఖాద‌ర్ లైన్‌లో ఉన్న‌ప్ప‌టికీ.. చిరు పేరును కూడా కాంగ్రెస్ మాట మాత్రం త‌లుచుకోలేదు. చిరు కూడా ఎక్క‌డా నంద్యాల ఉప పోరుపై చిన్న ప్ర‌క‌ట‌న కూడా చేయ‌లేదు. దీంతో చిరు దాదాపు రాజ‌కీయాల‌కు దూరం అయ్యాడ‌ని, మూవీల‌మీదే మోజు ప‌డ్డాడ‌ని అనుకున్నారు అంద‌రూ!

అయితే, అనూహ్యంగా ఇలాంటి అంచ‌నాల‌ను త‌ల‌కింద‌లు చేస్తూ.. చిరు పొలిటిక‌ల్‌గా అధికార టీడీపీపై విరుచుకుప‌డ్డారు. ముఖ్యంగా త‌న పార్టీకి తొలినాళ్ల‌లో ఓట్లు వేసి.. తాను అసెంబ్లీకి వెళ్లేలా దోహదం చేసిన తిరుప‌తి నియోజ‌క‌వ‌ర్గం స‌మ‌స్యల‌పై చిరు ఒక్క‌సారిగా ఫైర‌య్యారు. ప్ర‌భుత్వం ఇక్క‌డి ప్ర‌జ‌ల‌పై వివ‌క్ష చూపుతోంద‌న్నారు. నగరంలోని 18వ వార్డులో ఉన్న పారిశుద్ధ్య‌ కాలనీలో ఇళ్ల‌ను ఖాళీ చేయించడానికి ప్రభుత్వం పన్నాగం పన్నుతోందని విమర్శించారు. తాను ఎమ్మేల్యేగా ఉన్న సమయంలో కాలనీలో కొన్ని అభివృద్ధి పనులు చేశానని, 70 ఏళ్లుగా ఇక్క‌డ నివాసం ఏర్పాటు చేసుకున్న దాదాపు 160 కుటుంబాల వారిని అక్కడ నుంచి బలవంతంగా ఖాళీ చేయించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింద‌ని అన్నారు.

కార్మికులు నివ‌సిస్తున్న 2 ఎకరాల 34 సెంట్ల భూమిని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడానికి తిరుపతి కార్పొరేషన్ ప్రయత్నాలు చేయడం అమానవీయమ‌ని విమర్శించారు. తిరుపతి నగరం నడిబొడ్డున స్కావెంజర్స్ కాలనీ ఉండటం ఈ ప్రభుత్వం సహించలేక‌పోతుందా ? అని ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్ణయం వివక్ష తో కూడుకున్న‌ద‌ని, ప్రజలందరినీ సమానంగా చూడాలనే రాజ్యాంగం స్ఫూర్తికి విరుద్ధంగా చేయడం సరి కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, తిరుపతి కార్పొరేషన్ తమ ప్రయత్నాలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో మ‌ళ్లీ చిరు ఒక్క‌సారిగా పొలిటిక‌ల్ హీరో అయిపోతార‌ని అనుకున్నారు. కానీ, ఇలాంటి విజిటింగ్ పాలిటిక్స్‌కు జ‌నాలు ప‌డిపోర‌ని చిరు గ్ర‌హించాలి.. అంటున్నారు విశ్లేష‌కులు.