ఇష్ట‌మైతే.. అలా.. ఇష్టం లేక‌పోతే.. ఇలానా బాబూ! 

రాజ‌కీయాలైనా మ‌రేమైనా.. మ‌న‌కు ఇష్ట‌మైతే, ఎదుటి వాళ్లు మ‌న‌కు జై కొడితే.. వాళ్లు ఎంత నీచ్ క‌మీన్ అయినా సరే.. మ‌న‌కు దేవుళ్లుగానే క‌నిపిస్తారు. అంతేకాదు, వాళ్లు ఎంత పాపాలు చేసినా.. మ‌న క‌ళ్ల‌కు పుణ్యాలుగానే క‌నిపిస్తాయి. అదే కొంచెం రివ‌ర్స్ గేర్ ప‌డి.. జై కొట్టిన నోటితో అవ‌త‌లివాళ్లు… మ‌న‌మీద‌కి సై.. అన్న‌ప్పుడే అస‌లు రంగు బ‌య‌ట ప‌డుతుంది. ఇప్పుడు టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు ప‌రిస్థితి కూడా అలానే ఉంది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు త‌న పార్టీలో ఉండి, నంద్యాల టికెట్ విష‌యంలో మ‌న‌స్తాపంతో వైసీపీలో చేరిన శిల్పా మోహ‌న్‌రెడ్డిపై బాబు ఎక్కి దిగారు.

నిన్న నంద్యాల‌లో నిర్వ‌హించిన రోడ్ షో లో పాల్గొన్న బాబు.. వైసీపీని, ఆ పార్టీ అభ్య‌ర్థి శిల్పాను ఏకేశారు. ముఖ్యంగా శిల్పా అవినీతి ప‌రుడ‌ని విమ‌ర్శించారు. గ‌తంలో శిల్పా గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అర్హులకు ఇళ్లు కట్టి ఇవ్వకుండా అనర్హులకు ఇళ్లు కేటాయించి వారి వద్ద లంచాలు తీసుకున్నారని చంద్రబాబు ఆరోపించారు. పేదల భూములను శిల్పా కొట్టేశారని, మార్కెట్ కమిటీకి చెందాల్సిన స్థలంలో శిల్పా షాపులు కట్టించుకున్నారని నిప్పులు చెరిగారు. శిల్పా ప‌దేళ్లు వివిధ ప‌దవులు అనుభ‌వించినా.. నంద్యాల‌ను ప‌ట్టించుకోలేద‌ని, ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గానికి చేసింది ఏమీ లేద‌ని అన్నారు. అంతేకాదు, అస‌లు నంద్యాలకు, శిల్పాకు సంబంధం లేద‌ని అన్నారు.

ఈ స‌మ‌యంలోనే త‌మ అభ్య‌ర్థి భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డికి ఓట్లేయాల‌ని, అభివృద్ధికి తాను హామీ ఇస్తాన‌ని బాబు పేర్కొన్నారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. వైసీపీ మాత్రం బాబు ఆరోప‌ణ‌ల‌పై విరుచుకుప‌డుతోంది. చంద్ర‌బాబు నాలిక మ‌డ‌త మాట్లాడుతున్నార‌ని, గ‌తంలో శిల్పాకు 2014లో టికెట్ ఇచ్చిన‌ప్పుడు ఈ విష‌యాలు గుర్తు లేవా? అని ప్ర‌శ్నించారు. శిల్పా సంగ‌తి స‌రే.. 9 ఏళ్ల‌కు పైగా మీరు సీఎంగా ఉండి.. నంద్యాల‌కు ఏం చేశారో చెప్పండ‌ని వారు ప్ర‌శ్నిస్తున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి లోకల్, నాన్ లోకల్ సమస్యను తేవడం ఏంటని నిప్పులు చెరుగుతున్నారు.

గ‌డిచిన మూడేళ్ల నుంచి పార్టీలో ఉన్నా కన్పించని శిల్పాలో అవినీతి పార్టీ మారిన వెంటనే కన్పించిందా? అని కూడా వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. మూడేళ్ల నుంచి ముఖ్యమంత్రిగా అవినీతిపై సమరం అని చెబుతున్న బాబుకు ఇప్పటి వరకూ శిల్పా అవినీతి కన్పించలేదా అన్నది కూడా వైసీపీ వాదిస్తోంది. మొత్తం మీద చంద్రబాబు శిల్పాపై చేసిన వ్యక్తిగత ఆరోపణలు ఆయనకే ఇబ్బందిగా మారాయని చెప్పక తప్పదు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు వెనుకేసుకు వ‌చ్చిన శిల్పాను.. ఇప్పుడు పార్టీ మార‌గానే ఇలా విమ‌ర్శించ‌డంపై.. విమ‌ర్శ‌కులు సైతం ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. ఏదేమైనా.. బాబు పొలిటిక‌ల్ గేమ్ యూట‌ర్న్ తీసుకుంది.