రాం మాధ‌వ్ విష‌యంలో బీజేపీ యూట‌ర్న్‌!

బీజేపీ సీనియ‌ర్ నేత‌, ఆర్ ఎస్ ఎస్ భావ‌జాలాన్ని పూర్తిగా ఒంట‌బ‌ట్టించుకున్న తెలుగు వాడు రాం మాధ‌వ్ విష‌యంలో బీజేపీ అధిష్టానం ఇప్పుడు యూట‌ర్న్ తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. ఆయ‌న‌కు కేంద్రంలో మంత్రి ప‌ద‌వి ఖాయ‌మ‌ని భావించిన నేత‌లు ఇప్పుడు డీలా ప‌డ్డారు. విష‌యంలోకి వెళ్తే.. ఏపీలో బీజేపీకి అత్యంత కీల‌క నేత‌గా వ్య‌వ‌హ‌రించిన మంత్రి, సీనియ‌ర్ నేత ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు ఉప‌రాష్ట్ర‌ప‌తిగా వెళ్లిపోయారు. దీంతో ఏపీ నుంచి కేంద్రంలో చ‌క్రం తిప్పిన వెంక‌య్య పోస్టులోకి కొత్త వారిని తీసుకోవాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. ఈ క్ర‌మంలోనే రాం మాధ‌వ్ పేరు బాహాటంగా వినిపించింది.

ప్ర‌స్తుతం ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీని ఉత్సాహంగా న‌డిపిస్తున్న రాం మాధ‌వ్‌పై ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, బీజేపీ సార‌ధి అమిత్ షాల వ‌ద్ద మంచి మార్కులే ఉన్నాయి. దీంతో ఆయ‌నకు వెంక‌య్య ఖాళీ చేసిన కేంద్ర మంత్రి సీటును కేటాయిస్తార‌ని , త‌ద్వారా ఏపీ, తెలంగాణ‌ల్లో 2019లో బీజేపీ పాగా వేసేందుకు అవ‌కాశం ఏర్ప‌డుతుంద‌ని నేత‌లు భావించారు. ఆ మ‌ధ్య ఇలాంటి వార్త‌లే మీడియా పెద్ద ఎత్తున హ‌ల్ చ‌ల్ చేశాయి. దీంతో రాం మాధ‌వ్ కి మంత్రి ప‌ద‌వి ఖాయ‌మ‌ని భావించారు. అయితే, ఇప్పుడు బీజేపీ అధిష్టానం యూ ట‌ర్న్ తీసుకుంద‌ని తెలుస్తోంది. దీనికి అనేక కార‌ణాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ప్ర‌స్తుతం బీజేపీకి ఉన్న నేత‌ల్లో రాం మాధ‌వ్ కంటే సీనియ‌ర్లు చాలా మందే ఉన్నార‌ని ఇప్ప‌టి కిప్పుడు రాం మాధ‌వ్‌కి కేంద్ర మంత్రి ప‌ద‌విని అప్ప‌గించ‌డం భావ్యం కాద‌ని భావిస్తున్నార‌ట‌. ఈ క్ర‌మంలోనే ఆయ‌న‌కు బీజేపీ జాతీయ బాధ్య‌త‌లు అప్ప‌గించాల‌నే ప్ర‌తిపాద‌న తెర‌మీద‌కి వ‌చ్చిన‌ట్టు స‌మాచారం. రాం మాధ‌వ్ ఆర్ ఎస్ ఎస్‌లో కీల‌కంగానే ఉన్న‌ప్ప‌టికీ.. కేంద్ర మంత్రిగా ఆయ‌న‌ను తీసుకుంటే ఆయ‌న కంటే సీనియ‌ర్ నేత‌లు భ‌గ్గుమ‌నే ప‌రిస్థితి వ‌స్తుంద‌ని అనుకుంటున్న‌ట్టు స‌మాచారం.

అదేస‌మ‌యంలో పార్టీ జాతీయ బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డం ద్వారా పార్టీని యువ‌త చేతిలో పెట్టిన సంకేతాల‌ను పంప‌వ‌చ్చ‌నేది కూడా వ్యూహంగా క‌నిపిస్తోంది. అయితే, దీనిపైనా నిర్ణ‌యం తీసుకునేందుకు ఒకింత ఆల‌స్యం అయ్యే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.