ఒక్క మాటతో చంద్రులకు ఝలక్

నిన్న మొన్న‌టికి వ‌ర‌కు రాష్ట్రాల్లోని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌ను భారీ సంఖ్య‌లో పెంచుతార‌ని ఆశ‌లు పెట్టుకున్న ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ విష‌యంపై తాజాగా కేంద్రం నుంచి వ‌చ్చిన స‌మాధానంతో పూర్తిగా డీలా ప‌డిపోయారు. 2014 నాటికి రాష్ట్ర విభ‌జ‌న చ‌ట్టంలో షెడ్యూల్ 2 లో పేర్కొన్న విధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సీట్ల‌ను పెంచుకునేందుకు అనుమ‌తి ఉంది. అయితే, దీనికి కేంద్రం ఒక చ‌ట్టాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. దీంతో దీనిపై స్పందించిన కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం అప్ప‌ట్లో సీట్ల పెంపున‌కు ప‌చ్చ‌జెండా ఊపింది. ఫ‌లితంగా ఏపీలో ప్ర‌స్తుతం ఉన్న 175 సీట్లకు గాను 225 సీట్లు పెరుగుతాయి. ఇక‌, తెలంగాణ‌లో ప్ర‌స్తుతం ఉన్న 119 స్థానాలు 153కు పెరుగుతాయి.

అంటే ఏపీలో దాదాపు 50 సీట్లు, తెలంగాణ‌లో సుమారు 34 సీట్లు పెర‌గ‌నున్నాయి. ఈ విష‌యం తెలిసిన మ‌రుక్ష‌ణ‌మే ఏపీ, తెలంగాణల సీఎంలు ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌కి తెర‌దీశారు. అంటే, ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చేవారిని వెనుకా ముందూ ఆలోచించ‌కుండా పార్టీ కండువా క‌ప్పేశారు వ‌చ్చే సారి ఎన్నిక‌ల్లో ప్ర‌త్యుర్థులు అనేవారు లేకుండానే చేసుకునే క్ర‌మంలో విప‌క్ష నేత‌ల‌ను మూకుమ్మ‌డిగా చేర్చేసుకున్నారు. ఇక‌, 2019 ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో నియోజ‌క‌వ‌ర్గాల పెంపు విష‌యం ఇప్పుడు ఇద్ద‌రు చంద్రుల‌ను తీవ్రంగా క‌ల‌వ‌ర‌ప‌రుస్తోంది. ఇప్ప‌టికే సిట్టింగులు ఉండడం, ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చిన వారికి సీట్లు కేటాయించాల్సి రావ‌డం వంటి అంశాలు ప్ర‌ధానంగా వీరికి ఇబ్బందిగా మారాయి.

ఈ నేప‌థ్యంలో నిన్న రాష్ట్ర ప‌తిగా రామ్‌నాథ్ ప్ర‌మాణ స్వీకారానికి ఢిల్లీ వెళ్లిన ఇద్ద‌రు సీఎంలు సీట్ల పెంపుపై బీజేపీ అగ్ర‌నేత‌ల‌తో భేటీ అయ్యారు. విడివిడిగా జ‌రిగిన ఈ భేటీల్లో సీఎంలు ఇద్ద‌రూ సీట్ల పెంపు అవ‌స‌రాన్ని నొక్కి చెప్పారు. హోం మంత్రి రాజ్‌నాథ్‌తో విష‌యాన్ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. అయితే, ఆయ‌న మాత్రం త‌న‌దైన శైలిలో త‌ప్పించుకున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. అంతా ప్ర‌ధాని మోడీ కోర్టులోనే ఉంద‌ని, ఆయ‌న‌తోనే మాట్లాడాల‌ని, అదేవిధంగా రాజ‌కీయ చ‌ర్చ కూడా జ‌ర‌గాల‌ని అన్న‌ట్టు తెలిసింది. ఇటు పార్ల‌మెంటు, అటు రాజ‌కీయ చ‌ర్చ అంటే.. ఏకంగా ఇది పూర్త‌య్యే స‌రికి పుణ్య‌కాలం గ‌డిచిపోవ‌డం ఖాయ‌మ‌నే భావ‌న వ్య‌క్త‌మైంది.

అయితే, వాస్త‌వానికి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సీట్ల‌ను పెంచేందుకు బీజేపీ అధిష్టానం పెద్ద‌గా ఇష్ట‌ప‌డ‌డం లేద‌ని తెలిసింది. దీనికి ప్ర‌ధాన కార‌ణంగా రాజ‌కీయాల్లో త‌మ‌కు ఏం లాంభం అని ఆలోచించు కోవ‌డ‌మే. వాస్త‌వానికి ఏపీ, తెలంగాణ‌ల్లో బీజేపీ అంతంత మాత్రంగా ఉంది. ఇక‌, ఇప్పుడు సీట్లు పెంచితే ఉన్న ఆద‌ర‌ణ కూడా పోతుంద‌ని స్థానిక నేత‌లు లెక్క‌లు క‌ట్టార‌ట‌. అంటే, ఇప్పుడు న్న నియోజ‌క‌వ‌ర్గాల సంఖ్య‌ను భారీగా పెంచితే.. అధికార పార్టీలైన టీఆర్ ఎస్‌, టీడీపీలే వీటిలో అభ్య‌ర్థుల‌ను నిల‌బెట్టుకునే అవ‌కాశం ఉంటుంది త‌ప్ప‌.. బీజేపీకి ఉండ‌దు.

అంతేకాకుండా మంది ఎక్కువైతే మ‌జ్జిగ ప‌ల‌చ‌న అన్న‌ట్టు.. నియోజ‌క వ‌ర్గాలు పెరిగితే బీజేపీకి నేత‌లు క‌రువ‌వ‌డంతోపాటు.. అన్ని విధాలా న‌ష్ట‌మే. దీనిని గ‌మ‌నించిన తెలంగాణ నేత‌లు.. నియోజ‌క‌వ‌ర్గాల పెంపు వ‌ద్ద‌ని అధిష్టానం వ‌ద్ద స్ప‌ష్టం చేశార‌ట‌. దీంతో ఇప్ప‌ట్లో సీట్ల పెంపుపై మాట్లాడ‌కూడ‌ద‌ని బీజేపీ డిసైడ్ అయిన‌ట్టు స‌మాచారం. అయితే, ఈ విష‌యాన్ని నేరుగా చెప్ప‌లేని హొం మంత్రి రాజ్‌నాథ్‌.. విష‌యం ప్ర‌ధాని కోర్టులో ఉంద‌ని త‌ప్పించుకున్నార‌ని స‌మాచారం దీంతో ఇద్ద‌రు చంద్రులు తీవ్రంగా డీలా ప‌డ్డారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.