ఏపీ ప్ర‌భుత్వంలో నెంబ‌ర్ 2గా లోకేష్‌..!

చంద్ర‌బాబు ప్ర‌భుత్వంలో కాసింత లేటుగా అరంగేట్రం చేసిన‌ప్ప‌టికీ.. ఆయ‌న త‌న‌యుడు, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేష్ రేంజ్ మాత్రం ప్ర‌స్తుతం పీక్ స్టేజ్‌కి చేరిపోయింద‌ట‌! ప్ర‌స్తుతం ఆయ‌న ఐటీ, పంచాయ‌తీరాజ్ మంత్రిత్వ శాఖ‌ల‌ను చూస్తున్నారు. అయినా కూడా ప్ర‌జ‌లు అన్ని మంత్రిత్వ శాఖ‌ల‌కు సంబంధించిన స‌మ‌స్య‌ల‌ను లోకేష్‌కే విన్న‌విస్తున్నార‌ట‌. అంతేకాదు, స‌చివాల‌యానికి వెళ్తున్న ప్ర‌జ‌లు ప‌నున్నా లేక‌పోయినా.. లోకేష్‌ను చూడందే బ‌య‌ట‌కు రావ‌డం లేద‌ట‌. దీంతో ఇప్పుడు ప్ర‌భుత్వంలో లోకేష్ సెంట‌రాఫ్‌ది మేట‌ర్‌గా మారిపోయాడని అంటున్నారు విశ్లేష‌కులు.

వాస్త‌వానికి ప్ర‌భుత్వంలోకి రాక‌ముందు టీడీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఉన్న స‌మ‌యంలో లోకేష్‌.. ఎవ‌రినీ ప‌ట్టించుకునేవాడు కాద‌ని, ముఖ్యంగా పార్టీలో పెద్ద వాళ్ల‌కే ఆయ‌న ప్రాధాన్యం ఇచ్చేవార‌ని, ఏదైనా స‌మ‌స్య‌పై వెళ్లి ఆయ‌న‌తో క‌ల‌వాల‌ని భావిస్తే.. గంట‌ల త‌ర‌బ‌డి బ‌య‌టే నిరీక్షించాల్సి వ‌చ్చేద‌ని కిందిస్థాయి నేత‌లు, కార్య‌క‌ర్త‌లు వాపోయేవారు. ఇదే ప‌రిస్తితి ఆయ‌న మంత్రి అయ్యాక కూడా కంటిన్యూ అవుతుంద‌ని అనుకున్నారు. అయితే, అనూహ్యంగా లోకేష్‌లో మార్పు క‌నిపిస్తోంది. ఆయ‌న ఐటీ, పంచాయ‌తీ రాజ్ శాఖ‌ల‌ను చేప‌ట్టాక‌.. సాధ్య‌మైనంత త్వ‌ర‌లోనే ఈ శాఖ‌ల్లో పెండింగ్‌లో ఉన్న ఫైళ్ల‌ను యుద్ధ‌ప్రాతిప‌దిక‌న ప‌రిష్క‌రించేశారు.

అంతేకాదు, త‌న కోసం స‌చివాల‌యం వ‌ద్ద‌కు వ‌చ్చే వారితో కూర్చోబెట్టి మ‌రీ మాట్లాడి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తున్నారు. దీంతో ఇప్పుడు లోకేష్ చుట్టూ అంద‌రూ మూగుతున్నారు. ఏ స‌మ‌స్య అయినా స‌త్వ‌ర‌మే ప‌రిష్క‌రించే మినిస్ట‌ర్‌గా లోకేష్ అతి త్వ‌ర‌లోనే పేరు తెచ్చుకోవ‌డం అటు మంత్రి వ‌ర్గంలోనూ చ‌ర్చ‌నీయాంశంగా మారింది. దీంతో ప్ర‌జ‌లు ఏ స‌మ‌స్య వ‌చ్చినా లోకేష్ చాంబ‌ర్‌కే క్యూక‌డుతున్నార‌ట‌. లోకేష్ ద‌గ్గ‌రకు పెద్ద ఎత్తున విన‌తి ప‌త్రాలు వ‌స్తుండ‌టం! ఇప్ప‌టివ‌ర‌కూ లోకేష్ ద‌గ్గ‌ర‌కు దాదాపు 5 వేల విన‌త‌లు వ‌చ్చాయ‌నీ, వీటిలో లోకేష్ శాఖ అయిన ఐటీ, పంచాయ‌తీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ‌ల‌కు సంబంధించిన‌వి 1,242 మాత్ర‌మే అని తెలుస్తోంది. అంటే, మిగ‌తావ‌న్నీ ఇత‌ర శాఖ‌ల‌కు సంబంధించిన ఫిర్యాదులు కావ‌డం గ‌మ‌నార్హం. దీంతో ఆయ‌న వాటి ప‌రిష్కారం కోసం.. ఆయా శాఖ‌ల‌కు పంపుతున్నార‌ట‌.

కేటీఆర్ తో పోటీనా.. తండ్రితో పోటీనా..

ప్ర‌స్తుతం.. మంత్రిగా లోకేష్ వ్య‌వ‌హార శైలిని గ‌మ‌నిస్తున్న ప్ర‌తి ఒక్క‌రికీ లోకేష్.. తెలంగాణ‌లో సీఎం కుమారుడు కేటీఆర్‌కి పోటీనా లేక త‌న తండ్రి, ప‌నిరాక్షసుడు సీఎం చంద్ర‌బాబుకు పోటీనా అని చ‌ర్చించుకుంటున్నారు. నిజానికి అక్క‌డ కేటీఆర్ కూడా లోకేష్ మాదిరిగానే ఐటీ, పంచాయ‌తీరాజ్ శాఖ‌ల‌ను చూస్తున్నారు. ఆయ‌న కూడా స‌మ‌స్య‌ల‌పై స‌త్వ‌ర‌మే స్పందిస్తున్నారు. ప్ర‌జ‌ల‌కు అతి చేరువ‌లో ఉంటున్నారు. వ‌ర్షం వ‌స్తే.. నేరుగా ఆయా ప్రాంతాల‌కు వెళ్లి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను వింటున్నారు.

ఇప్పుడు ఇదే ఫార్ములాను లోకేష్ అనుస‌రిస్తున్నాడా? అనే సందేహం వ్య‌క్తమ‌వుతోంది. కేటీఆర్ ను మించిన మంత్రిగా పేరు తెచ్చుకోవాల‌ని లోకేష్ భావిస్తున్న‌ట్టు అనిపిస్తోంది. ఇక‌, అదేస‌మ‌యంలో రోజుకు 20 గంట‌లు ప‌నిలోనే ఉండే చంద్ర‌బాబుతో పోటీ ప‌డేందుకు లోకేష్ ప్ర‌య‌త్నిస్తున్నాడ‌ని అంటున్నారు. ఏదేమైనా చిన‌బాబు వైఖ‌రి మార‌డంపై స‌ర్వ‌త్రా హ‌ర్షం వ్య‌క్త‌మ‌వుతోంది.