పార్టీలు రెడీ… నంద్యాల నోటిఫికేష‌న్ ఎప్పుడంటే..!

ఏపీలో క‌ర్నూలు జిల్లా నంద్యాల సీటుకు జ‌రుగుతోన్న ఉప ఎన్నికకు నోటిఫికేష‌న్ రాకుండానే ఇక్క‌డ టీడీపీ వ‌ర్సెస్ వైసీపీ మ‌ధ్య వార్ అదిరిపోతోంది. అప్పుడే ఎన్నిక హీటు రాజుకుంది. ఇప్ప‌టికే రెండు పార్టీలు త‌మ అభ్య‌ర్థుల‌ను కూడా ప్ర‌క‌టించేశాయి. టీడీపీ అభ్య‌ర్థిగా భూమా అన్న కొడుకు భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి పేరు ఖ‌రారు కాగా వైసీపీ అభ్య‌ర్థిగా టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ చేసిన మాజీ మంత్రి శిల్పా మోహ‌న్‌రెడ్డికి జ‌గ‌న్ సీటు ఇచ్చారు.

చంద్ర‌బాబు అయితే ఇప్ప‌టికే అక్క‌డ ఉప ఎన్నిక కోసం ఆరుగురు మంత్రుల‌కు బాధ్య‌త‌లు అప్పగించారు. ఇక ఇక్క‌డ అన్ని శాఖ‌ల నుంచి కోట్ల‌లో నిధులు రిలీజ్ చేయిస్తున్నారు. టీడీపీ త‌ర‌పున బ్ర‌హ్మానంద‌రెడ్డితో పాటు మంత్రి అఖిల‌ప్రియ ఇప్ప‌టికే ప్ర‌చారం స్టార్ట్ చేసేశారు. మ‌రోవైపు వైసీపీ అభ్య‌ర్థిగా శిల్పా మోహ‌న్‌రెడ్డి కూడా ప్ర‌చారంలో దూసుకుపోతున్నారు.

ఇక ఉప ఎన్నిక‌లో పోటీ చేసేందుకు ప్ర‌ధాన పార్టీల‌తో మిగిలిన పార్టీలు సైతం ఉత్సాహంగానే ఉన్నాయి. ఏపీలో దీనావ‌స్థ‌లో ఉన్న కాంగ్రెస్ పార్టీతో పాటు బైరెడ్డి రాజ‌శేఖ‌ర్‌రెడ్డి పార్టీ, క‌మ్యూనిస్టులు కూడా రెడీగానే ఉన్నారు. ఇక ఉప ఎన్నిక‌కోసం పార్టీల‌న్నీ రెడి అయిపోయాయి. ఇక ఇప్పుడు ఎన్నిక‌ల క‌మిష‌న్‌దే లేటు అన్న‌ట్టుగా ఉంది. ఇక భూమా మృతి చెంది ఇప్ప‌టికే నాలుగు నెల‌లు దాటిపోయాయి. ఆరు నెలల్లోగా నోటిఫికేష‌న్ జారీ చేయాల్సి ఉంది.

ఈ నేపథ్యంలో నంద్యాల ఉప ఎన్నిక నోటిఫికేషన్ ఏ నిమిషమైనా వచ్చే అవకాశం ఉంది. ఇక కేంద్రంలో ఏపీ రాజకీయ వ‌ర్గాలు ఆరా తీస్తే ఈ నెల 20 తేదీక‌ల్లా నోటిఫికేష‌న్ విడుద‌ల‌వుతుదంద‌ని మ్యాట‌ర్ లీక్ అయిన‌ట్టు తెలుస్తోంది. ఇక వైసీపీ ఎంపీలు సైతం ఇదే అభిప్రాయం త‌మ పార్టీ నాయ‌కుల‌తో చెపుతున్న‌ట్టు తెలుస్తోంది. ఏదేమైనా నంద్యాల సంగ్రామానికి రంగం సిద్ధ‌మైంది. టోట‌ల్ ఏపీ రాజ‌కీయం అంతా ఇప్పుడు నంద్యాల చుట్టూనే తిర‌గ‌నుంది.