వైసీపీలోకి మాజీ సీఎం ఫ్యామిలీ… ఎంపీ-ఎమ్మెల్యే సీటు ఆఫ‌ర్‌

ఏపీలో విప‌క్ష వైసీపీకి ఇప్పుడిప్పుడే మంచి జోష్ వ‌స్తోంది. అమ‌రావ‌తిలో జ‌రిగిన ప్లీన‌రీ త‌ర్వాత ఆ పార్టీ అధినేత జ‌గ‌న్ ప్ర‌క‌టించిన ప‌లు ప‌థ‌కాలు కాస్త ఆక‌ర్ష‌ణీయంగా ఉండ‌డంతో ఇప్పుడు ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో వాటి గురించే చ‌ర్చ జ‌రుగుతోంది. ఇదిలా ఉంటే వైసీపీలో మ‌రో ప్ర‌ముఖ రాజ‌కీయ కుటుంబం ఎంట్రీ ఇవ్వ‌నుంద‌ని తెలుస్తోంది. క‌ర్నూలు జిల్లా రాజ‌కీయాల్లో సుదీర్ఘ‌కాలంగా ఎంతో ప‌ట్టున్న మాజీ సీఎం కోట్ల విజ‌య‌భాస్క‌ర్‌రెడ్డి ఫ్యామిలీ వైసీపీలోకి వెళ్లేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ట‌.

కోట్ల ఫ్యామిలీకి క‌ర్నూలు జిల్లాలో బ‌ల‌మైన అనుచ‌ర‌గ‌ణం ఉంది. ఇక వీరు పార్టీలో చేరితే వైసీపీకి క‌ర్నూలు జిల్లాలోనే కాకుండా వీరికి బంధుత్వాలు ఉన్న సీమ‌లోని ఇత‌ర జిల్లాల్లో కూడా ఆ ఎఫెక్ట్ ప‌డ‌నుంది. ఇది వైసీపీకి చాలా అడ్వాంటేజ్‌. ఇక కోట్ల విజ‌య‌భాస్క‌ర్‌రెడ్డి త‌న‌యుడు, మాజీ కేంద్ర మంత్రి అయిన కోట్ల సూర్యప్రకాశరెడ్డి, ఆయ‌న భార్య మాజీ ఎమ్మెల్యే సుజాత‌మ్మ‌, వీళ్ల త‌న‌యుడు రాఘ‌వేంద్ర‌రెడ్డిలు కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పేసి వైసీపీలో చేరాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది.

రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత కాంగ్రెస్ అధోఃగ‌తిలో ఉంది. ఇక గ‌త ఎన్నిక‌ల్లో కూడా కాంగ్రెస్ నుంచి ఆలూరులో పోటీ చేసిన ఆమెకు ఏకంగా 22 వేల ఓట్లు వ‌చ్చాయి. దీనిని బ‌ట్టి ఇక్క‌డ కోట్ల ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ ఏంటో తెలుస్తోంది. ఇక త‌మ‌తో పాటు త‌మ కుమారుడు రాజ‌కీయ భ‌విష్య‌త్తు కోసం వీరు కాంగ్రెస్ వీడాల‌న్న నిర్ణ‌యానికి దాదాపు వ‌చ్చేసిన‌ట్టు తెలుస్తోంది.

ఇక జ‌గ‌న్ సైతం కోట్ల ఫ్యామిలీ వైసీపీలో చేరితే వాళ్ల‌కు మంచి ప్ర‌యారిటీ ఇచ్చేందుకు సిద్ధంగానే ఉన్నారు. కోట్ల కుటుంబానికి డోన్ – ఆలూరు – పత్తికొండ నియోజకవర్గాల్లో మంచి పట్టుంది. ఇక వీరికి క‌ర్నూలు ఎంపీ సీటుతో పాటు వారు కోరుకున్న ఎమ్మెల్యే సీటు ఇచ్చేందుకు జ‌గ‌న్ ఓకే చెప్పార‌ట‌.