మైల‌వ‌రంలో ఉమాకు యాంటీ…నియోజ‌క‌వ‌ర్గం మార్పుపై మాస్టర్ ప్లాన్‌

ఏపీ ఇరిగేష‌న్ మినిస్ట‌ర్ దేవినేని ఉమా పేరు రాష్ట్ర‌వ్యాప్తంగా మార్మోగుతున్నా ఆయ‌న ప్రాథినిత్యం వ‌హిస్తోన్న మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో మాత్రం మ‌స‌క‌బారుతున్న‌ట్టే క‌న‌ప‌డుతోంది. ఉమా అంటే ఏపీ స్టేట్ వైజ్‌గాను, కృష్ణా జిల్లాలోను ఓ పొలిటిక‌ల్ ఐకాన్ అన్న టాక్ ఉంది. అయితే ఈ క్రేజ్ ఎలా ఉన్నా ఉమా ఇప్పుడు మైల‌వ‌రంలో తీవ్ర వ్య‌తిరేక‌త ఎదుర్కొంటున్నారు. 1999, 2004లో నందిగామ నుంచి గెలిచిన ఉమా 2009, 2014లో మైల‌వ‌రం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. గ‌త ఎన్నిక‌ల్లో గెలిచి మంత్రి అయ్యాక నియోజ‌క‌వ‌ర్గంపై కాన్‌సంట్రేష‌న్ త‌గ్గించిన ఉమా ఎక్కువుగా స్టేట్ వైజ్‌గానే పాపుల‌ర్ అవుతున్నారు.

ఇక స్థానికేత‌రుడు కావ‌డం, నియోజ‌క‌వ‌ర్గంలో సొంత పార్టీ నాయ‌కుల్లో ఉన్న అసంతృప్తి, కుల స‌మీక‌ర‌ణాలు ఇలా చాలా లెక్క‌లు ఇప్పుడు ఉమాపై వ్య‌తిరేక‌త పెరిగేందుకు కార‌ణంగా క‌నిపిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ఉమా మైల‌వ‌రంలో ప‌రిస్థితుల‌ను అదుపులోకి తెచ్చుకునే ప్ర‌య‌త్నాలు కూడా పెద్ద‌గా చేస్తున్న‌ట్టు క‌న‌ప‌డ‌డం లేదు. ఇక ఉమా నియోజ‌క‌వ‌ర్గం మార‌తారంటూ కూడా కొద్ది రోజులుగా ఒక్కటే వార్త‌లు వ‌స్తున్నాయి.

నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జన జ‌రిగి నందిగామ జ‌న‌ర‌ల్ అయితే అక్క‌డ‌కు జంప్ చేయ‌డం లేదా ఇబ్ర‌హీంప‌ట్నం, విజ‌య‌వాడ రూర‌ల్ కేంద్రాలుగా కొత్త నియోజ‌క‌వ‌ర్గాలు వస్తే అక్క‌డ‌కు జంప్ అవ్వాల‌ని ఉమా ప్లాన్ వేసిన‌ట్టు తెలుస్తోంది. నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న జ‌ర‌గ‌ని ప‌క్షంలో ఉమా పెన‌మ‌లూరు నుంచి పోటీ చేయాల‌ని అనుకున్నా ఆ సీటుపై మంత్రి లోకేశ్ క‌న్ను ప‌డ‌డంతో ఉమా ఇప్పుడు మ‌రో ఆప్ష‌న్ వెతుక్కోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది.

ఈ క్ర‌మంలోనే నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జర జ‌ర‌గ‌క‌పోతే ఉమా క‌న్ను మైల‌వ‌రం ప‌క్క‌నే ఉన్న నూజివీడుపై ప‌డిన‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఉమా చింత‌ల‌పూడి ఎత్తిపోత‌ల ప‌థ‌కాన్ని త్వ‌ర‌గా పూర్తి చేసేందుకు కంక‌ణం క‌ట్టుకున్నారు. గోదావ‌రి నీటిని ఎత్తిపొత‌ల ద్వారా ప‌శ్చిమగోదావ‌రి జిల్లాలోని వెల‌గ‌ల‌ప‌ల్లి అడ్డ‌రోడ్డు నుంచి త‌మ్మిలేరు రిజ‌ర్వాయ‌ర్ మీదుగా కృష్ణా జిల్లాలోని వేంపాడు మేజ‌ర్‌కు త‌ర‌లించనున్నారు.

అక్క‌డ నుంచి ఆ జ‌లాల‌ను మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గానికి తీసుకెళ్లే ఈ ప్రాజెక్టు ప‌నులు శర‌వేగంగా పూర్తి చేసేందుకు ఉమా శ్ర‌మిస్తున్నారు. చింత‌ల‌పూడి జ‌లాలు మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గానికి తీసుకువెళ్లి అక్క‌డ ప‌రిస్థితిని అన్ని ర‌కాలుగా కంట్రోల్‌లోకి తెచ్చుకునేందుకు ఉమా ప్ర‌య‌త్నిస్తున్నారు. అయినా ప‌రిస్థితిలో మార్పు రాక‌పోతే ఉమా 2019లో నూజివీడు నుంచి బ‌రిలో దిగేందుకు రెడీ అవుతోన్న‌ట్టు విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది.

ప్ర‌స్తుతం నూజివీడు టీడీపీ ఇన్‌చార్జ్‌గా ముద్ద‌ర‌బోయిన వెంక‌టేశ్వ‌ర‌రావు ఉన్నారు. ఒక‌వేళ ఉమా వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి పోటీ చేయాల్సిన ప‌రిస్థితులు వ‌స్తే ఆయ‌న‌కు మ‌రో ప‌ద‌వి ఇచ్చేలా హామీ సైతం ఇవ్వ‌డ‌మే కాక ఇప్పించుకోగ‌ల స‌త్తా ఉమాకు ఉంది. మ‌రి ఉమా ఈ రెండేళ్ల‌లో మైల‌వ‌రంలో ప‌ర‌స్థితి కంట్రోల్‌లోకి తెచ్చుకుంటాడా ? లేదా నియోజ‌క‌వ‌ర్గం మార‌తాడా ? అన్న‌ది వెయిట్ అండ్ సీ..!