టీటీడీపీ నేత‌ల‌తో ఏపీలో పార్టీకి న‌ష్టం

రెండు రాష్ట్రాల్లోనూ అధికార పార్టీ నాయ‌కులు ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌కు తెర‌తీయ‌డంతో.. జోరుగా ఎమ్మెల్యేలు అటు సైకిల్‌, ఇటు కారు ఎక్కేశారు. ముఖ్యంగా తెలంగాణ‌లో ఆప‌రేష‌ణ్ ఆక‌ర్ష్ దెబ్బ‌కు పూర్తిగా టీడీపీ ఖాళీ అయిపోయింది. దీనిపై టీటీడీపీ నేత‌లు టీఆర్ఎస్‌పై పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇక ఏపీలో ప‌రిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. తెలంగాణ‌లో ఫిరాయింపుల‌పై పోరాటం చేస్తుంటే… ఏపీలో మాత్రం ఫిరాయింపుల‌ను ప్రోత్స‌హించి ప్ర‌తిప‌క్ష వైసీపీ ఎమ్మెల్యేల‌ను సైకిల్ ఎక్కించేసుకున్నారు. దీనిపై ఎక్కువ విమ‌ర్శ‌లు వినిపిస్తున్న‌తరుణంలో.. టీటీడీపీ చేస్తున్న పోరాటానికి.. ఫుల్‌స్టాప్ పెట్టాల‌ని పార్టీ అధినేత చంద్ర‌బాబు నేత‌ల‌కు ఆదేశించారట‌.

విభజ‌న త‌ర్వాత తెలంగాణ‌లో ఎక్కువ‌గా న‌ష్ట‌పోయింది టీడీపీ. ఎమ్మెల్యేలుగా గెలిచిన వారంతా టీఆర్ఎస్‌లో చేరిపోయారు. మిగిలిన వారంతా పార్టీ ఉనికి కోసం పోరాడుతున్నారు. ఈ అంశాన్నే ఎంచుకుని అదును దొరికిన సంద‌ర్భాల్లో పోరాడుతూ వ‌స్తున్నారు నాయ‌కులు. ఇన్నాళ్లూ ఇదే ఫిరాయింపుల అంశంపై టి. టీడీపీ నేత‌లంతా బ‌లంగా పోరాటం చేస్తుండేవారు. న్యాయ పోరాటం చేస్తామ‌నీ ప్ర‌జాక్షేత్రంలో ఎండ‌గ‌డ‌తామ‌నీ నేత‌లు ఎప్ప‌టిక‌ప్పుడు కేసీఆర్ స‌ర్కారుపై విమ‌ర్శ‌లు గుప్పిస్తూ వ‌చ్చారు. ఇక‌పై ఈ ఫిరాయింపుల టాపిక్ ను వ‌దిలేయాలంటూ టీ నేత‌ల‌కు పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు సూచించిన‌ట్టు ఓ క‌థ‌నం ప్ర‌చారంలోకి వ‌చ్చింది.

తెలంగాణ టీడీపీ నేత‌లతో ఈ అంశాన్ని స్ప‌ష్టం చెప్పార‌ట‌! తెరాస‌లో చేరిన ఎమ్మెల్యేల‌ విష‌య‌మై ప‌దేప‌దే విమ‌ర్శ‌లు చేస్తుండ‌టం వ‌ల్ల పెద్ద‌గా ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌ని, ఫిరాయింపు అంశాన్ని ఇక వ‌దిలేస్తే బెట‌ర్ అంటూ గట్టిగానే చెప్పార‌ట‌. తెరాస‌లో చేరిన టీడీపీ ఎమ్మెల్యేల గురించి కోర్టులో బ‌లంగా వాద‌న వినిపించ‌డం వ‌ల్ల‌.. ఆంధ్రాలో కాస్త ఇబ్బందిక‌రంగా మారుతుందనీ, కాబ‌ట్టి ఈ విష‌యాన్ని వీలైనంత లైట్ గా తీసుకుంటే బెట‌ర్ అనే అభిప్రాయాన్ని చంద్ర‌బాబు వ్య‌క్తం చేసిన‌ట్టు చెబుతున్నారు. ఈ సూచ‌న ప్ర‌కార‌మే టీడీపీ నేత‌లు విమ‌ర్శ‌లు త‌గ్గించుకున్నార‌నీ, ఫిరాయింపుల‌ అంశ‌మై కేసీఆర్ స‌ర్కారు విధానాన్ని త‌ప్పుబ‌ట్ట‌డం మానుకునే దిశ‌లో ఉన్నార‌ట‌.

దీని గురించి పార్టీ అధ్య‌క్షుడు ఎల్‌. ర‌మ‌ణ మాట్లాడుతూ.. ఫిరాయింపుల విష‌యాన్ని అస్స‌లు వ‌దిలిపెట్టేదే లేద‌ని, పోరాటం చేస్తామ‌ని అన్నారు. ఇప్పుడు మియాపూర్ భూ కుంభ‌కోణానికి సంబంధించిన పోరాటానికి అధిక‌ ప్రాధాన్య‌త ఇస్తున్నామ‌ని, అందుకే ఆ టాపిక్ గురించి ఎవ్వ‌రూ మాట్లాడ‌టం లేద‌న్న‌ట్టుగా చెప్పుకొచ్చే ప్ర‌య‌త్నం చేశారు. జంప్ జిలానీల‌పై పోరాటాన్ని తెలంగాణ‌లో ఎంత పెంచితే.. ఆంధ్రాలో టీడీపీకి అంతే ఇబ్బంది అన‌డంలో ఏమాత్రం సందేహం లేదు! మ‌రి చంద్ర‌బాబు వ్యూహాత్మ‌కంగా ఫిరాయింపుల అంశాన్ని ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌కుండా చెక్ చెప్పారు.