బాబు కొత్త మంత్రులు … ఎవ‌రి ర్యాంకు ఎంత‌…!

ఎప్ప‌టిక‌ప్పుడు స‌ర్వేలు చేయడం, ఆ ఫ‌లితాల‌తో ఎప్ప‌టిక‌ప్పుడు అధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను అప్ర‌మ‌త్తం చేస్తూ ఉంటారు ఏపీ సీఎం చంద్రబాబు! మ‌రి 2019కి ఎల‌క్ష‌న్ టీమ్‌గా ప్ర‌క‌టించిన మంత్రివ‌ర్గం ప‌నితీరుపై ఇప్పుడు ఆయ‌న స‌ర్వే నిర్వహించారు. పాత‌, కొత్త‌ మంత్రుల క‌ల‌యిక‌తో చేప‌ట్టిన కేబినెట్‌కు.. 100 రోజులు పూర్త‌యిన సంద‌ర్భంగా సీఎం చంద్ర‌బాబు.. వారి ప్ర‌తిభ‌, ప‌నితీరు ఆధారంగా ర్యాంకులు కూడా ప్ర‌క‌టించారు. ఇందులో నెల్లూరు జిల్లాకు చెందిన సోమిరెడ్డి తొలి స్థానంలో నిలిచారు. ఇక సీఎం త‌న‌యుడు లోకేష్‌.. ద్వితీయ స్థానంలో ఉన్నార‌ట‌. ఇక కొత్తగా మంత్రి వ‌ర్గంలోకి వ‌చ్చిన మంత్రుల్లో కొంత‌మంది దూసుకుపోతుంటే.. మ‌రికొంద‌రు వెనుక‌బ‌డే ఉన్నారట‌.

ఎన్నో సుదీర్ఘ‌ స‌మీక్ష‌లు, మ‌రెన్నో మంత‌నాలు! అనంత‌రం కేబినెట్‌లో చోటుద‌క్కక పార్టీలో అసంతృప్తి, నిర‌స‌న జ్వాలలు!! ఇలా కేబినెట్ విస్త‌ర‌ణ స‌మ‌యంలో పార్టీ అధినేత‌ చంద్ర‌బాబుకు వ‌చ్చిన త‌ల‌నొప్పి అంతాఇంతా కాదు! మ‌రి ఇన్ని ఆటుపోట్లు త‌ర్వాత ఏర్పాటైన మంత్రివర్గంపై కొత్త చర్చ మొదలైంది. వీరిలో రాజకీయంగా, శాఖాపరంగా వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి అగ్రస్థానంలో ఉన్నార‌ట‌. రాజకీయంగా జగన్పై ఎదురుదాడి చేయడం శాఖాపరంగా వ్యవసాయంపై నిరంతర సమీక్షలు – నకిలీ పురుగుమందులు – విత్తనాల కంపెనీల సీజ్ తోపాటు – నష్టపోయిన రైతులకు కంపెనీ ద్వారా నష్టపరిహారం ఇప్పించారు.

మిర్చికి మద్దతుధర క్వింటాలుకు రూ.1500ఇప్పించడంలో కీలకపాత్ర పోషించారు. ఇక ప్ర‌భుత్వంపై ఎవ‌రు విమ‌ర్శలు చేసినా.. వారికి కౌంట‌ర్ ఇవ్వ‌డంలో ముందున్నారు. ఇక చంద్ర‌బాబు త‌న‌యుడు లోకేష్‌.. తొలినాళ్ల‌లో త‌డ‌బ‌డినా కుదుట‌ప‌డ్డార‌ట‌. కంగారుప‌డి మాట జారిన సంద‌ర్భాల్లో ఆయ‌న‌ తీవ్రంగా విమ‌ర్శ‌ల పాల‌య్యారు. కానీ వాట‌న్నింటినీ త‌ట్టుకుని ఐటీ ప‌రిశ్ర‌మ‌ల‌ను ఏపీకి తీసుకొచ్చారు. 30 కంపెనీలు తీసుకొచ్చారు. 2వేల ఉద్యోగాలు ఇప్పించారు. మూడు శాఖల్లో 130కిపైగా సమీక్షలు నిర్వహించారు. ఆయన ఎక్కడా మీడియా సమావేశాలు నిర్వహించలేకపోయినా త‌న ప‌ని తాను చేసుకుంటూ.. ప్ర‌జ‌ల్లో, పార్టీలో పట్టు పెంచుకుంటున్నారు.

ఇక విద్యుత్ శాఖ మంత్రి కళా వెంకట్రావు ద్విముఖ పాత్ర విజయవంతంగా నిర్వర్తిస్తున్నారు. ఎమ్మెల్సీ టికెట్లు నంద్యాల వివాదం జిల్లా పార్టీ వ్యవహారాలతోపాటు విద్యుత్ శాఖ సమీక్షల్లో బిజీగా గడిపారు. సమాచారశాఖ మంత్రి కాలువ శ్రీనివాసులు వైసీపీపై ఎదురుదాడితోపాటు శాఖాపరమైన వ్యవహారాల్లో నాయకత్వాన్ని మెప్పించారు. కార్మిక మంత్రి పితాని సత్యనారాయణ సుదీర్ఘకాలం పెండింగులో ఉన్న గుంటూరు బజరంగ్ జూట్ మిల్ కార్మిక సమస్యల ఫైల్ ను దుమ్ముదులిపి వారిని చర్చలకు పిలిపించి తన అనుభవాన్ని చాటుకున్నారు. ఇక కొత్తగా మంత్రి అయిన భూమా అఖిలప్రియ పనితీరు అంతంతమాత్రంగానే ఉంద‌ట‌.

నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో త‌మ వ‌ర్గం వారికే సీటు ద‌క్కేలా ఒత్తిడి తేవ‌డం కొంత వివాదాస్ప‌ద‌మైంది. ఇక స్వల్ప కాలంలోనే రాజకీయాల్లో వివాదాస్పద నేతగా ముద్రపడ్డారు. ఎక్సైజ్ మంత్రి జవహర్ బీరుపై చేసిన వ్యాఖ్యలు, వైన్ షాపులు, బార్ల తరలింపుపై ఆయ‌న‌ తీసుకున్న నిర్ణయం ప్ర‌జ‌ల్లో కొంత వ్య‌తిరేక‌త‌కు కార‌ణ‌మైంది. మరో మంత్రి నక్కా ఆనంద్ బాబు ఏజెన్సీ ప్రాంతాల్లో వర్షాకాలం సమస్యలు గుర్తించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో విఫలమయ్యారట‌. ఇక ఫిరాయింపు కోటాలో మంత్రి ప‌ద‌వి ద‌క్కించుకున్న కడప జిల్లాకు చెందిన మంత్రి ఆదినారాయణరెడ్డి పని తీరు అంతంత మాత్రంగానే ఉందనే చర్చ సాగుతోంది.