రాజ్య‌స‌భ‌లో వెంక‌య్య సీటు ఎవ‌రికి ద‌క్కేనో?

ఏపీకి చెందిన బీజేపీ సీనియ‌ర్ నేత‌, కేంద్ర మంత్రి వెంక‌య్య నాయుడు ప్ర‌స్తుతం ఉప‌రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా బ‌రిలో నిలిచారు. ఈయ‌న గెలుపు న‌ల్లేరుపై న‌డ‌కేన‌నేది తెలిసిందే. దీంతో ఆయ‌న ఇప్ప‌టికే రాజ్య‌స‌భ స‌భ్య‌త్వానికి రాజీనామా చేశారు. రాజ‌స్థాన్ నుంచి ఆయ‌న రాజ్య‌స‌భ‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఇప్పుడు ఖాళీ అయిన వెంక‌య్య‌నాయుడు రాజ్య‌స‌భ సీటు కోసం అప్పుడే లొల్లి మొద‌లైంది. ఈ సీటును నాకు కేటాయించండి అంటే .. నాకు కేటాయించండి .. అంటూ నేత‌లు ఎవ‌రికి వారే బీజేపీ అధిష్టానం వ‌ద్ద ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసేశారు. దీంతో ఇప్పుడు ఢిల్లీలో ఈ సీటు కోసం లాబీయింగ్ చేస్తున్న వారి సంఖ్య పెరిగిపోయింద‌ట‌.

వాస్త‌వానికి వెంక‌య్య‌కు రాజ‌స్థాన్ నుంచి రాజ్య‌స‌భ సీటును కేటాయించారు. కాబ‌ట్టి ఏపీ వాళ్ల‌కి ఇస్తారా? లేదా? అనేది ఓ సందేహం. అయితే, ఏపీ వాడైన వెంక‌య్య రాజీనామా చేశారు కాబ‌ట్టి.. ఖ‌చ్చితంగా ఏపీవాళ్ల‌కే కేటాయించాల‌ని అంటున్నారు తెలుగు రాష్ట్రాల‌కు చెందిన బీజేపీ సీనియ‌ర్లు. ఇక‌, వీరిలో ఆర్ ఎస్ ఎస్ భావ‌జాలం ఉన్న వారూ ఉన్నారు కాబ‌ట్టి అధిష్టానం ఎటువైపు మొగ్గుతుంద‌నేది ఆస‌క్తిగా మారింది. ఇక‌, ఈ సీటు కోసం రంగంలో ఉన్న వారి విష‌యానికి వ‌స్తే.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు, రామ్ మాధవ్, పార్టీ సీనియర్ నేత పేరాల చంద్రశేఖర్ రావు, రాజ‌స్థాన్ ప్ర‌భుత్వ స‌లహాదారుగా ఉన్న వెదిరె శ్రీరాంలు బ‌లంగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

వీరిలో మురళీధరరావు, రామ్ మాధవ్ వీరిద్దరి పట్లా పార్టీ హైకమాండ్ కూడా సానుకూలతగా ఉండటంతో వీరిద్దరిలో ఒకరికి దక్కే అవకాశముంటుందనే ప్ర‌చారం జ‌రుగుతోంది. మరోవైపు తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేయాల‌ని అధిష్టానం భావిస్తోంది కాబ‌ట్టి కేవలం మురళీధరరావుకు మాత్ర‌మే ఈ ఛాన్స్ ఉంటుంద‌ని రాష్ట్ర స్థాయి నేతలు గ‌ట్టిగా చెబుతున్నారు. ఇంకోప‌క్క‌, పార్టీ సీనియర్ నేత పేరాల చంద్రశేఖర్ రావు కూడా తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. ఆయనకు ఢిల్లీ స్థాయిలో పరిచయాలుండటంతో తన ప్రయత్నం తాను చేసుకుంటున్నారు.

సంఘ్ పరివార్ తో కూడా పేరాలకు మంచి సంబంధాలున్నాయి. శ్రీరాం వెదిరె రాజస్థాన్ ప్రభుత్వ సలహాదారుగా పనిచేస్తున్నారు. తనకు ఇక్కడి నుంచి రాజ్యసభకు పంపించాలని ముఖ్యమంత్రి వసుంధరరాజే ద్వారా యత్నిస్తున్నారని తెలుస్తోంది. దీంతో ఇప్పుడు వెంక‌య్య సీటు కోసం వ‌రుస‌గా న‌లుగురు పోటీ పడుతుండ‌డంతో పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందో చూడాలి.