నంద్యాల‌పై చంద్ర‌బాబుకు తేడా కొడుతుందా..!

ఏపీలోని క‌ర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో సీఎం చంద్ర‌బాబుకు నంద్యాల‌పై ఎక్క‌డా లేని ప్రేమ పుట్టుకొచ్చేస్తోంది. నంద్యాల‌లో అధికార పార్టీగా ఉన్న టీడీపీకి ఇక్క‌డ గెలుపు అంత వీజీ కాద‌ని రిపోర్టులు చెపుతోన్న నేప‌థ్యంలో చంద్రబాబుకు చిరు చెమ‌ట‌లు ప‌ట్టేస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబు అక్క‌డ కులాల వారీగా నేత‌ల‌ను దింపుతున్నారు. ఉప ఎన్నికలో ఎట్టి పరిస్థితుల్లో గెలవాలన్న చంద్రబాబునాయుడి ఆదేశాలతో నంద్యాలపై నిధులు కుమ్మరిస్తున్నారు. మొన్నటి వరకు నంద్యాల అభివృద్ధికి పెద్దగా నిధులు విడుదల చేయని ప్రభుత్వం ప‌ది రోజులుగా పెద్ద ఎత్తున విడుద‌ల చేస్తోంది. 

ప్రభుత్వ పరంగా పది రోజుల నుంచి నంద్యాల పనులకే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. జూన్ 3న జరిగిన క్యాబినెట్లో 42 లక్షలు విలువతో  హౌసింగ్ స్కీమ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మున్సిపల్‌, రోడ్స్ అండ్‌ బిల్డింగ్స్‌ లోకేష్  ప్రాతినిధ్యం వహిస్తున్న గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ నుంచి ఒక్క రోజులో 4 జీవోలు విడుదల చేసి వందకోట్లు నంద్యాల చుట్టుప్రక్కల గ్రామాలకు కేటాయించారు. 

ఇక నియోజ‌క‌వ‌ర్గంలో భారీగా ఉన్న కాపుల‌ను ఆక‌ర్షించేందుకు రూ. 3 కోట్లతో కాపు క‌ళ్యాణ మండ‌పాన్ని నిర్మించేందుకు ప్ర‌భుత్వం అనుమ‌తి జారీ చేసింది. వైద్య ఆరోగ్యశాఖ నుండి నంద్యాల ప్రభుత్వాస్పత్రి అభివృద్ధి, వైద్య పరికరాల కొనుగోలు కోసం ఐదున్నర కోట్లు విడుదల చేశారు. ఇలా ఏ శాఖ నుంచి చూసినా నంద్యాల‌కు కోట్లాది రూపాయ‌లు విడుద‌ల‌వుతున్నాయి.

ఈ మూడేళ్ల‌లో నంద్యాల‌ను పెద్ద‌గా ప‌ట్టించుకుని చంద్ర‌బాబు ఇప్పుడు మాత్రం అపార‌ప్రేమ కురిపించేస్తున్నారు. ఇక నంద్యాల అసెంబ్లీ ఎన్నికకు ఆరుగురు మంత్రులను ఇన్‌చార్జ్‌లుగా నియ‌మించారు. జిల్లా మంత్రులు కేఈ కృష్ణమూర్తి , అఖిల ప్రియతో పాటు,..కాల్వ శ్రీనివాసులు, డాక్టర్‌ నారాయణ, ఆదినారాయణ రెడ్డి, అమర్నాథ్ రెడ్డిలకు బాధ్యత అప్పగించారు. ఇక ఇక్క‌డి మైనార్టీ నేత‌ల‌కు కార్పొరేష‌న్ ప‌ద‌వులు కూడా ఇస్తున్నారు. 

నంద్యాలకు  కేటాయిస్తున్న నిధులతో నిజంగా అభివృద్ధి జరుగుతుందా అంటే జరగదనే సమాధానం వస్తుంది. మ‌రి చంద్ర‌బాబు ఇక్క‌డ ఇంత హంగామా ఎందుకు చేస్తున్నాడ‌న్న ప్ర‌శ్న వేసుకుంటే ఆయ‌న‌కు ఇక్క‌డ గెలుపు మీద ఎక్క‌డో డౌట్ అయితే ఉంద‌ని అర్థ‌మ‌వుతోంది.