నారా బ్రాహ్మ‌ణిపై వైసీపీ అభ్య‌ర్థి ఖ‌రారే..!

ఏపీ సీఎం చంద్ర‌బాబు కోడ‌లు, హిందూపురం ఎమ్మెల్యే న‌టుడు బాల‌య్య బాబు కుమార్తె బ్రాహ్మ‌ణి రాజ‌కీయ ప్ర‌వేశంపై ఇప్ప‌టికే కొన్ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే, తాజాగా ఆమె ఎక్క‌డి నుంచి పోటీ చేస్తుంది? అనేది కూడా లీకైపోయింది. బ్రాహ్మ‌ణిని లోక్ స‌భ కు పంపాల‌ని బాబు గ‌త కొన్నాళ్ల కింద‌టే డిసైడ‌య్యారు. దీంతో ఆమెను గుంటూరు నుంచి ఎంపీగా పంపితే బాగుంటుంద‌ని నిర్ణ‌యించారు. ప్ర‌స్తుతం సూప‌ర్ స్టార్ అల్లుడు గ‌ల్లా జ‌య‌దేవ్ గుంటూరు నుంచి టీడీపీ ఎంపీగా ఉన్నారు. ఆయ‌న స్థానంలో బ్రాహ్మ‌ణిని నిల‌బెట్టాల‌ని బాబు సిద్ధ‌మ‌య్యారు.

మ‌రి ఈ వార్త తెలిసాక‌.. విప‌క్షం వైసీపీ ఊరుకుంటుందా? త‌న త‌ర‌ఫున క‌త్తిలాంటి అభ్య‌ర్థిని నిల‌బెట్టాల‌ని డిసైడ్ అయింది. ఎప్ప‌టి నుంచో వార్త‌ల్లో ఉన్న విజ్థాన్ ర‌త్తయ్య కుమారుడు శ్రీకృష్ణ‌దేవ‌రాయ‌లును బ్రాహ్మ‌ణిపై పోటీకి దింపాల‌ని నిర్ణ‌యించింద‌ట‌. ఎప్ప‌టి నుంచో ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి రావాల‌ని ట్రై చేస్తున్న ర‌త్త‌య్య‌కు కొన్ని కార‌ణాల వ‌ల్ల వెన‌బ‌డి పోతున్నాన‌నే అనే ఫీల్ ఉంది. ఈ క్ర‌మంలోనే ఆయ‌న అనేక పార్టీలు మారారు కూడా.

అయితే, 2014లో వైసీపీలో చేరి.. ప్ర‌స్తుతం అందులోనే కొన‌సాగుతున్నారు. ఈయ‌న కొడుకు శ్రీకృష్ణ‌దేవ‌రాయుల‌ను జ‌గ‌న్‌.. గుంటూరు వైసీపీ ఇంచార్జ్‌ను చేశారు. భ‌విష్య‌త్తులో ఈ ఎంపీ స్థానాన్ని ఈయ‌న‌కే కేటాయించాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యించార‌ట‌. అన్ని విధాలా ర‌త్త‌య్య స‌మ‌ర్ధుడ‌ని జ‌గ‌న్ ఇప్ప‌టికే డిసైడ్ అయిన నేప‌థ్యంలో ఆయ‌న కుమారుడికి బ్రాహ్మ‌ణిని ఎదుర్కొనే ఛాన్స్ ఇవ్వాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు స‌మాచారం. దీంతో ఈ స్థానంలో పోటీ ర‌స‌వ‌త్త‌రంగా మారే ఛాన్స్ ఉంద‌ని స‌మాచారం.