నెల్లూరు వైసీపీలో టిక్కెట్ల ర‌గ‌డ‌

వైసీపీకి ముందునుంచి బ‌లంగా ఉన్న నెల్లూరు జిల్లాలో ఇప్పుడు ఆ పార్టీలో నాయ‌కుల మ‌ధ్య కాక రేగుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు మ‌రో 20 నెల‌ల టైం ఉన్న వేళ వైసీపీ పార్టీ బ‌లోపేతానికి గ‌డ‌ప గ‌డ‌ప‌కు వైసీపీతో పాటు ప్లీన‌రీలు నిర్వ‌హిస్తోంది. ఈ క్ర‌మంలోనే కావ‌లి నియోజ‌క‌వ‌ర్గ ప్లీన‌రీలో ఎంపీ మేక‌పాటి రాజ‌మోహ‌న్‌రెడ్డి మాట్లాడుతూ వ‌చ్చే ఎన్నిక‌ల్లోను కావ‌లి టిక్కెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్ర‌తాప్‌కుమార్‌రెడ్డికే ద‌క్కుతుంద‌ని ప్ర‌క‌టించారు. ప్ర‌తాప్‌కుమార్ రెడ్డి క‌ష్ట‌కాలంలో వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు అండ‌గా నిల‌బ‌డ్డార‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లోను ఆయన‌కే టిక్కెట్టు ద‌క్కుతుంద‌ని కార్య‌క‌ర్త‌ల స‌మ‌క్షంలో ప్ర‌క‌టించారు.

మేక‌పాటి ఆ ప్ర‌క‌ట‌న చేశారో లేదో మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువ‌ర్థ‌న్‌రెడ్డి మ‌ధ్య‌లోనే లేచి వెళ్లిపోయారు. ఇక ఆయ‌న అనుచ‌రులు ఒక్క‌సారిగా భ‌గ్గుమ‌న్నారు. టిక్కెట్లు ఇవ్వ‌డానికి మేక‌పాటి ఎవ‌ర‌ని వారు ప్ర‌శ్నిస్తున్నారు. దీంతో వైసీపీ బ‌లంగా ఉండి, ఆ పార్టీ సిట్టింగ్ స్థాన‌మైన కావ‌లిలోనే ఇప్పుడు వైసీపీకి గ్రూపు రాజ‌కీయాలు పెద్ద త‌ల‌నొప్పిగా మారాయి. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి పార్టీని మ‌రింత బ‌లోపేతం చేయాల్సింది పోయి నాయ‌కులు ఇప్ప‌టి నుంచే త‌న్నులాట‌ల‌కు దిగ‌డం మైన‌స్‌గా మారింది.

ఈ ప‌రిస్థితి జిల్లాలో ఒక్క కావ‌లిలోనే కాదు గూడూరు, కోవూరు, వెంక‌ట‌గిరిలోను నెల‌కొంది. ఇక్క‌డ సిట్టింగ్ ఇన్‌చార్జ్‌ల‌కు కాకుండా కొత్త వ్య‌క్తులు సైతం త‌మ‌కు టిక్కెట్లు కావాల‌ని తెర‌వెన‌క చాటుమాటు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. దీంతో టోట‌ల్ జిల్లా వ్యాప్తంగా పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్న చోట‌, పార్టీ ఎమ్మెల్యేలు లేని నియోజ‌క‌వ‌ర్గాల్లోను వైసీపీలో వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి టిక్కెట్ల ఫైటింగ్ అప్పుడే షురూ అయిపోయింది.