వైసీపీలో ఆ ఇద్ద‌రు సిట్టింగ్‌ల‌కు నో టిక్కెట్‌

గ‌త ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు ఎన్నిక‌ల్లో తానే గెలుస్తాన‌ని తిరుగులేని మెజార్టీతో సీఎం అవుతాన‌ని వైసీపీ అధినేత జ‌గ‌న్ ఎంతో ధీమాతో ఉండేవారు. ఎన్నిక‌ల ముందు వ‌ర‌కు ఎంతో ధీమాతో ఉన్న జ‌గ‌న్ ఎన్నిక‌ల్లో మాత్రం బొక్క‌బోర్లాప‌డ్డాడు. ప్ర‌తిప‌క్ష నేత‌గా స‌రిపెట్టుకున్నాడు. ఎన్నిక‌ల త‌ర్వాత కూడా జ‌గ‌న్ రోజు రోజుకు రాజ‌కీయంగా వీక్ అవుతూ వ‌స్తున్నాడు. వైసీపీ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో గెలిచిన ఎమ్మెల్యేల్లో ఇప్ప‌టికే 21 మంది అధికార టీడీపీలోకి జంప్ చేసేశారు.

ఈ క్ర‌మంలోనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌క‌పోతే రాజ‌కీయంగా జ‌గ‌న్ ఫ్యూచ‌ర్ దాదాపు క్లోజ్ అయిన‌ట్టే. ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్ ఎన్నిక‌ల వ్యూహాల‌కు స్పెష‌లిస్ట్‌గా పేరు తెచ్చుకున్న ప్ర‌శాంత్ కిషోర్‌ను రంగంలోకి దించాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. ప్ర‌శాంత్ కిషోర్ జ‌గ‌న్ ప్ర‌సంగంపై ఇప్ప‌టికే ప‌లు సూచ‌న‌లు చేసిన‌ట్టు తెలుస్తోంది. జ‌గ‌న్ గ‌తంలో ప‌దే ప‌దే తానే నెక్ట్స్ సీఎంను అన్న ప‌దం వాడేవారు. ఇప్పుడు ఆ ప‌దం ఆయ‌న నోటి వెంట రావ‌డం చాలా వ‌ర‌కు త‌గ్గిపోయింది. జ‌గ‌న్‌లో ఈ మార్పుకు ప్ర‌శాంత్ కిషోరే కార‌ణ‌మట‌.

ఇక ఏపీలోని 175 నియోజ‌క‌వ‌ర్గాలు, 25 ఎంపీ సీట్ల‌పై త‌న టీంతో స‌ర్వే చేయిస్తోన్న ప్ర‌శాంత్ కిషోర్ ఇద్ద‌రు సిట్టింగ్ ఎంపీల‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిక్కెట్లు ఇవ్వ‌వ‌ద్ద‌ని జ‌గ‌న్‌కు సూచించిన‌ట్టు విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం ద్వారా తెలుస్తోంది. ప్ర‌శాంత్ కిషోర్ టిక్కెట్లు ఇవ్వ‌వ‌ద్ద‌న్న ఎంపీల‌లో నెల్లూరు ఎంపీ మేకపాటి రాజ‌మోహ‌న్‌రెడ్డి, తిరుప‌తి ఎంపీ వ‌ర‌ప్ర‌సాద్ ఉన్నార‌ట‌. వీరిద్ద‌రి బ‌దులుగా కొత్త వ్య‌క్తుల‌కు ఇక్క‌డ టిక్కెట్లు ఇవ్వాల‌ని జ‌గ‌న్‌కు కిషోర్ చెప్పిన‌ట్టు తెలుస్తోంది.

వీరిద్ద‌రిపై ప్ర‌శాంత్ టీం చేసిన స‌ర్వేలో తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మైంద‌ట‌. వీరు చాలా అంశాల్లో వెన‌క‌బ‌డిన అంశాల‌ను ఆయ‌న జ‌గ‌న్‌కు ఇచ్చిన నివేదిక‌లో పొందుప‌ర‌చిన‌ట్టు తెలుస్తోంది. మ‌రి జ‌గ‌న్ ప్ర‌శాంత్ స‌ల‌హా ఈ విష‌యంలో ఎంత వ‌ర‌కు పాటిస్తాడో చూడాలి.