నంద్యాల‌లో టీడీపీకి క‌ష్టాలు..!

ఏపీలోని క‌ర్నూలు జిల్లా నంద్యాల నియోజకవర్గానికి త్వ‌ర‌లో జ‌రిగే ఉప ఎన్నిక‌లు ర‌స‌వ‌త్త‌రంగా మార‌నున్నాయి. నిన్న‌టి వ‌ర‌కు టీడీపీలో ఉన్న మాజీ మంత్రి శిల్పా మోహ‌న్‌రెడ్డి ఈ రోజు వైసీపీలో చేర‌డంతో ఇక్క‌డ బ‌లాబలాలు మారుతున్నాయి. నిన్న‌టి వ‌ర‌కు ఇక్క‌డ టీడీపీ మూడు గ్రూపులుగా ఉంది. ఈ మూడు గ్రూపుల్లో ఒక‌రికి మ‌రొక‌రితో అస్స‌లు పొస‌గ‌లేదు. భూమా వ‌ర్గం, శిల్పా వ‌ర్గం, మాజీ మంత్రి ఫ‌రూఖ్ ఇలా వీరు వేర్వేరు గ్రూపులుగా వ్య‌వ‌హ‌రిస్తూ వ‌చ్చారు. అయితే ముగ్గురు కీల‌క నాయ‌కులు టీడీపీలోనే ఉండ‌డంతో పార్టీలో విబేధాలు ఉన్నా పైకి మాత్రం బ‌లంగా ఉంది.

అయితే ఇప్పుడు సీన్ రివ‌ర్స్ అయ్యింది. శిల్పా మోహ‌న్‌రెడ్డి వైసీపీలో చేర‌డంతో ఇప్పుడు వైసీపీలో ఇక్క‌డ మూడు బ‌ల‌మైన వ‌ర్గాలు ఉన్న‌ట్ల‌య్యింది. శిల్పా త‌న‌తో పాటు త‌న అనుచ‌రులుగా ఉన్న ప్ర‌జాప్ర‌తినిధుల‌తో వైసీపీలోకి వెళ్లిపోతున్నారు. ఇప్ప‌టికే ఇక్క‌డ వైసీపీలో ఆ పార్టీ నంద్యాల నియోజకవర్గ ఇన్ ఛార్జి రాజగోపాల్ రెడ్డి, మాజీ ఎంపీ గంగుల ప్రతాప్ రెడ్డి టిక్కెట్ ఆశిస్తున్నారు. ఇప్పుడు వీరికి శిల్పా తోడ‌యిన‌ట్ల‌య్యింది.

క‌ర్నూలు జిల్లాలో విన‌ప‌డుతోన్న రాజ‌కీయ చ‌ర్చ‌ల ప్ర‌కారం శిల్పాకు టిక్కెట్ ఇస్తాన‌ని జ‌గ‌న్ నుంచి స్ప‌ష్ట‌మైన హామీ వ‌చ్చి ఉంటుంద‌ని, అందుకే ఆయ‌న వైసీపీలోకి వెళ్లార‌ని అంటున్నారు. ఒక‌వేళ అదే జ‌రిగితే జ‌గ‌న్ ఇక్క‌డ ఉన్న రాజ్‌గోపాల్‌రెడ్డి, గంగుల ప్ర‌తాప్‌రెడ్డికి ఇత‌ర ప‌ద‌వులు ఇస్తామ‌ని న‌చ్చ‌చెప్పి ఈ ముగ్గురిని స‌మ‌న్వ‌యం చేస్తే ఇక్క‌డ టీడీపీకి గెలుపు క‌ష్ట‌మే అన్న చ‌ర్చ‌లు విన‌ప‌డుతున్నాయి.

వైసీపీ నుంచి శిల్పా మోహ‌న్‌రెడ్డి బ‌రిలో ఉంటే టీడీపీ టిక్కెట్టు ఎవ‌రికి ఇస్తుంద‌న్న‌ది స‌స్పెన్స్‌గానే మారింది. ఇప్పుడు ఇక్క‌డ టిక్కెట్ ఇవ్వ‌డం వ‌ర‌కు చంద్ర‌బాబుకు త‌ల‌పోటు త‌ప్పినా గెలుపుమాత్రం క‌త్తిమీద సాములాంటిదే. టీడీపీ త‌ర‌పున భూమా సోదరుడు బ్రహ్మానందరెడ్డికి టిక్కెట్ ఇవ్వాలా? లేక నాగిరెడ్డి కూతురు మౌనికకు ఇవ్వాలా? అన్నదానిపై చర్చలు జరుపుతున్నారు.

మౌనికను రంగంలోకి దింపితే సెంటిమెంట్ వ‌ర్క్ అవుట్ అవుతుంద‌నుకున్నా మౌనిక‌, అఖిల‌ప్రియ ఇద్ద‌రూ చిన్న వ‌య‌స్సులో ఉండ‌డంతో వారికి రాజ‌కీయ అనుభ‌వం లేకోవ‌డంతో వ్యూహాలు ప‌న్న‌లేక‌పోతున్నారు. ఇక బ్ర‌హ్మానంద‌రెడ్డికి సైతం ఇక్క‌డ అంతంత మాత్రంగానే ప‌ట్టుఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు భూమా వెంటే ఆయ‌న న‌డుస్తూ వ‌చ్చారు. ఏదేమైనా నంద్యాల‌లో వైసీపీ అభ్య‌ర్థిగా శిల్పా మోహ‌న్‌రెడ్డి రంగంలో ఉంటే ఆయ‌న్ను ఢీకొట్టి గెల‌వ‌డం చంద్ర‌బాబుకు, టీడీపీకి పెద్ద స‌వాల్‌గానే ప్ర‌స్తుతం క‌నిపిస్తోంది.